హెన్రీ డేవిడ్ థోరో
దశాబ్దాలు గడుస్తున్నా దేశ ప్రజాస్వామ్య ప్రయాణం ప్రజా ఆకాంక్షలు నెరవేర్చే దిశగా నడవ లేదనడం వాస్తవ దూరం కాదు. ప్రజా భాగస్వామ్యంతోనే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. అందుకు ప్రజలే చొరవ చూపాలి. రాజకీయ, పాలనా వ్యవస్థలపై అవగాహన పెంచుకొని ఉద్యమించాలి. అందుకు అమెరికా తాత్త్వికవేత్త థోరో రచనలు బాగా దోహదం చేస్తాయి.
ఆయన రచన ‘సివిల్ డిబీడియన్స్’ (శాసనోల్లంఘన) మహాత్మాగాంధీని అమితంగా ఆకర్షించింది. కేంబ్రిడ్జ్ విశ్వ విద్యాలయంలో చదువుతున్నప్పుడే దీన్ని చదివారాయన. దక్షిణాఫ్రికాలో ఆసియా వాసుల హక్కుల కోసం ఈ సిద్ధాంతాన్ని సంధించి పోరాటం చేశారు. శాసనోల్లంఘనను మాతృ భాషలోకి అనువదించి సహచరులకు అందించారు. 1919లో బిటిష్‌వాళ్లు రౌలట్ చట్టాన్ని ప్రతిపాదించినపుడూ, తరువాతి కాలం (1930)లోనూ శాసనోల్లంఘన సిద్ధాంతం అనుసరించి ఉద్యమం నిర్మించారు. దేశానికి స్వాతంత్య్రం తెచ్చారు.
హెన్రీ డేవిడ్ థోరో అమెరికాలో 1817 జులై 12న పుట్టారు. నలభై నాలుగు ఏళ్ళు జీవించి 1862లో మరణించారు. సివిల్ డిసొబీడియన్స్ గ్రంథం మసాచుసెట్స్‌లో 1849లో ప్రచురితమయ్యింది. ఇది చిన్న పుస్తకం. కానీ బలమైన రాజకీయ రచన. మేల్కొలిపే తాత్విక చింతన.
ప్రభుత్వం, రాజకీయ దోపిడీ, జైళ్ళు, అహింసా మార్గం, ప్రజల హక్కులు, పేదరికం, నైతిక విలువలు, యుద్ధం, అజ్ఞానం, మానవ సంబంధాల ప్రాముఖ్యం వంటి ఎన్నో ముఖ్య విషయాలు ఈ పుస్తకం ద్వారా థోరో మన ముందు ఉంచారు. ఈ రచన వచ్చి 175 ఏళ్ళు అయింది. దీనిలోని ‘నామమాత్రంగా పాలించే ప్రభుత్వమే ఉత్తమ ప్రభుత్వం. ఇదే నా ఆదర్శం. ప్రభుత్వం అతి తొందరగా ఆ విధంగా పాలించేటట్లు చేయుటే నా అభిలాష.’ అనే ప్రారంభ వాక్యాలు సమకాలిక రచయిత జాన్ స్టువార్ట్ మిల్ అన్నవి. థోరో కవి, తాత్వికుడు, వ్యాసకర్త, ప్రకృతి ప్రేమికుడు. ఆయన ఏం చెప్పాడో అదే ఆచరించిన మహోన్నత నైతికశిఖరం.
మన కులపోడనో, ఊరి వాడనో, రాజ వంశీకుడనో, ఫలానా పార్టీ వాడనో, మతం వాడనో, సినీ నటుడనో, ప్రలోభాలకు లొంగో ఓటు వేసి గెలిపించి చట్ట సభకు పంపితే వచ్చే ఫలితాలు ఎలా ఉంటాయో చూస్తున్నాం. ఆ చేదు ఫలితాలు అనుభవిస్తున్నాం. ఎన్నికలు చేసే మంచి ఎంత? ప్రాతినిధ్య ప్రజాస్వామ్య విధానంతో వచ్చే మంచి చెడులు ఏమిటి అనేది మనం తెలుసుకోవాలి. వీటిని థోరో తన రచనలో చర్చించారు. శాసనోల్లంఘన రచనలోని ప్రజాస్వామ్య భావనలు జీర్ణించుకొని, నైతికంగా ఎదిగి, లోపాలు చక్కదిద్దుకోవడానికి మనం తయారైతే సమాజ వికాసం జరుగుతుంది. – వి. వరదరాజు, శ్రీకాకుళం
Comments
Please login to add a commentAdd a comment