నోకియా పగ్గాలు మనోడికే
ప్రజలను టెలికమ్యూనికేషన్స్ ద్వారా అనుసంధానం చేయడంలో నోకియాకున్న అపార అనుభవంతో ఇప్పుడున్న మూడు వ్యాపార విభాగాల్లో కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడానికి కంపెనీ సిద్ధంగా ఉంది. నోకియా బృందంతో పూర్తిగా మమేకమై... కంపెనీ భవిష్యత్తులో అత్యున్నత శిఖరాలను అందుకోవడానికి నా సాయశక్తులా కృషిచేస్తా. కంపెనీలో అత్యంత నైపుణ్యంగల విభాగాధిపతులు ఉన్నారు. కొత్త ప్రణాళికలను మరింత వేగంగా, సమర్థవంతంగా అమలు చేయడానికి కలసికట్టుగా అడుగులేస్తాం.
- రాజీవ్ సూరి, నోకియా సీఈఓ
ప్రపంచ కార్పొరేట్ రంగంలో భారతీయుల సత్తా మరోమారు మార్మోగింది. ఫిన్లాండ్ మొబైల్స్ తయారీ దిగ్గజం నోకియా పగ్గాలను భారత్‌కు చెందిన రాజీవ్ సూరి అందుకున్నారు. ఇప్పటికే నోకియా హ్యాండ్‌సెట్ బిజినెస్‌ను మైక్రోసాఫ్ట్ చేజిక్కించుకున్న విషయం తెలిసిందే. అటు మైక్రోసాఫ్ట్‌కు కూడా భారతీయుడే, అందునా తెలుగువ్యక్తి సత్య నాదెళ్ల సీఈఓగా సారథ్యం వహిస్తుండగా.. ఇప్పుడు నోకియా పీఠ ంపై కూడా మనోడే కొలువుదీరడం విశేషం.
న్యూఢిల్లీ: నోకియా... అంతర్జాతీయంగా మొబైల్ ఫోన్‌కు పర్యాయపదంగా నిలిచిన పేరు ఇది. అలాంటి పేరొందిన కంపెనీకి ఇప్పుడు భారత్‌కు చెందిన రాజీవ్ సూరి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(సీఈఓ)గా ఎంపికయ్యారు. మైక్రోసాఫ్ట్‌కు నోకియా మొబైల్ ఫోన్స్ వ్యాపారాన్ని విక్రయించిన తర్వాత ఆ కంపెనీకి పూర్తిస్థాయి సారథిగా భవిష్యత్తు వృద్ధి పథానికి సూరి దిశానిర్దేశం చేయనున్నారు. ఇప్పుడు నోకియా చీఫ్‌గా వ్యవహరిస్తున్న స్టీఫెన్ ఎలాప్ స్థానాన్ని 46 ఏళ్ల సూరి భర్తీచేయనున్నారు.
నోకియా నెట్‌వర్క్ పరికరాల యూనిట్... సొల్యూషన్స్ అండ్ నెట్‌వర్క్స్(ఎన్‌ఎస్‌ఎన్)కు ప్రస్తుతం హెడ్‌గా ఉన్న రాజీవ్ సూరి.. మే 1 నుంచి ప్రెసిడెంట్, సీఈఓగా కొత్త బాధ్యతలను చేపట్టనున్నారని నోకియా మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది. 7.2 బిలియన్ డాలర్ల మొత్తానికి నోకియా హ్యాండ్‌సెట్ బిజినెస్‌ను మైక్రోసాఫ్ట్ దక్కించుకున్న నేపథ్యంలో కంపెనీ ఇక ప్రధానంగా వైర్‌లెస్ నెట్‌వర్క్ పరికరాల వ్యాపారంలో ఎరిక్‌సన్, చైనా దిగ్గజం హువాయ్ వంటి హేమాహేమీలతో పోటీపడేందుకు సిద్ధపడుతోంది.
ఈ నేపథ్యంలో ఇదే రంగంలో అపార అనుభవం ఉన్న సూరిని ఏరికోరి నోకియా తమ సారథిగా ఎంచుకోవడం గమనార్హం. ప్రస్తుం నోకియా తాత్కలిక సీఈఓగా పనిచేస్తున్న రిస్టో సిలాస్మా... మే 1 నుంచి చైర్మన్‌గా వ్యవహరించనున్నారని కంపెనీ పేర్కొంది. ‘ఇక నుంచి కొత్త అధ్యాయాన్ని ప్రారంభించనున్న నోకియాను ముందుండి నడిపించే సరైన వ్యక్తి రాజీవ్ అని కంపెనీ బోర్డు పూర్తి నమ్మకంతో ఉంది. వ్యూహాత్మకంగా, వినూత్న ఆలోచనలతో ఇప్పటికే తన సత్తాను సూరి నిరూపించుకున్నారు. భవిష్యత్తులో కంపెనీ పనితీరును మెరుగుపరచడంలో సమర్థంగా వ్యవహరించగరని భావిస్తున్నా’ అని సిలాస్మా వ్యాఖ్యానించారు.
