Panic Button
-
TSRTC: ప్యానిక్ బటన్.. సీసీ కెమెరాలు.. అందుబాటులోకి ఆధునిక బస్సులు!
సాక్షి, హైదరాబాద్: ప్యానిక్ బటన్.. ప్రయాణ సమయాల్లో మహిళలు తాము ప్రమాదంలో ఉన్నామని.. తమను కాపాడాలని పోలీసులకు తెలిపేందుకు వినియోగించే సాంకేతిక సాధనం. అలాగే రోడ్డు ప్రమాదాలు, అగ్నిప్రమాదాలు, వరదల వంటి ప్రకృతి విపత్తుల్లో వాహనాలు చిక్కుకున్నప్పుడు సహాయం కోరేందుకు దోహదపడే పరికరం. కేవలం ఒక్క బటన్‌ను నొక్కడం ద్వారా వాహన లైవ్ లొకేషన్‌ను నేరుగా పోలీసులు లేదా సహాయ బృందాలకు తెలియజేయగలగడం దీని ప్రత్యేకత. ఢిల్లీ నిర్భయ ఘటన తర్వాత విస్తృతంగా వ్యాప్తిలోకి వచ్చిన ఈ సాధనం ఇప్పుడు టీఎస్ఆర్టీసీ బస్సుల్లో కూడా అందుబాటులోకి రాబోతోంది. కేంద్ర ప్రభుత్వం నిర్భయ పథకంలో భాగంగా మహిళా భద్రత కోసం అన్ని ప్రజారవాణా వాహనాల్లో ప్యానిక్ బటన్లు, వాహన లొకేషన్ ట్రాకింగ్ పరికరాల ఏర్పాటును తప్పనిసరి చేసింది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ ఇప్పుడు కొత్తగా కొంటున్న బస్సుల్లో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. తాజాగా ఆర్టీసీకి చేరిన 50 కొత్త సూపర్ లగ్జరీ బస్సులను సంస్థ శనివారం వినియోగంలోకి తెస్తోంది. ఈ బస్సులను అశోక్ లేలాండ్ కంపెనీ రూపొందించింది. మొత్తం 630 సూపర్ లగ్జరీ బస్సుల ఆర్డర్ పొందిన ఆ కంపెనీ తాజాగా 50 బస్సులను అందించింది. మిగతావి రోజుకు కొన్ని చొప్పున జనవరి నాటికి పూర్తిగా సరఫరా చేయనుంది. ఈ బటన్ నొక్కడం ద్వారా సమాచారాన్ని పొందే కమాండ్ కంట్రోల్ రూమ్ బస్‌భవన్‌లో ఏర్పాటు చేస్తున్నారు. అయితే అది ఇంకా అందుబాటులోకి రాలేదు. అందుబాటులోకి రాగానే బస్సుల్లోని ప్యానిక్ బటన్‌తో ఆ వ్యవస్థ అనుసంధానమై పనిచేయడం ప్రారంభిస్తుంది. ప్రతి బస్సులో రెండు వీడియో కెమెరాలు.. బస్సుల్లో అవాంఛిత ఘటనలు చోటుచేసుకున్నప్పుడు కారణాలను గుర్తించే వీలు ప్రస్తుతం లేదు. కొత్తగా వచ్చే బస్సుల్లో సెక్యూరిటీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. డ్రైవర్ కేబిన్ వద్ద ఉండే ఓ సీసీ కెమెరా.. బస్సులోకి ఎక్కే ప్రయాణికులను గుర్తిస్తుంది. డ్రైవర్ వెనుక భాగంలో ఉండే మరో కెమెరా బస్సు చివరి వరకు లోపలి భాగాన్ని చిత్రిస్తుంది. ఈ రెండు కెమెరాలు చిత్రించిన వీడియో ఫీడ్ 15 రోజుల వరకు నిక్షిప్తమవుతుంది. ఇక బస్సును రివర్స్ చేసేటప్పుడు డ్రైవర్‌కు ఎన్నో ఇబ్బందులు తలెత్తుతుంటాయి. కొత్త బస్సుల్లో రివర్స్ కెమెరాలను బిగించారు. బస్సు వెనుకవైపు ఉండే కెమెరా రివర్స్ చేసేటప్పుడు డ్రైవర్‌కు వెనుక ప్రాంతాన్ని చూపుతుంది. త్వరలో బస్సు ట్రాకింగ్ వ్యవస్థ కూడా అందుబాటులోకి రానుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా బస్సులో ఉండనున్నాయి. ఫైర్ డిటెక్షన్ అండ్ అలారం సిస్టం కూడా ఏర్పాటు చేశారు. మోతాదుకు మించి వేడి ఉత్పన్నమైనా లేక పొగ వచ్చినా ఈ వ్యవస్థ గుర్తించి అలారం మోగిస్తుంది. దీంతో డ్రైవర్ అప్రమత్తమై బస్సును ఆపేసి ప్రయాణికులను కిందకు దించేందుకు వీలవుతుంది. షార్ట్ సర్క్యూట్ వల్ల తరచూ బస్సుల్లో చోటు చేసుకొనే అగ్రిప్రమాదాలను ముందే గుర్తించి ప్రయాణికులకు ప్రాణాపాయాన్ని తప్పించేందుకు ఈ అలారంతో అవకాశం కలుగుతుంది. అలాగే ఈ బస్సుల్లో సెల్‌ఫోన్ చార్జింగ్ కోసం ఏర్పాట్లు చేయడంతోపాటు వినోదం కోసం టీవీలను ఏర్పాటు చేశారు. 