సేవలకు తలుపులు తెరిచిన తపాలా | post office open in the services | Sakshi
Sakshi News home page

సేవలకు తలుపులు తెరిచిన తపాలా

Published Sun, Jul 20 2014 1:13 AM | Last Updated on Sat, Sep 2 2017 10:33 AM

సేవలకు తలుపులు తెరిచిన తపాలా

సేవలకు తలుపులు తెరిచిన తపాలా

బహుముఖ సేవలందిస్తున్న తపాలా శాఖ
* బ్యాంకింగ్, బీమా, హౌస్
* షిఫ్టింగ్, మైస్టాంప్ సేవలు
* ప్రశంసిస్తున్న వినియోగదారులు
నల్లగొండ అర్బన్ : పోస్టాఫీసులంటే ఒకప్పుడు ఉత్తరాల బట్వాడాకే పరిమితం. మరిప్పుడు... బ్యాంకుల్లోలా డబ్బులు వెయ్యచ్చు..తీయవచ్చు. వేరే ఊరికి డబ్బులు పంపొచ్చు. ఏటీఎం సేవలూ లభ్యం. తపాలా సేవలతో అతితక్కువ ఖర్చుతో ఇల్లు మారవచ్చు. రైల్వే రిజర్వేషన్ సౌకర్యం, బీమా సేవలు... వీటితో పాటు మీకో చక్కటి వరం తిరుపతి వెంకన్న స్వామి అక్షింతలతో ‘ఆశీర్వచనం’ సేవలు. ‘మై స్టాంప్’ సేవల కింద మీ ఫొటోలతోనే స్టాంపులు మీకు లభ్యం. నిన్నమొన్నటి వరకు కొన్ని రకాల సేవలకే పరిమితమైన తపాలా శాఖ ప్రస్తుతం తలుపులు బార్లా తెరిచి బహుముఖాలుగా తన సేవలను విస్తరించింది.          

జిల్లాలో 4 హెడ్‌పోస్టాఫీసులున్నాయి. ఇవి నల్లగొండ, భువనగిరి, మిర్యాలగూడ, సూర్యాపేటలలో సేవలందిస్తున్నాయి. మండల కేంద్రాలు, ప్రధాన కూడళ్లలో 37 సబ్‌పోస్టాఫీసులుండగా 349 బ్రాంచ్ పోస్టాఫీసులు పనిచేస్తున్నాయి. ఇవేకాకుండా ప్రభుత్వ పింఛన్ల పంపిణీ, ఉపాధిహామీ కూలీల భృతి చెల్లించేందుకు 269 గ్రామాల్లో ఏజెన్సీల ద్వారా పోస్టల్ సేవలందుతున్నాయి.
 
ఎలక్ట్రానిక్ మనీ ఆర్డర్
ఈ సౌకర్యం ద్వారా 24 గంటల్లో డబ్బులు వేరే ప్రాంతంలో ఉండేవారికి అందజేయవచ్చు. మొదటగా పోస్టాఫీసులో వినియోగదారుడు డబ్బులు చెల్లించగానే సంబంధిత అధికారి ఏ ప్రాంతానికైతే మనీ ఆర్డర్ బుక్ అయిందో ఆయా ప్రాంత కార్యాలయ అధికారికి మెసేజ్ ద్వారా పూర్తి వివరాలను తెలియజేసి డబ్బులు అందేటట్టు చూస్తారు. కొంచెం సుదూర ప్రాంతం, ఇతర సమస్యలు వస్తే మాత్రం 48 గంటల సమయంలో ఈ ఎలక్ట్రానిక్ మనీఆర్డర్‌ను వినియోగదారునికి అందజేస్తారు.
 
ఆశీర్వచనం
ఆశీర్వచనం పథకం ప్రశంసలు అందుకుంటోంది. పోస్టల్‌శాఖలో వినూత్న పథకంగా కొందరు భక్తులు చెబుతున్నారు. తిరుపతి పుణ్యక్షేత్రంలో శ్రీవేంకటేశ్వరస్వామి పాదాల చెంతన ఉన్న అక్షింతలను కేవలం రూ.5 ఆర్డర్ ద్వారా పొందవచ్చు. అక్షింతలతోపాటు స్వామివారి ఫోటో కూడా అందుతుంది. తిరుపతి వెళ్లలేని పరిస్థితి ఉన్నవారికి ఈ పథకం ఓ వరంగా చెప్పవచ్చు.
 
సేవింగ్స్ బ్యాంక్
పోస్టల్ ఖాతాలో బ్యాంకుల్లో ఉన్న జమ, విత్‌డ్రా వంటి సౌకర్యాలు లభిస్తున్నాయి. ఏటీఎం సౌకర్యం సైతం అతిత్వరలో అందుబాటులోకి రానుంది. మరికొద్ది రోజుల్లో బ్యాంకు మాదిరిగా రుణ సౌకర్యం అందుబాటులోకి రానుంది. సేవింగ్స్ బ్యాంక్‌లో అయితే వయోవృద్ధులకు బ్యాంకులాగానే 9 శాతం వడ్డీని పోస్టల్‌శాఖ చెల్లిస్తుంది. కొన్ని రోజుల్లో పోస్టల్ బ్యాంక్‌లు కూడా వస్తాయని పోస్టల్ అధికారులంటున్నారు.
 
రైల్వే రిజర్వేషన్ సౌకర్యం
ఏ జిల్లాల్లో అయితే రైల్వే రిజర్వేషన్ కార్యాలయం లేదో, ఆ ప్రాంతంలోని పోస్టాఫీసులో ఈ సౌకర్యం లభిస్తుంది.
 
పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్
జీవిత బీమా సౌకర్యాన్ని పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ కల్పిస్తోంది. తక్కువ ప్రీమియం, ఎక్కువ బోనస్ దీని ప్రత్యేకత. పల్లె ప్రాంత ప్రజలకు గ్రామీణ తపాలా జీవిత బీమా, పట్టణంలోని ఇతరులందరికి ఎంప్లాయిస్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో ఉంది. గ్రామాల్లో ఉండేవారికి గ్రామీణ తపాలా బీమా ఉపయోగపడుతుంది.
 
లాజిస్టిక్ పోస్టు
ఈ లాజిస్టిక్ పోస్టు సౌకర్యంలో మరికొన్ని సేవలు లభిస్తాయి. కొన్ని ముఖ్య వస్తువులను వేరే ప్రాంతాలకు పంపించుకోవచ్చు. నగరంలో నివసించే వారు అయితే హౌస్‌షిప్టింగ్‌కు కూడా వినియోగింపవచ్చు.ఇల్లు మార్పిడికి ఇక వేలకువేలు చెల్లించే అవసరం ఉండదు. అతి తక్కువ ఖర్చుతో ఇల్లు మారిపోవచ్చు. ఈ సౌకర్యం బాగుందని తపాలా శాఖ వినియోగదారుల ప్రశంసలు అందుకుంటోంది. ఈ విధమైన హౌస్ షిప్టింగ్ సౌకర్యం ఉందని కొందరికి మాత్రమే తెలుసునని, దీనికి ఇంకా విస్తృత ప్రచారం కల్పించాల్సిన అవసరం ఉందని పోస్టల్ అధికారులు భావిస్తున్నారు.
 
మై స్టాంప్

స్టాంప్ అనగానే అదొక మంచి గుర్తింపు ముద్ర అని అందరికీ తెల్సిన విషయం. గతంలో లాల్‌బహుదూర్‌శాస్త్రి, సర్దార్ వల్లభాయ్‌పటేల్ వంటి ప్రముఖుల ఫొటోలు, చారిత్రక ప్రదేశాల ఫొటోలు స్టాంపులుగా పోస్టల్ శాఖ అందించింది. అయితే ఈ మధ్య కాలంలో మైస్టాంప్ పేరుతో కొత్త సౌకర్యం అందుబాటు లోకి వచ్చింది. దీనిద్వారా ఎవరి ఫొటో వారు స్టాంపుగా తయారు చేయించుకోవచ్చు. దీనికి కేవలం రూ.300 సొమ్ము పోస్టల్‌శాఖకు చెల్లిస్తే సరిపోతుంది. రూ.240 పోస్టల్‌శాఖ ఖాతాకు జమకాగా, రూ.5 విలువగల 12 స్టాంపులను వినియోగదారునికి అందజేస్తారు. ఈ స్టాంపులు దూరప్రాంతాలకు పంపే కవరులపై అంటించినా చెల్లుబాటు అవుతాయి.
 
మొబైల్ మనీ ట్రాన్స్‌ఫర్

దేశంలో ఏ మారుమూల ప్రాంతంలో ఉన్న వారికైనా మనీ ట్రాన్స్‌ఫర్ సౌకర్యం లభిస్తుంది. ముందుగా పోస్టల్ కార్యాలయంలో డబ్బు జమ చేయగానే, మనీ అందుకోవాల్సిన సంబంధిత చిరునామా గల వ్యక్తి మొబైల్‌కు ఓ కోడ్ నంబర్ ఆన్‌లైన్ ద్వారా మెసేజ్‌గా వెళ్తుంది. అనంతరం ఆ కోడ్ నంబర్‌గల మొబైల్‌ను డబ్బులు అందుకోవాల్సిన వ్యక్తి పోస్టల్ కార్యాలయంలో చూపిస్తే వెను వెంటనే బల్క్ మొత్తం డబ్బులు అయినా ఒక ఐడీ ఫ్రూఫ్‌ను తీసుకుని పోస్టల్ సిబ్బంది అందజేస్తారు.
 
త్వరలో మరికొన్ని..
పోస్టల్‌శాఖలో మరికొన్ని సేవలు వస్తాయని తెలుస్తోంది. కూరగాయలను వేరే ప్రాంతాలకు చేరవేయడం, పోస్టల్ బ్యాంకులు అందుబాటులోకి తెచ్చి అన్ని ప్రాంతాలకు విస్తరించడం వంటి సౌకర్యాలు వస్తాయి. వీటితోపాటు మరికొన్ని ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి.
 
సంప్రదించాల్సిన ఫోన్‌నంబర్లు

పోస్టల్ సేవలం కోసం నల్లగొండలోని హెడ్‌పోస్టాఫీసు 08682-244204, భువనగిరి ప్రాంతం వరకు 08682-242585 ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చు.  జిల్లా పోస్టల్ సూపరింటెండెంట్ కార్యాలయం ఫోన్ 08682-244267 ద్వారా సంప్రదించవచ్చు
 
అందుబాటులో అన్ని రకాల సేవలు

హెడ్‌పోస్టాఫీసుల్లో ఆన్‌లైన్ సేవలు అందుబాటులో ఉన్నాయి. మీ సేవ ద్వారా పొందే సేవలన్నింటినీ ఇక్కడ పొందవచ్చు. కరెం ట్‌బిల్లులు, అన్ని నెట్‌వర్క్‌ల టెలిఫోన్ బిల్లులు, అంబేద్కర్ ఓపెన్ యూని వర్సిటీ ఫీజులను చెల్లించవచ్చు. త్వరలో పోస్టుమాన్ ఉద్యోగాల కోసం పరీక్ష నిర్వహిస్తున్నాం. దీనికి ఇక్కడ ఫీజు చెల్లించవచ్చు.
 - రఘునాథస్వామి, జిల్లా ఇన్‌చార్జ్ పోస్టల్ సూపరింటెండెంట్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement