ట్యాక్సీల్లో పానిక్ బటన్..
సాక్షి, ముంబై: ప్రైవేటు ట్యాక్సీల్లో జరుగుతున్న హత్యలు, అత్యాచారాలు, చోరీల వంటి సంఘటనలను అరికట్టేందుకు ‘పానిక్ బటన్’ అమర్చాలని ఆర్టీవో యోచిస్తోంది. ఈ పరికరాన్ని నగర పోలీసు, ట్రాఫిక్ శాఖ, సంబంధిత ట్యాక్సీ కంపెనీ కాల్ సెంటర్‌తో అనుసంధాన పర్చాల్సి ఉంటుంది. అప్పుడే ఈ పరికరం బిగించి ప్రయోజనం ఉంటుందని అధికారులు అభిప్రాయపడ్డారు. అయితే ఈ ప్రతిపాదనకు ఆర్టీవో ఇంకా ఆమోద ముద్ర వేయలేదు. దేశ రాజధానిలో ఇటీవల ఓ ట్యాక్సీ డ్రైవర్ ఒంటరిగా ఉన్న మహిళాప్రయాణికురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. గతంలో ముంబైలో కూడా అపహరణ, చోరీ, హత్యలు, అత్యాచారాలు లాంటి సంఘటనలు అనేకం వెలుగులోకి వచ్చాయి.
ఠాణేలో నాలుగు నెలల కిందట ఓ ఆటో డ్రైవర్ అపహరిస్తున్నట్లు గుర్తించిన స్వప్నాలి లాడ్ అనే మహిళ ప్రయాణికురాలు నడిచే ఆటోలోంచి దూకేసింది. ఈ ఘటనలో తలకు తీవ్రగాయాలు కావడంతో కోమాలోకి వెళ్లిపోయింది. ఇటీవలే ఆమె తిరిగి స్పృహలోకి వచ్చింది. అలాగే ఢిల్లీలో జరిగిన తాజా ఘటనతో ప్రయాణికుల భద్రత అంశం మరోసారి తెరమీదకు వచ్చింది. దీనిపై ప్రత్యామ్నాయ మార్గాలు కనుగొనాలనే అంశంపై ఆర్టీవో, ప్రైవేటు ట్యాక్సీ కంపెనీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించింది. ఇందులో పానిక్ బటన్ (స్విచ్) అమర్చాలని నిర్ణయానికొచ్చారు. బటన్‌ను ప్రయాణికుల సీటు వెనకాల లేదా పక్కన అమర్చాలని యోచిస్తున్నారు. ఏదైనా ప్రమాదం పొంచి ఉన్న లేదా అత్యవసరం సమయంలో ప్రయాణికులకు ఈ స్విచ్చి నొక్కేందుకు అందుబాటులో ఉండాలి.
ఈ పరికరాన్ని పోలీసు శాఖ, ట్రాఫిక్ శాఖ, ఆ కంపెనీ కాల్ సెంటర్‌తో అనుసంధానించడంవల్ల అది నొక్కగానే అక్కడ పనిచేస్తున్న సిబ్బంది అప్రమత్తమవుతారు. ఆ ట్యాక్సీ ఏ పోలీసు స్టేషన్‌కు, ఏ ఆర్టీవోకు సమీపంలో ఉంది అనేది వెంటనే తెలిసిపోతుంది. దాంతో బాధితులకు సాయం అందించి వారిని రక్షించడం, ట్యాక్సీ డ్రైవర్‌పై చర్యలు తీసుకునేందుకు సులభతరం కానుంది. కాని ఈ బటన్ విద్యుత్‌తో పనిచేస్తుంది కాబట్టి దీన్ని అమర్చడంవల్ల అనేక సాంకేతిక సమస్యలు వస్తాయని వారు భావిస్తున్నారు వచ్చే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో బటన్ అమర్చడానికి ఆమోదముద్ర వేయలేదని ఓ అధికారి వెల్లడించారు.