‘ప్యానిక్ బటన్ వస్తోంది'
సాక్షి, హైదరాబాద్: అపాయంలో చిక్కుకున్న వారి సమాచారం క్షణాల్లో పోలీసులకు చేరవేసేందుకు సెల్‌ఫోన్లలో వచ్చే ఏడాది జనవరి నుంచి ప్యానిక్ బటన్ అందుబాటులోకి వస్తుందని కేంద్ర సమాచార, సాంకేతిక శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. అప్పటి నుంచి మార్కెట్‌లోకి వచ్చే అన్ని సెల్‌ఫోన్లలో ఈ సదుపాయం ఉండేలా చర్యలు తీసుకోవాలని కంపెనీలకు కేంద్రం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిందని పేర్కొన్నారు.
హైదరాబాద్‌లోని నోవాటెల్ హోటల్‌లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. మహిళల భద్రతకు కేంద్రం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని, భద్రతకు, సెల్‌ఫోన్లను అనుసంధానం చేయాలని భావించి ప్యానిక్ బటన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. 5 లేదా 9 నంబర్లు ప్యానిక్ బటన్‌గా పనిచేస్తుందని, దాన్ని నొక్కగానే వెంటనే పోలీస్ కంట్రోల్ రూమ్‌కు, కుటుంబసభ్యులు లేదా స్నేహితులకు సమాచారం వెళ్తుందని వివరించారు.
కాగా, ప్రమాదంలో ఉన్నవారు ఏ ప్రాంతంలో ఉన్నారో సులభంగా తెలుసుకునేందుకు అన్ని ఫోన్లలో అంతర్గతంగా (ఇన్‌బిల్ట్) జీపీఎస్ వ్యవస్థ ఏర్పాటు చేసేలా కేంద్రం చర్యలు తీసుకుంది. ఫోన్ తయారు చేసే సమయంలోనే జీపీఎస్ వ్యవస్థతో అనుసంధానం ఉండేలా ఏర్పాటు చేయబోతున్నారు. 2018 జనవరి నుంచి అన్ని కొత్త ఫోన్లలో ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది.