5వేల రూపాయల నోట్లు వస్తున్నాయా.. లేవా?
ఇంకేముంది.. నేడో, రేపో 5వేల రూపాయల నోట్లు వచ్చేస్తున్నాయని ఆమధ్య తెగ ప్రచారం జరిగింది. ఇంతకీ అసలు ఆ నోట్లు వస్తున్నాయో లేవో మాత్రం ఎవరూ స్పష్టంగా చెప్పలేకపోయారు. ఇప్పుడు రిజర్వు బ్యాంకు ఆ విషయం మీద స్పందించింది. 5వేల నోట్లు వస్తున్నాయనడం అంతా శుద్ధ అబద్ధమని ఆర్బీఐ స్పష్టం చేసింది. సోమవారం నాడు ట్విట్టర్లో ఈ విషయం మీద గగ్గోలు పుట్టింది.
మంగళవారం నాడు 5వేల రూపాయల నోటు విడుదల అవుతోందంటూ.. ఓనోటు ఫొటోను కూడా పెట్టేశారు. అయితే, వెయ్యిరూపాయల నోటు మీద 1 అంకె తీసి.. 5 పెట్టేశారని ఇట్టే కనిపెట్టగలిగారు. అయితే, అసలు తమకు అలాంటి ప్రతిపాదనే లేదని, అసలీ వదంతులు ఎలా మొదలయ్యాయో తమకు తెలియదని ఆర్బీఐ ప్రతినిధి ఒకరు తెలిపారు. ముందు వాట్సప్లో ఎవరో ఈ విషయం గురించి చెప్పారని, అక్కడినుంచి అది అలా అలా వెళ్లిపోయిందని అంటున్నారు.
అయితే.. ఒకప్పుడు మన దేశంలో 5వేల రూపాయల నోట్లు కూడా చలామణిలో ఉండేవి. ఈ విషయం రిజర్వు బ్యాంకు వెబ్సైట్ చూస్తే తెలుస్తుంది. 1950 ప్రాంతాల్లో వెయ్యి, 5వేలు, 10 వేల రూపాయల నోట్లు కూడా ముద్రించారు. కానీ, 1967 సంవత్సరంలో వాటిని వెనక్కి తీసేసుకున్నారు.