
నీరవ్ మోదీ (ఫైల్ ఫోటో)
సాక్షి, ముంబై: మాల్యా తరహాలో వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ భారీ కుంభకోణం వెలుగు చూడటంతో మార్కెట్లో జ్యువెల్లరీ షేర్లు భారీగా నష్టపోయాయి. ఇన్వెస్టర్ల అమ్మకాలతో పలుషేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. అంతేకాదు పీఎన్‌బీ ఇన్వెస్టర్ల సంపద దాదాపు రూ. 7వేల కోట్లు ఆహుతైపోయింది. ప్రభుత్వ రంగ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ లావాదేవీల్లో భారీగా అక్రమాలు ఆరోపణల నేపథ్యంలో మార్కెట్ లో ఆందోళన నెలకొంది. దీంతో అటు జ్యువెలరీ, బ్యాంక్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది.
దీంతోపాటు ప్రభుత్వ రంగ దిగ్గజం పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్‌బీ) ముంబై బ్రాంచీలో సుమారు రూ. 11,400 కోట్లమేర అక్రమ లావాదేవీలు జరిగిన నేపథ్యంలో జ్యువెలరీ స్టాక్స్‌లో ఇన్వెస్టర్లు అమ్మకాల వెల్లువ సాగింది. ముఖ్యంగా పీసీ జ్యువెలర్స్ షేరు దాదాపు 9 శాతం పతనంకాగా గీతాంజలి జెమ్స్ షేర్ లో అదే ధోరణి. ఇంకా తంగమాయిల్ జ్యువెలరీ , టీబీజెడ్, రాజేష్ ఎక్స్‌పోర్ట్స్, రినైసన్స్ జ్యువెలరీ నష్టపోయిన వాటిల్లో ఉన్నాయి.
మరోవైపు పంజాబ్ నేషనల్ బ్యాంక్ షేరు కూడా దాదాపు 13 శాతం కుప్పకూలింది. రెండు రోజుల్లో మొత్తం 18శాతం నష్టపోయింది. బుధవారం నాటి ట్రేడింగ్‌లో ఇన్వెస్టర్లు మూడు వేలకోట్ల రూపాయలను కోల్పోగా, సీబీఐ ప్రకటన వెలువడిన వెంటనే గురువారం మరో నాలుగు వేల కోట్ల రూపాయల ఇన్వెస్టర్ల సందర ఆవిరైపోయింది. దీంతో మొత్తం రూ7వేల కోట్ల సంపద నిమిషాల్లో గాల్లో కలిసిపోయింది.
మరోవైపు ఇప్పటికే పీఎన్‌బీలో జరిగిన కుంభకోణంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌తోపాటు సీబీఐ పలు వ్యక్తులపై కేసులు నమోదు చేశాయి. ఫైర్‌స్టార్ డైమండ్ కంపెనీ చీఫ్ నీరవ్ మోదీతోపాటు, అతడి భార్య, సోదరుడు, తదితరులపై సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment