న్యూఢిల్లీ : ఆకతాయిల నుంచి మహిళలకు మరింత భద్రత కల్పించేందుకు డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ మొబైల్ ఫోన్లలో వినూత్న ఆవిష్కరణకు నాంది పలికింది. ఆపదలో ఉన్న మహిళలు తమ మొబైల్ నుంచి ఓ బటన్ నొక్కితే తక్షణమే పోలీసులు స్పందించేలా రంగం సిద్ధం చేసింది. పొరపాటున ఆ ఫోన్ ఆఫ్ లో కూడా ఉన్నా కూడా ఆ పానిక్ బటన్ పనిచేసేలా మొబైల్ తయారీ దారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. దీనికి సంబంధించి మొబైల్ కంపెనీలకు కేంద్ర సమాచార,ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. 2017 కల్లా భారత్ లో అమ్మే ప్రతి మొబైల్ ఫోన్లలో ఈ పానిక్ బటన్ ఉండాలని మంత్రి ఆదేశించారు. అదేవిధంగా 2018 జనవరి లోపల అన్ని మొబైల్ ఫోన్లు కచ్చితంగా హ్యాండ్ సెట్ వాడే యూజర్ ప్రాంతాన్ని గుర్తించే జీపీఎస్ ను పొందుపర్చాలని పేర్కొన్నారు.
100 నంబర్ కు డయల్ చేయడానికి అవకాశం, సమయం చిక్కని నేపథ్యంలో, సులభంగా ఫోన్ లో పొందుపర్చిన 'పానిక్ బటన్' ను ప్రెస్ చేసి సహాయం పొందేలా చర్యలు తీసుకుంటోంది. ఆపదలో ఉన్న మహిళ ఆ పానిక్ బటన్ ను ప్రెస్ చేస్తే చాలు వారి ఫోన్ నుంచి పోలీసులకు సందేశం వెళ్లి, వెంటనే ఆకతాయిల ఆపదలో ఉన్న మహిళను కాపాడేలా బటన్ ను రూపొందించాలని మంత్రి రవిశంకర్ తయారీ దారులను కోరారు.
టెక్నాలజీ మానవ జీవితం మంచికే తోడ్పడాలని, మరీ ముఖ్యంగా మహిళల భద్రతకు ఇది ఎంతో ఉపయోగపడాలని మంత్రి వ్యాఖ్యానించారు. 2017 జనవరి 1 నుంచి ఏ మొబైల్ ఫోన్ పానిక్ బటన్ లేకుండా అమ్మకూడదనే నిర్ణయాన్ని తీసుకున్నామని మంత్రి స్పష్టం చేశారు. ఫీచర్ ఫోన్ హ్యాండ్ సెట్లు స్మార్ట్ ఫోన్ లలో న్యూమెరిక్ కీలు 5, 9 లను ఎమర్జెన్సీ బటన్ లుగా ఉండాలని, ఫోన్ ఆన్ లో ఉన్న, ఆఫ్ లో ఉన్న ఎమర్జెన్సీ బటన్ పనిచేసేలా హ్యాండ్ సెట్ తయారీదారులు ఫోన్లను రూపొందించాలని మంత్రి ఆదేశించారు. అలర్ట్ కూడా వెంటనే పోలీసులకు వెళ్లేలా బటన్ ను సెట్ చేయాలని ఆయన పేర్కొన్నారు.