ఎన్‌ఎస్‌ఎన్‌ను లాభాల్లోకి తెచ్చిన ఘనత...
1967లో భారత్‌లో జన్మించిన సూరికి నోకియాతో దాదాపు రెండు దశాబ్దాల అనుబంధం ఉంది. 1995లో ఎన్‌ఎస్‌ఎన్ ఇండియాలో సిస్టమ్ మార్కెటింగ్ మేనేజర్‌గా ప్రస్థానాన్ని ప్రారంభించారు. పదేళ్ల కాలంలోనే నోకియా నెట్‌వర్క్స్ ఆసియా పసిఫిక్ విభాగానికి సీనియర్ వైస్ ప్రెసిడెంట్ స్థాయికి ఎదిగారు. తదనంతరం 2009 అక్టోబర్ 1న ఏకంగా ఎన్‌ఎస్‌ఎన్‌కు సీఈఓ పగ్గాలను చేజిక్కించుకోవడం గమనార్హం. ఈ ప్రస్థానంలో ఆయన నష్టాల్లో ఉన్న ఎన్‌ఎస్‌ఎన్‌ను తిరిగి లాభాల్లోకి(టర్న్‌అరౌండ్) తీసుకురావడంలో తనదైన పాత్ర పోషించారు. ప్రధానంగా నష్టాలు తెచ్చిపెడుతున్న విభాగాలను మూసేయడం, ఇతరత్రా వ్యయ నియంత్రణ చర్యలతోపాటు వ్యూహాత్మక కొనుగోళ్లు, విలీనాల ద్వారా కంపెనీని ముందుండి నడిపించారు. నాలుగేళ్లుగా ఎన్‌ఎస్‌ఎన్ సారథ్యం వహిస్తున్న సూరి.. ఎట్టకేలకు టాప్ పోస్ట్‌ను చేజిక్కించుకోగలిగారు.
గాడిలోపెట్టడమే ప్రధాన సవాలు....
ప్రత్యర్థి కంపెనీల నుంచి తీవ్ర పోటీ ఇతరత్రా ఇబ్బందుల కారణంగా నోకియా తన కీలక మొబైల్ హ్యాండ్‌సెట్ విభాగాన్ని మైక్రోసాఫ్ట్‌కు విక్రయించాల్సి వచ్చింది. దీంతో ఇప్పుడు నోకియా వద్ద 3 ప్రధాన విభాగాలు మిగిలాయి. ఇందులో పెద్దది నెట్‌వర్క్స్ విభాగం. ఈ ఏడాది కంపెనీ తొలి త్రైమాసిక నిర్వహణ లాభాల్లో 71 శాతం దీనినుంచే లభించడం గమనార్హం. ఇక మ్యాప్స్ బిజినెస్, పేటెంట్ల లెసైన్సింగ్‌ను నియంత్రించే యూనిట్‌లు కూడా ఇప్పుడు నోకియా వద్ద మిగిలాయి. మొబైల్స్ వ్యాపారం విక్రయం తర్వాత తాము నెట్‌వర్క్, నేవిగేషన్, పేటెంట్స్ యూనిట్లపైనే ఇక పూర్తిస్థాయిలో దృష్టిపెట్టనున్నట్లు కూడా ఇదివరకే పేర్కొంది.
కాగా, ఫ్రాన్స్‌కు చెందిన వైర్‌లెస్ ఎక్విప్‌మెంట్ యూనిట్ ఆల్కాటెల్-లూసెంట్‌ను నోకియా కొనుగోలు చేయనుందనే వార్తలు గతేడాదే వచ్చాయి. నెట్‌వర్క్ వ్యాపారంలో విశేష అనుభవం ఉన్న సూరికి మళ్లీ నోకియాకు పూర్వవైభవాన్ని తీసుకురావడమే ఇప్పుడు అతిపెద్దసవాలని పరిశ్రమ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఒకప్పుడు ప్రపంచ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో 50 శాతం వాటాతో దూసుకెళ్లిన నోకియా ఆతర్వాత టాప్-5 జాబితా నుంచి వైదొలగడం తెలిసిందే. ఏకంగా 5 బిలియన్ యూరోలకుపైగా నష్టాలు పేరుకుపోవడంతో ఈ వ్యాపారాన్ని మైక్రోసాఫ్ట్‌కు విక్రయించేసింది. ఈ ఒప్పందం గత శుక్రవారమే పూర్తయింది కూడా.
