పాత ఫోన్ లలోనూ ‘పానిక్’ బటన్!
న్యూఢిల్లీ: ప్రస్తుతం వాడకంలో ఉన్న ప్రతి మొబైల్ హ్యాండ్‌సెట్‌లోనూ పానిక్ బటన్ లాంటి ఫీచర్‌ను పొందుపరచాలని మొబైల్ తయారీ కంపెనీలను డాట్ ఆదేశించింది. పాత ఫోన్లలో పానిక్ బటన్ ఫీచర్‌ను అమర్చడం కోసం కొత్త సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాలేషన్ నిమిత్తం రిటైల్ ఔట్‌లెట్స్‌లో ప్రత్యేకమైన సదుపాయాన్ని ఏర్పాటు చేయాలని పేర్కొంది. పానిక్ బటన్ అంటే.. ఫోన్ వినియోగదారుడు ఏదైనా అత్యవసర సమయాల్లో అతని ఫోన్‌లోని 5 లేదా 9 బటన్‌ను నొక్కితే..
అప్పుడు ఆ ఫోన్ నుంచి ప్రభుత్వ విభాగాలకు ఒక కాల్ (112 నెంబర్‌కు) వెళుతుంది. అప్పుడు ఆయా విభాగాలు వెంటనే స్పందించి.. మొబైల్ వినియోగదారునికి సాయం అందిస్తాయి. వచ్చే ఏడాది (2017) జనవరి 1 నుంచి విక్రయించే అన్ని ఫోన్లలోనూ ఈ పానిక్ బటన్ ఉండాలని డాట్ ఇప్పటికే మొబైల్ హ్యాండ్‌సెట్స్ తయారీ కంపెనీలకు ఆదేశాలను జారీ చేసింది. నిర్భయ ఘటన నేపథ్యంలో ప్రభుత్వం ఈ చర్యను తీసుకుంది.