50 కొత్త సూపర్ లగ్జరీ బస్సులను రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ శనివారం ట్యాంక్‌బండ్‌పై ప్రారంభించనున్నారు. సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని రెండ్రోజుల క్రితం ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి ప్రకటించినప్పటికీ సీఎం ఇతర కార్యక్రమాల్లో బిజీగా ఉండటంతో రవాణాశాఖ మంత్రి ప్రారంభించనున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది. మొత్తం 1,016 కొత్త బస్సులకు ఆర్టీసీ ఏర్పాట్లు చేసుకుంటోంది. ఇందులో 630 సూపర్ లగ్జరీ బస్సులు, 370 డీలక్స్/ఎక్స్‌ప్రెస్ బస్సులు, 16 ఏసీ స్లీపర్ బస్సులున్నాయి. త్వరలో 130 డీలక్స్ బస్సులు కూడా అందనున్నాయి. శబరిమల.. సంక్రాంతి స్పెషల్‌గా సేవలు.. ప్రస్తుతం శబరిమల అయ్యప్ప భక్తుల కోసం దాదాపు 200 బస్సులు బుక్ అయ్యాయి. మరిన్ని బుక్ కానున్నాయి. శబరిమల దూర ప్రాంతమైనందున వీలైనంత వరకు కొత్త బస్సులు కేటాయించనున్నారు. ఇప్పుడు అందుతున్న సూపర్ లగ్జరీ బస్సుల్లో కొన్నింటిని అందుకు వినియోగించనున్నారు. సంక్రాంతి రద్దీ దృష్ట్యా దూర ప్రాంతాలకు స్పెషల్ బస్సులు నడుపుతున్నారు. కొత్త బస్సుల్లో కొన్నింటిని అందుకు కేటాయించనున్నారు. (క్లిక్ చేయండి: తెలంగాణ భవన్ ముందు ట్రాఫిక్ నరకం) -
మహిళల భద్రతకు 3వేల కోట్లు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ, హైదరాబాద్‌తోపాటు 8 మహానగరాల్లో మహిళల భద్రత కోసం కేంద్రం ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రకటించింది. దీన్లో భాగంగా వివిధ సౌకర్యాల కల్పనకు ‘నిర్భయ’ నిధుల నుంచి రూ.3,000 కోట్లను వెచ్చించనున్నట్లు వెల్లడించింది. ఆపదలో ఉన్నట్లు బాధితులు సమాచారం పంపే ప్యానిక్ బటన్స్, మహిళా పోలీస్ గస్తీ బృందాలతోపాటు ఫోరెన్సిక్, సైబర్ క్రైం నిపుణులతో కూడిన పోలీస్స్టేషన్లను ఏర్పాటు చేయనుంది. దీంతోపాటు చిన్నారులు, మహిళల కోసం సంచార విశ్రాంతి గృహాలు, స్మార్ట్ ఎల్ఈడీ వీధి దీపాలను అందుబాటులోకి తేనున్నట్లు హోం శాఖ పేర్కొంది. దేశవ్యాప్తంగా మహిళలపై నేరాలు పెరుగుతున్న దృష్ట్యా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని అధికారులు తెలిపారు. ప్రతిపాదిత చర్యలివీ.. ► మహిళలకు సమగ్ర భద్రతే లక్ష్యంగా ప్రకటించిన ఈ పథకంలో షీ–టీమ్స్ తరహాలో మహిళా పోలీసు గస్తీ బృందాలు, అత్యవసర సమయాల్లో సత్వరమే స్పందించేందుకు ‘అభయం’ పేరుతో పోలీస్ వ్యాన్ల ఏర్పాటు. ► బహిరంగ ప్రదేశాల్లో మహిళలు, చిన్నారులకు భద్రతను కల్పించేందుకు, వారిలో భద్రతా భావాన్ని పెంపొందించేందుకు నేరాలకు అవకాశమున్న చోట్ల ‘రక్షిత’ ప్రాంతాల అభివృద్ధి, ఎల్ఈడీ వీధి దీపాల ఏర్పాటు, సీసీటీవీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ సెంటర్లకు అనుసంధానిస్తారు. ► ప్రజా రవాణా వ్యవస్థలో భద్రతా చర్యలు, ఆపదలో ఉన్నప్పుడు పోలీసులను అప్రమత్తం చేసే ప్యానిక్ బటన్లను అమర్చడం, సురక్షిత ప్రాంతాల్లో టాయిలెట్లు, చిన్నారులు, మహిళల కోసం సంచార విశ్రాంతి గృహాల(డార్మిటరీలు)ను అందుబాటులోకి తెస్తారు. ► బాధితులు నిర్భయంగా పోలీస్ స్టేషన్లకు వచ్చి ఫిర్యాదులు ఇవ్వటానికి, తక్షణ సాయం పొందటానికి వీలుగా మహిళా హెల్ప్ డెస్క్‌లు, మహిళా కౌన్సిలర్లు, సైబర్ క్రైం, ఫోరెన్సిక్ నిపుణుల నియామకం. ఏ నగరానికి ఎంత? దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ‘నిర్భయ’ ఘటన నేపథ్యంలో 2013లో కేంద్రం నిర్భయ నిధిని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ప్రకటించిన కార్యక్రమానికి ‘నిర్భయ’ నిధి నుంచి రూ.2,919.55 కోట్లను కేటాయించాలని కేంద్రం నిర్ణయించింది. 2018–19, 2020–21 సంవత్సరాల్లో అమలయ్యే ఈ పథకానికి గాను ఢిల్లీకి రూ.663.67 కోట్లు, ముంబైకి రూ.252 కోట్లు, చెన్నైకి రూ.425.06 కోట్లు, అహ్మదాబాద్‌కు రూ.253 కోట్లు, కోల్‌కతా రూ.181.32 కోట్లు, బెంగళూరుకు రూ.667 కోట్లు , హైదరాబాద్‌కు రూ.282.50 కోట్లు, లక్నోకు రూ.195 కోట్లు కేటాయించినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమం అమలుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60: 40 నిష్పత్తిలో నిధులు కేటాయిస్తాయి. నేషనల్ క్రైం రికార్డ్స్’ బ్యూరో గణాంకాల ప్రకారం.. 2015లో మహిళలపై దేశవ్యాప్తంగా 3,29,243 నేరాలు జరగ్గా 2016 నాటికి 3,38,954కు పెరిగాయి. -
బోగీల్లో ప్యానిక్ బటన్ -ఈశాన్య రైల్వే
సాక్షి, లక్నో: రైళ్లలో మహిళా ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్న రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రైలు బోగీల్లో ప్యానిక్ బటన్ ఏర్పాటు చేయనున్నామని ఈశాన్య రైల్వే విభాగం (ఎన్ఈఆర్) ప్రకటించింది. అలాగే రాత్రి పూట మహిళల రక్షణ కోసం మహిళా పోలీసులను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్టు వెల్లడించింది. రైళ్ళలో మహిళల భద్రతను బలోపేతం చేయాలన్న యోచన దృష్ట్యా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌లో మహిళల నియామకాలతోపాటు, రాత్రిపూట రైళ్ళలో మహిళా బోగీలన్నింటిలో మహిళా పోలీసులను నియమించాలని, ప్యానిక్ బటన్ వ్యవస్థను నెలకొల్పనున్నట్లు ఎన్ఈఆర్ సీనియర్ అధికారి సంజయ్ యాదవ్ ప్రకటించారు. ప్రమాద పరిస్థితుల్లో ఉన్న మహిళలు ఈ ప్యానిక్ బటన్‌ను నొక్కిన వెంటనే బోగీ బయట, రైలు డ్రైవర్ వద్ద, కంట్రోల్ రూంలో ప్రమాద హెచ్చరిక లైట్లు వెలుగుతాయని వివరించారు. ప్రస్తుతం, మహిళా ప్రయాణీకులు కాల్ లేదా ఎస్ఎంఎస్ , హెల్ప్‌లైన్ నెంబర్లు,లేదా అత్యవసర పరిస్థితిలో గొలుసు-లాగడం లాంటి వాటిమీద ఆధారపడవలసి వస్తోందీ కానీ ప్యానిక్బటన్ వ్యవస్థతో తక్షణమే చర్య తీసుకునేఅవకాశం ఉందని తెలిపారు. సబర్బన్ రైళ్ల బోగీల్లో సీసీటీవీ ఏర్పాటును కూడా ఆలోచిస్తున్నామన్నారు. అలాగే మహిళా బోగీలను తొందరగా గుర్తించేందుకు వీలుగా రంగులను మార్చే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్టు చెప్పారు. -
26 నుంచి ప్రయోగాత్మకంగా ‘ప్యానిక్’
న్యూఢిల్లీ: మహిళల భద్రత కోసం అత్యవసర పరిస్థితుల్లో మొబైల్ ద్వారా అప్రమత్తం చేసే ప్యానిక్ బటన్ సౌకర్యాన్ని ఈ నెల 26 నుంచి ఉత్తరప్రదేశ్‌లో ప్రయోగాత్మకంగా అమలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ప్యానిక్ బటన్ సౌకర్యాన్ని 2017 జనవరి నుంచి అమలు చేయాలని కేంద్రం గతంలో నిర్ణయించినప్పటికీ వివిధ కారణాలతో వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రయోగం విజయవంతమైతే, దేశవ్యాప్తంగా అమలు చేస్తామని కేంద్ర మహిళ, శిశు అభివృద్ధి శాఖ మంత్రి మేనకా గాంధీ తెలిపారు. గతంలో చేపట్టిన ప్రయోగాల్లో అనేక బూటకపు కాల్స్ రావటంతో దీనిని అమలు చేయలేదన్నారు. పాత మొబైల్ వినియోగదారులు కీని నొక్కిన వెంటనే సమీపంలోని 25–50 మందికి సమాచారం అందుతుందని ఆ శాఖ సంయుక్త కార్యదర్శి చేతన్ సంఘీ తెలిపారు. ప్రస్తుతం పాత మొబైళ్ల(కీ ప్యాడ్ ఉన్న ఫోన్లు)ను మాత్రమే ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నామని, కొత్త మొబైళ్లలో ఈ సౌకర్యాన్ని ఇప్పటికే అందుబాటులో ఉందని స్పష్టం చేశారు. -
పానిక్ బటన్‌తో ఎల్జీ స్మార్ట్ ఫోన్
ధర రూ.13,990 న్యూఢిల్లీ: ఎల్జీ కంపెనీ పానిక్ బటన్ ఫీచర్‌తో కొత్త స్మార్ట్‌ఫోన్ కే10 2017ను తో మార్కెట్లోకి తెచ్చింది. ధర రూ.13,990 ఎల్జీ ఇండియా కార్పొరేట్ మార్కెటింగ్ హెడ్ అమిత్ గుజ్రాల్ చెప్పారు. ఈ పానిక్ బటన్‌ను నొక్కితే ఎమర్జెన్సీ నంబర్ 112కు కాల్ వెళుతుందని వివరించారు. 5.3 అంగుళాల డిస్ప్లే, 1.5 గిగా హెట్జ్ ఆక్టా–కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, వెనక భాగంలో 13 మెగాపిక్సెల్ కెమెరా, ముందు భాగంలో 5 మెగాపిక్సెల్ కెమెరా, 2,800 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలున్నాయని పేర్కొన్నారు. పానిక్ బటన్‌తో అందిస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్‌కు వినియోగదారుల నుంచి ఆదరణ బాగా ఉండగలదన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. మహిళల కోసమే ఈ స్మార్ట్‌ఫోన్‌ను అందించడం లేదని, విద్యార్ధులకు, ఇతరులను కూడా దృష్టిలో పెట్టుకొని ఈ స్మార్ట్‌ఫోన్‌ను అందిస్తున్నామని వివరించారు. రిటైల్ అవుట్‌లెట్స్ విస్తరణపై దృష్టి పెట్టామని, ఈ ఏడాది చివరికల్లా తమ మొబైల్ ఫోన్లు 8,000–10,000 రిటైల్ పాయింట్లలో లభ్యమవుతాయని వివరించారు. కాగా ఈ ఫోన్ ఆవిష్కరణ సభలో ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కూడా పాల్గొన్నారు. మొబైల్ పరిశ్రమలోనే మొదటగా ఎల్జీ కంపెనీ పానిక్ బటన్‌తో కూడిన స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తేవడం సంతోషంగా ఉందని ఆయన ట్వీట్ చేశారు. పానిక్ బటన్ తప్పనిసరి... భారత్‌లో అమ్ముడయ్యే అన్ని మొబైల్ ఫోన్లకు పానిక్ బటన్ ఉండాల్సిందేనని భారత ప్రభుత్వం తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. దీనికి గడువు తేదీని ఈ నెల 28న ప్రభుత్వం నిర్దేశించింది. నిర్భయపై అత్యాచారం నేపథ్యంలో మొబైల్ ఫోన్లలో పానిక్ బటన్‌ను జత చేయాలనే సూచన వ్యక్తమైంది. -
పానిక్ బటన్ ఏర్పాటుకు గడువు పొడిగింపు
న్యూఢిల్లీ: కొత్త మొబైల్ ఫోన్లలో పానిక్ బటన్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం మరో రెండు నెలలు గడువునిచ్చింది. తమ వద్ద విక్రయం కాని పానిక్ బటన్ ఫీచర్లేని ఫోన్లు చాలా ఉన్నాయనే మొబైల్ హ్యాండ్సెట్స్ తయారీ కంపెనీల విజ్ఞప్తి మేరకు కొత్త హ్యాండ్‌సెట్స్‌లో పానిక్ బటన్ ఏర్పాటుకు ఇది వరకు ఇచ్చిన గడువును ఫిబ్రవరి 28 వరకు పొడిగిస్తున్నామని టెలికం కార్యదర్శి జె.ఎస్.దీపర్ తెలిపారు. 2017 జనవరి 1 నుంచి దేశంలో విక్రయించే అన్ని మొబైల్ హ్యాండ్సెట్స్లోనూ పానిక్ బటన్ తప్పనిసరిగా ఉండాలని కేంద్రం గతేడాది ఏప్రిల్‌లోనే నిర్ణయం తీసుకుంది. -
ఎల్జీ ఎక్స్ స్క్రీన్ ధర ఎంతో తెలుసా?
న్యూఢిల్లీ: ప్రముఖ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తిదారు ఎల్జీ తన నూతన స్మార్ట్‌ఫోన్ 'ఎల్జీ ఎక్స్ స్క్రీన్'ను మార్కెట్ లో లాంచ్ చేసింది. దీనిధరను రూ.12,990 లుగా కంపెనీ నిర్ణయించింది. స్నాప్ డీల్ ద్వారా జులై 20 నుంచి అమ్మకాలు మొదలుకానున్నట్టు సంస్థ తెలిపింది. అలాగే ఎల్జీ ఎక్స్ స్క్రీన్' వినియోగదారులకు 45 రోజుల ఉచిత హంగామా మ్యూజిక్ వీడియో డౌన్లోడ్ అందిస్తోంది. వొడాఫోన్ స్మార్ట ఫోన్ వినియోగదారులకు డబుల్ డేటా ఉచితం. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన పానిక్ బటన్ ఇందులో అమర్చబడింది. వినియోగదారడు పవర్ బటన్ వరుసగా ఐదు సార్లు నొక్కితే నిర్దేశిత నెంబర్లకు హెచ్చరికలు పంపుతుంది. బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ ఆఫరింగ్‌లో తమ స్థానాన్ని బలపర్చుకోవడానికి డ్యూయల్ డిస్ప్లే ఫోన్ మార్కెట్లోకి తీసుకొస్తున్నట్టు కంపెనీ వెల్లడించినసంగతి తెలిసిందే. ఈ డ్యూయల్ డిస్ప్లే ఫోన్ ద్వారా నోటిఫికేషన్లను చూసుకోవడాని వేరే ప్రోగ్రామ్‌ను ఆపాల్సిన అవసరం ఉండదు. బ్రౌజర్లో వర్క్ చేసుకుంటూనే వాట్సప్, ఫేస్బుక్ నోటిఫికేషన్లను చూసుకోవచ్చు. ఒకేసారి రెండు ప్రోగ్రామ్స్‌పై వర్క్ చేసుకోవచ్చు. ఎల్జీ ఎక్స్ స్క్రీన్ ఫీచర్లు... 4.93 ఇంచ్ హెచ్డీ ఐపీఎస్ డిస్ప్లే, 1280-720 పిక్సెల్ స్ర్కీన్ రిజల్యూషన్ 1.76 ఇంచ్ సెకండరీ డిస్ప్లే, 520 x 80 పిక్సెల్ స్క్రీన్ రిజల్యూషన్ 1.2 జీహెచ్‌జడ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 410 ప్రాసెసర్, అడ్రినో 306 గ్రాఫిక్స్ 2 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 2 టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో 13 మెగాపిక్సెల్ రియర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్ 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా 4జీ ఎల్టీఈ, బ్లూటూత్ 4.1, ఎన్ఎఫ్సీ 120 గ్రాముల బరువు 7.1 ఎంఎ మందం 2300 ఎంఏహెచ్ బ్యాటరీ కాగా ఇటీవల కె10,కె 7 పేరుతో డబుల్ స్క్రీన్ స్మార్ట్ ఫోన్లను మార్కెట్ లో విడుదల చేసింది. -
పాత ఫోన్ లలోనూ ‘పానిక్’ బటన్!
న్యూఢిల్లీ: ప్రస్తుతం వాడకంలో ఉన్న ప్రతి మొబైల్ హ్యాండ్సెట్లోనూ పానిక్ బటన్ లాంటి ఫీచర్‌ను పొందుపరచాలని మొబైల్ తయారీ కంపెనీలను డాట్ ఆదేశించింది. పాత ఫోన్లలో పానిక్ బటన్ ఫీచర్‌ను అమర్చడం కోసం కొత్త సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ నిమిత్తం రిటైల్ ఔట్‌లెట్స్‌లో ప్రత్యేకమైన సదుపాయాన్ని ఏర్పాటు చేయాలని పేర్కొంది. పానిక్ బటన్ అంటే.. ఫోన్ వినియోగదారుడు ఏదైనా అత్యవసర సమయాల్లో అతని ఫోన్లోని 5 లేదా 9 బటన్‌ను నొక్కితే.. అప్పుడు ఆ ఫోన్ నుంచి ప్రభుత్వ విభాగాలకు ఒక కాల్ (112 నెంబర్‌కు) వెళుతుంది. అప్పుడు ఆయా విభాగాలు వెంటనే స్పందించి.. మొబైల్ వినియోగదారునికి సాయం అందిస్తాయి. వచ్చే ఏడాది (2017) జనవరి 1 నుంచి విక్రయించే అన్ని ఫోన్లలోనూ ఈ పానిక్ బటన్ ఉండాలని డాట్ ఇప్పటికే మొబైల్ హ్యాండ్సెట్స్ తయారీ కంపెనీలకు ఆదేశాలను జారీ చేసింది. నిర్భయ ఘటన నేపథ్యంలో ప్రభుత్వం ఈ చర్యను తీసుకుంది. -
‘ప్యానిక్ బటన్ వస్తోంది'
సాక్షి, హైదరాబాద్: అపాయంలో చిక్కుకున్న వారి సమాచారం క్షణాల్లో పోలీసులకు చేరవేసేందుకు సెల్ఫోన్లలో వచ్చే ఏడాది జనవరి నుంచి ప్యానిక్ బటన్ అందుబాటులోకి వస్తుందని కేంద్ర సమాచార, సాంకేతిక శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. అప్పటి నుంచి మార్కెట్లోకి వచ్చే అన్ని సెల్ఫోన్లలో ఈ సదుపాయం ఉండేలా చర్యలు తీసుకోవాలని కంపెనీలకు కేంద్రం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిందని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని నోవాటెల్ హోటల్లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. మహిళల భద్రతకు కేంద్రం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని, భద్రతకు, సెల్ఫోన్లను అనుసంధానం చేయాలని భావించి ప్యానిక్ బటన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. 5 లేదా 9 నంబర్లు ప్యానిక్ బటన్‌గా పనిచేస్తుందని, దాన్ని నొక్కగానే వెంటనే పోలీస్ కంట్రోల్ రూమ్‌కు, కుటుంబసభ్యులు లేదా స్నేహితులకు సమాచారం వెళ్తుందని వివరించారు. కాగా, ప్రమాదంలో ఉన్నవారు ఏ ప్రాంతంలో ఉన్నారో సులభంగా తెలుసుకునేందుకు అన్ని ఫోన్లలో అంతర్గతంగా (ఇన్‌బిల్ట్) జీపీఎస్ వ్యవస్థ ఏర్పాటు చేసేలా కేంద్రం చర్యలు తీసుకుంది. ఫోన్ తయారు చేసే సమయంలోనే జీపీఎస్ వ్యవస్థతో అనుసంధానం ఉండేలా ఏర్పాటు చేయబోతున్నారు. 2018 జనవరి నుంచి అన్ని కొత్త ఫోన్లలో ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది. -
బటన్ ప్రెస్ చేస్తే చాలు...వారికి మూడినట్టే
న్యూఢిల్లీ : ఆకతాయిల నుంచి మహిళలకు మరింత భద్రత కల్పించేందుకు డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ మొబైల్ ఫోన్లలో వినూత్న ఆవిష్కరణకు నాంది పలికింది. ఆపదలో ఉన్న మహిళలు తమ మొబైల్ నుంచి ఓ బటన్ నొక్కితే తక్షణమే పోలీసులు స్పందించేలా రంగం సిద్ధం చేసింది. పొరపాటున ఆ ఫోన్ ఆఫ్ లో కూడా ఉన్నా కూడా ఆ పానిక్ బటన్ పనిచేసేలా మొబైల్ తయారీ దారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. దీనికి సంబంధించి మొబైల్ కంపెనీలకు కేంద్ర సమాచార,ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. 2017 కల్లా భారత్ లో అమ్మే ప్రతి మొబైల్ ఫోన్లలో ఈ పానిక్ బటన్ ఉండాలని మంత్రి ఆదేశించారు. అదేవిధంగా 2018 జనవరి లోపల అన్ని మొబైల్ ఫోన్లు కచ్చితంగా హ్యాండ్ సెట్ వాడే యూజర్ ప్రాంతాన్ని గుర్తించే జీపీఎస్ ను పొందుపర్చాలని పేర్కొన్నారు. 100 నంబర్ కు డయల్ చేయడానికి అవకాశం, సమయం చిక్కని నేపథ్యంలో, సులభంగా ఫోన్ లో పొందుపర్చిన 'పానిక్ బటన్' ను ప్రెస్ చేసి సహాయం పొందేలా చర్యలు తీసుకుంటోంది. ఆపదలో ఉన్న మహిళ ఆ పానిక్ బటన్ ను ప్రెస్ చేస్తే చాలు వారి ఫోన్ నుంచి పోలీసులకు సందేశం వెళ్లి, వెంటనే ఆకతాయిల ఆపదలో ఉన్న మహిళను కాపాడేలా బటన్ ను రూపొందించాలని మంత్రి రవిశంకర్ తయారీ దారులను కోరారు. టెక్నాలజీ మానవ జీవితం మంచికే తోడ్పడాలని, మరీ ముఖ్యంగా మహిళల భద్రతకు ఇది ఎంతో ఉపయోగపడాలని మంత్రి వ్యాఖ్యానించారు. 2017 జనవరి 1 నుంచి ఏ మొబైల్ ఫోన్ పానిక్ బటన్ లేకుండా అమ్మకూడదనే నిర్ణయాన్ని తీసుకున్నామని మంత్రి స్పష్టం చేశారు. ఫీచర్ ఫోన్ హ్యాండ్ సెట్లు స్మార్ట్ ఫోన్ లలో న్యూమెరిక్ కీలు 5, 9 లను ఎమర్జెన్సీ బటన్ లుగా ఉండాలని, ఫోన్ ఆన్ లో ఉన్న, ఆఫ్ లో ఉన్న ఎమర్జెన్సీ బటన్ పనిచేసేలా హ్యాండ్ సెట్ తయారీదారులు ఫోన్లను రూపొందించాలని మంత్రి ఆదేశించారు. అలర్ట్ కూడా వెంటనే పోలీసులకు వెళ్లేలా బటన్ ను సెట్ చేయాలని ఆయన పేర్కొన్నారు. -
2017 నుంచి అన్ని ఫోన్లకూ పానిక్ బటన్
న్యూఢిల్లీ: ప్రమాద సమయాల్లో అత్యవసర ఫోన్‌కాల్స్‌ను మరింత సులభంగా చేసేందుకు వీలుగా 2017 జనవరి 1 నుంచి భారత్‌లో అమ్మే అన్ని ఫోన్లకు పానిక్ బటన్ ఉండాల్సిందేనన్న నిబంధనను తీసుకొచ్చినట్లు టెలికం మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. 2018 జనవరి 1 నుంచి జీపీఎస్ కూడా కచ్చితంగా ఉండాలన్నారు. ఏప్రిల్ 22న విడుదలైన ఒక ప్రకటన ప్రకారం ఫీచర్ ఫోన్లలో 5 లేదా 9 నంబరు బటన్లను అత్యవసర కాల్స్ చేసే పానిక్ బటన్‌గా వాడాలి. -
ట్యాక్సీల్లో పానిక్ బటన్..
సాక్షి, ముంబై: ప్రైవేటు ట్యాక్సీల్లో జరుగుతున్న హత్యలు, అత్యాచారాలు, చోరీల వంటి సంఘటనలను అరికట్టేందుకు ‘పానిక్ బటన్’ అమర్చాలని ఆర్టీవో యోచిస్తోంది. ఈ పరికరాన్ని నగర పోలీసు, ట్రాఫిక్ శాఖ, సంబంధిత ట్యాక్సీ కంపెనీ కాల్ సెంటర్‌తో అనుసంధాన పర్చాల్సి ఉంటుంది. అప్పుడే ఈ పరికరం బిగించి ప్రయోజనం ఉంటుందని అధికారులు అభిప్రాయపడ్డారు. అయితే ఈ ప్రతిపాదనకు ఆర్టీవో ఇంకా ఆమోద ముద్ర వేయలేదు. దేశ రాజధానిలో ఇటీవల ఓ ట్యాక్సీ డ్రైవర్ ఒంటరిగా ఉన్న మహిళాప్రయాణికురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. గతంలో