భారతీయులకు అంతర్జాతీయ అందలం...
ఇప్పటికే పలు అంతర్జాతీయ దిగ్గజ సంస్థలకు భారతీయులు సారథ్యం వహిస్తూ.. దేశానికి వన్నె తీసుకొచ్చారు. ఇప్పుడు సూరి కూడా ఈ జాబితాలో మన ఖ్యాతిని మరింత ఇనుమడింపజేశారు. పెప్సీకో చైర్మన్ ఇంద్రా నూయి, రెకిట్ బెంకిసర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రాకేశ్ కపూర్; మాస్టర్ కార్డ్ ప్రెసిడెంట్, సీఈఓ అజయ్ బంగా, డాయిష్ బ్యాంక్ సీఈఓ అన్షు జైన్ తదితరులు టాప్ పొజిషన్లలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే మైక్రోసాఫ్ట్‌కు ఏకంగా తెలుగు వ్యక్తి అయిన సత్య నాదెళ్ల సీఈఓ కావడంద్వారా ప్రపంచం మొత్తాన్ని భారత్‌వైపు చూసేలా చేశారు. నోకియా సీఈఓగా సూరి మరోసారి తన ప్రతిభ ద్వారా భారతీయుల్లో ఆనందాన్ని నింపారు.
రాజీవ్ సంగతిదీ...
1967లో భారత్‌లో జన్మించారు. తల్లిదండ్రులు యశ్‌పాల్ సూరి, ఆశా సూరి.
దాదాపు ఆయన ఎక్కువకాలం కువైట్‌లోనే నివాసం ఉన్నారు. భారత్, కువైట్ సహా ఫిన్లాండ్, యూకే, నైజీరియా, సింగపూర్ ఇలా ఏడు దేశాల్లో ఆయన ప్రస్థానం కొనసాగింది.
మంగళూరు యూనివర్సిటీ నుంచి 1989లో ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్స్‌లో ఇంజనీరింగ్ గ్యాడ్యుయేషన్‌ను పూర్తిచేశారు.
తదనంతరం కాల్‌కామ్ ఎలక్ట్రానిక్స్‌లో ఉద్యోగంలో చేరి వృత్తిపరమైన జీవితాన్ని ప్రారంభించారు.
ఇతర టాప్ ఎగ్జిక్యూటివ్‌ల మాదిరిగా ఆయనకు ఎంబీఏ/పీజీ ఇతరత్రా మేనేజ్‌మెంట్ ఇతరత్రా ఉన్నత డిగ్రీలేవీ లేకపోవడం గమనార్హం.
1995లో ఎన్‌ఎస్‌ఎన్ ఇండియాలో సిస్టమ్స్ మార్కెటింగ్ మేనేజర్‌గా నోకియాలోకి అడుగుపెట్టారు.
{పస్తుతం ఎన్‌ఎస్‌ఎన్(గతంలో నోకియా సీమెన్స్ నెట్‌వర్క్) సీఈఓగా ఉంటూ నోకియాకు పూర్తిస్థాయి సీఈఓగా నియమితులయ్యారు.
ఆరోగ్యంపై ఎక్కువగా దృష్టిపెట్టే రాజీవ్... ఖాళీ సమయాల్లో జిమ్‌లో గడిపేందుకు ఎక్కువగా ఇష్టపడతారు. అంతేకాదు ఆయన సంగీత ప్రియుడు కూడా.
ఆతర్వాత ఐసీఎల్ ఇండియా, నైజీరియాలోని చర్చ్‌గేట్ గ్రూప్‌లలో ఐదేళ్లు పనిచేశారు.
రాజీవ్‌కు భార్య(నైనా-వ్యాపారవేత్త), ఇద్దరు కుమారులు(అంకిత్, అనీష్) ఉన్నారు. నోకియా పుట్టినిల్లయిన ఫిన్లాండ్‌లోని రెండో పెద్ద నగరం ఎస్పూలో ఆయన ప్రస్తుతం నివసిస్తున్నారు.
పిల్లలిద్దరూ విదేశాల్లోనే చదువుతుండగా...
తల్లిదండ్రులు భారత్‌లోనే ఉంటున్నారు.