పీఎల్ఐ, ఆర్పీఎల్ఐ పాలసీ చెల్లింపుల్లో మార్పులు
♦ హోల్ లైఫ్ పాలసీని సవరించిన కేంద్రం
♦ 80 ఏళ్లు దాటిన తర్వాత మెచ్యూరిటీ నగదుతో కలిపి బోనస్
సాక్షి, విజయవాడ బ్యూరో : పోస్టాఫీసుల్లో పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్సు (పీఎల్‌ఐ), రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్సు (ఆర్‌పీఎల్‌ఐ) కింద హోల్‌లైఫ్ పాలసీలు కలిగిన వారికి వెసులుబాటు కల్పిస్తూ ప్రభుత్వం సవరణలు చేసింది. ఇప్పటి వరకూ హోల్ లైఫ్ పాలసీ చేసిన వ్యక్తి మరణానంతరం వారి వారసులకు పాలసీ మొత్తం, బోనస్ లభించేవి. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ విధానాన్ని సవరించింది. ఈ పాలసీ కలిగిన వ్యక్తి 80 ఏళ్ల వరకూ జీవించి ఉంటే మెచ్యూరిటీ మొత్తంతో పాటు బోనస్ కూడా అందించనుంది. దీనివల్ల జీవించి ఉన్నపుడే పాలసీదారుడు పాలసీ ఫలాలను అనుభవించే వీలుంది.
ఉదాహరణకు 25 ఏళ్ల వయస్సులో హోల్ లైఫ్ ఎస్యూరెన్సు కింద లక్ష రూపాయలకు పాలసీ చేస్తే 60 ఏళ్ల వరకూ ప్రీమియం చెల్లిస్తారు. అంటే 35 ఏళ్ల పాటు ప్రీమియం చెల్లింపులు జరుగుతాయి. ఆ తరువాత మెచ్యూరిటీ మొత్తంతో పాటు బోనస్‌ను కలిపి వారసులకు అందజేస్తారు. ఈ లెక్కన వీరికి 35 ఏళ్లకు లెక్కించి బోనస్ చెల్లింపులు జరిగేవి. అయితే సవరణ అమల్లోకి వచ్చిన దరిమిలా 80 ఏళ్ల వరకూ జీవించిన పాలసీదారులకు 55 ఏళ్లకు బోనస్ లెక్కించి అందజేస్తారు.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో 7.30 లక్షల మంది హోల్‌లైఫ్ పాలసీలు కలిగి ఉన్నారు. ఇందులో 12%మంది 80 ఏళ్లు పైబడిన వారున్నారని గణాంకాలు చెబుతున్నాయి. వీరందరూ తమ పాలసీలకు సంబంధించిన ఫలాలను అందుకునేందుకు దగ్గర్లో ఉన్న ప్రధాన తపాలా కార్యాలయాన్ని సంప్రదించాలని ఆంధ్రా, తెలంగాణ సర్కిళ్ల చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ డాక్టర్ వైపీ రాయ్ బుధవారం నాడొక ప్రకటనలో కోరారు.