ముంబైలో కూడా అపహరణ, చోరీ, హత్యలు, అత్యాచారాలు లాంటి సంఘటనలు అనేకం వెలుగులోకి వచ్చాయి. ఠాణేలో నాలుగు నెలల కిందట ఓ ఆటో డ్రైవర్ అపహరిస్తున్నట్లు గుర్తించిన స్వప్నాలి లాడ్ అనే మహిళ ప్రయాణికురాలు నడిచే ఆటోలోంచి దూకేసింది. ఈ ఘటనలో తలకు తీవ్రగాయాలు కావడంతో కోమాలోకి వెళ్లిపోయింది. ఇటీవలే ఆమె తిరిగి స్పృహలోకి వచ్చింది. అలాగే ఢిల్లీలో జరిగిన తాజా ఘటనతో ప్రయాణికుల భద్రత అంశం మరోసారి తెరమీదకు వచ్చింది. దీనిపై ప్రత్యామ్నాయ మార్గాలు కనుగొనాలనే అంశంపై ఆర్టీవో, ప్రైవేటు ట్యాక్సీ కంపెనీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించింది. ఇందులో పానిక్ బటన్ (స్విచ్) అమర్చాలని నిర్ణయానికొచ్చారు. బటన్‌ను ప్రయాణికుల సీటు వెనకాల లేదా పక్కన అమర్చాలని యోచిస్తున్నారు. ఏదైనా ప్రమాదం పొంచి ఉన్న లేదా అత్యవసరం సమయంలో ప్రయాణికులకు ఈ స్విచ్చి నొక్కేందుకు అందుబాటులో ఉండాలి. ఈ పరికరాన్ని పోలీసు శాఖ, ట్రాఫిక్ శాఖ, ఆ కంపెనీ కాల్ సెంటర్‌తో అనుసంధానించడంవల్ల అది నొక్కగానే అక్కడ పనిచేస్తున్న సిబ్బంది అప్రమత్తమవుతారు. ఆ ట్యాక్సీ ఏ పోలీసు స్టేషన్‌కు, ఏ ఆర్టీవోకు సమీపంలో ఉంది అనేది వెంటనే తెలిసిపోతుంది. దాంతో బాధితులకు సాయం అందించి వారిని రక్షించడం, ట్యాక్సీ డ్రైవర్‌పై చర్యలు తీసుకునేందుకు సులభతరం కానుంది. కాని ఈ బటన్ విద్యుత్‌తో పనిచేస్తుంది కాబట్టి దీన్ని అమర్చడంవల్ల అనేక సాంకేతిక సమస్యలు వస్తాయని వారు భావిస్తున్నారు వచ్చే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో బటన్ అమర్చడానికి ఆమోదముద్ర వేయలేదని ఓ అధికారి వెల్లడించారు. -
పిల్లల కోసం 12 ఏళ్ల పిల్లాడి ఆండ్రాయిడ్ యాప్
పన్నెండేళ్ల వయసు అంటే ఫోన్లతో ఆడుకుంటారనే మనకు తెలుసు. కానీ, టెక్సాస్‌కు చెందిన ఓ బుడ్డాడు ఏకంగా పిల్లలను కాపాడేందుకు ఓ ఆండ్రాయిడ్ యాప్ తయారుచేశారు. పిల్లలు ఏదైనా ఆపదలో ఉంటే.. వెంటనే పానిక్ బటన్ ఆన్ అయ్యేలా ఈ యాప్ పనిచేస్తుంది. ఒకవేళ ఫోన్ లాక్ అయి ఉంటే, పవర్ బటన్‌ను ఆరుసార్లు ప్రెస్ చేస్తే.. 'సేవ్ మీ' అనే యాప్ యాక్టివేట్ అవుతుంది. అందులో ప్రోగ్రాం చేసి పెట్టిన పలు నెంబర్లకు ముందుగానే సిద్ధం చేసి ఉంచిన మెసేజ్ వెళ్లిపోతుంది. దీన్ని మరింత అప్‌గ్రేడ్ కూడా చేశారు. ఈ వెర్షన్లో పవర్ బటన్ ప్రెస్ చేస్తే ఆ సందేశం అందుకునేవాళ్లకు ఒక జీపీఎస్ మ్యాప్ కూడా వెళ్తుంది. అందులో దాన్ని పంపినవాళ్లు ఎక్కడ ఉన్నారో కూడా తెలిసిపోతుంది. తాను తండ్రితో కలిసి స్కూలుకు వెళ్లేటప్పుడు ఈ యాప్ రూపొందించాలన్న ఆలోచన వచ్చిందని డైలన్ పుసెట్టి అనే ఈ అబ్బాయి చెప్పాడు. తనను ఎవరైనా ఎత్తుకుపోతే, తన జేబులో ఫోన్ ఉంటే వెంటనే ఆ పవర్ బటన్‌ను ప్రెస్ చేస్తే సరిపోయేలా యాప్ తయారు చేశానన్నాడు. ప్రస్తుతం ఈ యాప్ కేవలం ఆండ్రాయిడ్ వెర్షన్లో మాత్రమే అందుబాటులో ఉంది.