భారత్‌లో ప్యానాసోనిక్ రిఫ్రిజిరేటర్ల తయారీ ప్లాంటు
ఆరు నెలల్లో మేక్ ఇన్ ఇండియా ఫోన్
♦ రూ.6 వేలలోపు 4జీ స్మార్ట్ ఫోన్ కూడా
♦ ప్యానాసోనిక్ ఇండియా ఎండీ మనీష్ శర్మ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ఎలక్ట్రానిక్స్ రంగంలో ఉన్న ప్యానాసోనిక్ భారత్‌లో రిఫ్రిజి రేటర్ల తయారీ ప్లాంటును ఏడాదిన్నరలో ఏర్పాటు చేస్తోంది. ప్రస్తుతం రిఫ్రిజిరేటర్లను కంపెనీ విదేశాల నుంచి దిగుమతి చేసుకుని దేశంలో విక్రయిస్తోంది. రూ.200-300 కోట్ల అంచనా వ్యయంతో 6-10 లక్షల యూనిట్ల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో ప్లాంటు నెలకొల్పుతామని ప్యానాసోనిక్ ఇండియా ఎండీ మనీష్ శర్మ తెలిపారు. ఇండియా గాడ్జెట్ ఎక్స్‌పోలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. భారత్‌తోపాటు మధ్యప్రాచ్య, ఆఫ్రికా దేశాల కు ఇక్కడ తయారైన రిఫ్రిజిరేటర్లను ఎగుమతి చేస్తామని వెల్లడించారు. భారత్‌ను హబ్‌గా చేసుకుంటామని వివరించారు.
మేక్ ఇన్ ఇండియా ఫోన్..
మొబైల్ ఫోన్లను సైతం కంపెనీ విదేశాల నుంచి దిగుమతి చేస్తోంది. ఆరు నెలల్లో మేక్ ఇన్ ఇండియ ఫోన్ తీసుకొస్తామని ఎండీ పేర్కొన్నారు. సొంతంగా ప్లాంటు పెట్టడమా, లేదా థర్డ్ పార్టీ కంపెనీతో చేతులు కలపడమా త్వరలోనే వెల్లడిస్తామన్నారు. తయారీ సామర్థ్యం నెలకు 10 ల క్షల యూనిట్లు ఉంటుందన్నారు. ‘2014-15లో ఆదాయంలో మొబైల్స్ విభాగం వాటా 5 శాతం మాత్రమే. 2015-16లో ఇది 20 శాతం చేరనుంది. నెలకు 3.20 లక్షల మొబైల్ ఫోన్లు విక్రయిస్తున్నాం. మార్చికల్లా రూ.6 వేలలోపు ధరలో 4జీ స్మార్ట్‌ఫోన్ తీసుకొస్తాం’ అని వెల్లడించారు.
ధరలు పెరగొచ్చు: రూపాయి పతనం కారణంగా వివిధ కంపెనీల గృహోపకరణాల ధరలు అక్టోబరు నుంచి 3-5 శాతం పెరిగే చాన్స్ ఉందని కంన్సూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లయాన్సెస్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్(సియామా) ప్రెసిడెంట్ కూడా అయిన మనీష్ శర్మ తెలిపారు. గతేడాది పరిశ్రమ రూ.48,000 కోట్ల టర్నోవర్ నమోదు చేసింది. ఈ ఏడాది రూ.52,000 కోట్లు దాటుతుందని అంచనాగా చెప్పారు. ఫైనాన్స్ కంపెనీల జీరో ఫైనాన్స్ పథకాలతో అమ్మకాలకు బూస్ట్‌నిస్తుందన్నారు. వ్యాపార అవకాశాలు ఉన్న దేశాలతో స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలు పరిశ్రమకు అనుకూలంగా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకున్నప్పుడే మేక్ ఇన్ ఇండియా విజయవంతం అవుతుందని చెప్పారు.