
నా ప్రతిష్టను మంటగలపడమే లక్ష్యం
టాటా గ్రూపు తాత్కాలిక చైర్మన్ రతన్‌టాటా... చైర్మన్‌గా సైరస్ మిస్త్రీ తొలగింపు అనంతర పరిణామాలపై తొలిసారిగా నోరు విప్పారు.
ఉద్దేశపూర్వకంగానే ఇదంతా చేశారు...
• ఈ రెండు నెలలు ఒంటరివాడినయ్యా
• మీడియాలో వార్తలు ఎంతో బాధను కలిగించాయి
• రతన్ టాటా భావోద్వేగ ప్రసంగం
• సైరస్‌మిస్త్రీ తొలగింపు అనంతర పరిణామాలపై విచారం
ముంబై: టాటా గ్రూపు తాత్కాలిక చైర్మన్ రతన్‌టాటా... చైర్మన్‌గా సైరస్ మిస్త్రీ తొలగింపు అనంతర పరిణామాలపై తొలిసారిగా నోరు విప్పారు. నుస్లీ వాడియాను డైరెక్టర్‌గా తొలగించేందుకు టాటా కెమికల్స్ కంపెనీ శుక్రవారం ముంబైలో నిర్వహించిన ఈజీఎం వేదికగా ఈ అంశంపై రతన్ భావోద్వేగంతో స్పందించారు. ‘‘గత రెండు నెలల కాలంలో నా వ్యక్తిగత ప్రతిష్ట... గొప్ప చరిత్ర ఉన్న టాటా గ్రూపు ప్రతిష్టను దెబ్బతీసే ఉద్దేశపూర్వక ప్రయత్నం జరిగింది. ఈ కాలంలో మీడియా చేసిన దాడితో ఒంటరి వాడినయ్యాను. వాటిలో చాలా వరకు నిరాధారమైనవే. చాలా బాధకు గురిచేశాయి. ఈ ప్రక్రియ బాధాకరమే అయినప్పటికీ చివరికి నిజమే గెలుస్తుంది’’ అని రతన్ టాటా వాటాదారుల సమక్షంలో పేర్కొన్నారు.
గత అక్టోబర్ 24న సైరస్ మిస్త్రీని టాటా గ్రూపు చైర్మన్‌గా తప్పించిన అనంతరం రతన్‌టాటా తాత్కాలిక చైర్మన్ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. పదవీచ్యుతుడిని చేయడంపై సైరస్ మిస్త్రీ మండిపడడం, రతన్‌టాటా, టాటాసన్స్‌పై ఆరోపణలు చేయడం, దానికి రతన్ టాటా వర్గం బదులివ్వడం.... ఇదో వివాదంగా మారింది. ఇరు వర్గాల మధ్య ఇన్నాళ్లూ బహిరంగ మాటల యుద్ధం కొనసాగగా చివరికి అది కంపెనీ లా బోర్డుకు చేరిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో రతన్ టాటా మాట్లాడుతూ... టాటా గ్రూపు 150 ఏళ్ల నుంచీ ఉందని, కార్పొరేట్ పాలన, పారదర్శక విధానాలతో కొనసాగుతోందన్నారు.
నిజం నిగ్గుతేలి, దేశంలో ఉన్న వ్యవస్థలు పనిచేయాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. ‘‘ఇక ఈ వారం నేను ఎంతో భావోద్వేగానికి లోనయ్యా. వాటాదారుల అభిమానం, మద్దతు నన్ను ఎంతగానో కదిలించింది. వాటాదారులకు నా మనస్ఫూర్తి కృతజ్ఞతలు చెప్పకుండా ఈ రోజు ఇక్కడి నుంచి వెళ్లలేను’’ అని రతన్ టాటా పేర్కొన్నారు. వాటాదారుల వైపు ఉండడం ఆనందంగా ఉందన్నారు.
టాటాలపై వాడియా పరువునష్టం కేసు
ప్రముఖ పారిశ్రామిక వేత్త నుస్లీ ఎన్ వాడియా టాటా గ్రూపు నిర్వహణ సంస్థ టాటా సన్స్‌తోపాటు ఆ గ్రూపు తాత్కాలిక చైర్మన్ రతన్‌టాటా, పలువురు డైరెక్టర్లపై ‘నేరపూరిత పరువునష్టం’ కేసు దాఖలు చేశారు. ముంబైలోని అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో శుక్రవారం పిటిషన్ వేశారు. టాటా కెమికల్స్, టాటా మోటార్స్, టాటా స్టీల్ బోర్డుల నుంచి ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా నుస్లీ వాడియాను తొలగించేందుకు వాటాదారులకు టాటా సన్స్ జారీ చేసిన ప్రత్యేక తీర్మానం... తన పేరు, ప్రతిష్టలకు తీవ్ర నష్టం కలిగించాయని పిటిషన్‌లో వాడియా పేర్కొన్నారు.
ఈ చర్య పలు ఇతర కంపెనీల్లో స్వతంత్ర డైరెక్టర్‌గా ఉన్న తన హోదాపై ప్రభావం చూపిందని.. దేశీయంగాను, విదేశాల్లోని వ్యాపా ర వర్గాల్లో తన పేరు ప్రతిష్టలకు విఘాతం కలిగిస్తుందని వాడియా ఆరోపించారు. ఐపీసీలోని సెక్షన్ 500 (పరువు నష్టం), సెక్షన్ 109 (నేర ప్రేరేపణ), సెక్షన్ 34 (ఉద్దేశపూర్వక నేరపూరిత చర్య) కింద టాటా సన్స్‌తోపా టు మరో 11 మందిపై విచారణ జరపాలని వాడియా కోర్టును కోరారు. రతన్, టాటా సన్స్ డైరెక్టర్లు అజయ్ పిరమల్, అమిత రణబీర్ చంద్ర, ఇషాత్ హుస్సేన్, నితిన్ నోహ్రియా, విజయ్‌సింగ్, వేణు శ్రీనివాసన్, రాల్ప్‌స్పెత్, ఎన్.చంద్రశేఖరన్, రణేంద్ర సేన్‌తోపాటు టాటాసన్స్ కంపెనీ సెక్రటరీ, సీఈవోల పేర్లు ఇందులో ఉన్నాయి. వాడియా లోగడ బోంబే హైకోర్టులో ఇదే విషయమై రూ.3,000 కోట్ల పరిహారం కోరుతూ పరువునష్టం కేసు దాఖలు చేసినట్టు సమాచారం.
టాటా మోటార్స్ బోర్డు వాడియాకు ఉద్వాసన
న్యూఢిల్లీ: స్వతంత్ర డైరెక్టర్ నుస్లీ వాడియాను బోర్డు నుంచి తొలగించే ప్రతిపాదనకు టాటా మోటార్స్ షేర్‌హోల్డర్లు ఆమోదముద్ర వేశారు. గురువారం జరిగిన అసాధారణ సర్వ సభ్య సమావేశంలో ఓటింగ్ ఫలితాలను కంపెనీ వెల్లడించింది. వాడియా తొలగింపునకు సంబంధించి టాటా సన్స్ ప్రవేశపెట్టిన ప్రతిపాదనకు అనుకూలంగా 71.20 శాతం ఓట్లు, వ్యతిరేకంగా 28.80 శాతం ఓట్లు వచ్చినట్లు సంస్థ పేర్కొంది. ఇప్పటికే టాటా స్టీల్ బోర్డు నుంచి ఆయన్ను తప్పించిన సంగతి తెలిసిందే.