దేశీయ రైల్వే (ఫైల్ ఫోటో)
న్యూఢిల్లీ : ఎవరికైనా హెల్ప్‌లైన్ నెంబర్లు దేనికి ఉపయోగపడతాయి అంటే తమ సమస్యను ఫిర్యాదు చేసుకునేందుకు. కానీ రైల్వేలో అలా కాదంట. రైల్వే వాట్సాప్ హెల్ప్‌లైన్ నెంబర్లకు ఫిర్యాదుల కంటే శుభాకాంక్షల మెసేజ్‌లే ఎక్కువగా వస్తున్నాయట. వాట్సాప్ వాడకం విస్తృతంగా ఉండటంతో, రైల్వే ఇటీవలే వాట్సాప్ హెల్ప్‌లైన్ నెంబర్లను ప్రయాణికుల ముందుకు తీసుకొచ్చింది. ఈ నెంబర్లను అపరిశుభ్రతంగా ఉన్న స్టేషన్ పరిసరాలు, టాయిలెట్ల గురించి ప్రయాణికులు ఫిర్యాదు చేసేందుకు ప్రవేశపెట్టింది. డబ్ల్యూఆర్(వెస్ట్రన్ రైల్వే) కోసం 90044 99773 నెంబర్‌ను, సీఆర్(సెంట్రల్ రైల్వే)లోని ప్రయాణికులు 9987645307 నెంబర్‌కు ప్రయాణికులు తమ ఫిర్యాదులను వాట్సాప్ చేయొచ్చని తెలిపింది.
అయితే ఈ రెండు నెంబర్లకు ప్రస్తుతం ఫిర్యాదుల కంటే ఎక్కువగా శుభాకాంక్షల మెసేజ్‌లు, గుడ్‌మార్నింగ్, గుడ్ ఈవ్‌నింగ్ వంటి టెక్ట్స్ మెసేజ్‌లే ఎక్కువగా వస్తున్నాయని రైల్వే అధికారులు చెప్పారు. అంతేకాక దేవతలతో కూడిన భక్తి సందేశాలు, వినోదభరిత హిందీ పద్యాల మెసేజ్‌లను తాము పొందుతున్నామని తెలిపారు. ఈ హెల్ప్‌లైన్ నెంబర్లకు అపరిశుభ్రతంగా ఉన్న పరిసరాల గురించి వారంలో కేవలం 25 ఫిర్యాదులే వచ్చాయని అధికారులు చెప్పారు. మిగతావన్నీ ఫ్రెండ్‌షిప్ డే శుభాకాంక్షలు, ఫార్వర్డ్ మెసేజ్‌లే ఉన్నాయన్నారు. సాధారణంగా అపరిశుభ్రతంగా ఉన్న రైల్వే పరిసరాల గురించి ప్రయాణికులు స్టేషన్ మాస్టర్‌కు ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. అయితే రైల్వే అధికారులు తాజాగా ఈ హెల్ప్‌లైన్ నెంబర్లను ప్రవేశపెట్టారు.
ఈ హెల్ప్‌లైన్ నెంబర్లతో ఫిర్యాదులపై వెంటనే చర్యలు తీసుకోవడానికి వీలవుతుందని రైల్వే అధికారులు చెప్పారు. అపరిశుభ్రతంగా ఉన్న పరిసరాలను, టాయిలెట్లను క్లిక్ చేసి, వాట్సాప్ నెంబర్‌కు సెండ్ చేయాల్సి ఉంటుంది. ఈ ఫిర్యాదుల కోసం కంప్లయింట్స్ సెల్ ఒకటి ఉంటుంది. ఓ ప్రత్యేకమైన సిబ్బందిని దీని కోసమే నియమించారు. ఈ ప్రాంతాన్ని సందర్శించి వెంటనే వారు చర్యలు తీసుకోనున్నారు. స్టేషన్ మాస్టర్లు, ఇన్స్‌స్పెక్టర్లు, ఆఫీసులు ఎప్పడికప్పుడూ తనిఖీలు నిర్వహిస్తూ ఉంటారని వెస్ట్రన్ రైల్వే అధికార ప్రతినిధి రవిందర్ భాకేర్ చెప్పారు. ఇప్పటి వరకు వెస్ట్రన్ రైల్వే వాట్సాప్ నెంబర్‌కు 23 ఫిర్యాదులు, సెంట్రల్ రైల్వే వాట్సాప్ నెంబర్ రెండు ఫిర్యాదులను పొందిందని ఓ రైల్వే అధికారి పేర్కొన్నారు. ఈ ఫిర్యాదులను కంట్రోల్ డిపార్ట్‌మెంట్‌కు పంపామని, వాటిని సంబంధిత స్టాఫ్‌కు(స్టేషన్ మాస్టర్) పంపిస్తామని తెలిపారు. అయితే ఆ ఫిర్యాదులను పరిష్కరించడానికి ప్రస్తుతమైతే ఎలాంటి డెడ్‌లైన్ లేదని, కానీ అదే రోజు పరిష్కరించడానికి కృషి చేస్తామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment