పటిష్ట, స్థిర పన్నుల వ్యవస్థ ఏర్పాటు
అమెరికా ఆర్థిక మంత్రికి ప్రధాని మోదీ హామీ
న్యూఢిల్లీ: భారత్ పటిష్టవంతమైన, సుస్థిర పన్నుల వ్యవస్థను ఏర్పాటు చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం పేర్కొన్నారు. అమెరికా ఆర్థికమంత్రి జాకబ్ లీతో సమావేశం సందర్భంగా ఆయన ఈ విషయం తెలిపారు. భారత్, అమెరికాల మధ్య ఆర్థిక సహకారమే వాటి వ్యూహాత్మక సంబంధాలకు మూల స్తంభమని వ్యాఖ్యానించారు.
భారత్‌లో పెట్టుబడులకు అమెరికా కంపెనీలు చూపుతున్న ఆసక్తిపట్ల నరేంద్రమోదీ హర్షం వ్యక్తం చేసినట్లు ఈ మేరకు వెలువడిన ఒక ప్రకటన తెలిపింది. ప్రధాని ప్రారంభించిన జన ధన యోజనను అమెరికా ఆర్థికమంత్రి ఈ సందర్భంగా ప్రశంసించారు.
భాగస్వామ్య సమావేశం...: గురువారం జరిగిన భారత్-అమెరికా 5వ ఎకనమిక్ అండ్ ఫైనాన్షియల్ పార్ట్‌నర్‌షిప్ సదస్సులో జాకబ్ లీ, భారత్ ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ పాల్గొన్నారు. వీరితోపాటు ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వైస్ చైర్మన్ స్టాన్లీ ఫీచర్ కూడా పాల్గొన్నారు. రెండు దేశాల మధ్య ఇప్పటికే 100 బిలియన్ డాలర్లకు పెరిగిన వాణిజ్యం మరింత వృద్ధి బాటన పయనిస్తుందన్న ఆశాభావాన్ని జాకబ్ లీ సందర్భంగా వ్యక్తం చేశారు. ఇందుకు భారత్‌లో చేపట్టిన సంస్కరణలు దోహదపడతాయని అన్నారు. వృద్ధి పెంపునకు చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో తయారీ తదితర రంగాల్లో భారీగా విదేశీ పెట్టుబడులను కోరుకుంటున్నట్లు జెట్లీ పేర్కొన్నారు.