న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) అక్టోబర్ 3,4,5వ తేదీల్లో జరపనున్న ద్రవ్య, పరపతి విధాన సమీక్ష సందర్భంగా రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు) నిర్ణయం వైపే మొగ్గుచూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. అరశాతం వరకూ పెంచే అవకాశాలు ఉన్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇదే జరిగితే ఈ రేటు 6.5 శాతం నుంచి 7 శాతానికి పెరిగే అవకాశం ఉంది. ఈ ఏడాది మూడవసారి రేటు పెంపు నిర్ణయం తీసుకున్నట్లు అవుతుంది.
నిర్దేశిత లక్ష్యాల మేరకు ద్రవ్యోల్బణం అదుపులోనే ఉన్నప్పటికీ, క్రూడ్ ఆయిల్ తీవ్రత, రూపాయి బలహీనత, అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ ఫండ్ రేటు పెంపు అంశాల నేపథ్యంలో రేటు పెంపు వైపే ఆర్‌బీఐ మొగ్గుచూపే అవకాశం ఉందని ఒక వార్తా సంస్థ సెప్టెంబర్ 19 నుంచి 25 మధ్య నిర్వహించిన సర్వేలో ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు. ఇక డాలర్ మారకంలో ఈ ఏడాది ఇప్పటి వరకూ దాదాపు 15 శాతం బలహీనపడ్డ రూపాయి విధాన నిర్ణేతలకు ఆందోళన కలిగించే అంశమేనన్నది వారి విశ్లేషణ.
అమెరికాలో వడ్డీరేటు పెరుగుతున్న పరిస్థితుల్లో, దేశీయంగా ఈ తరహా నిర్ణయం లేకపోతే దేశంలో పెట్టుబడులు పెట్టే విదేశీ ఇన్వెస్టర్‌కు తగిన రిటర్న్ లభించని పరిస్థితి ఉంటుంది. దీనితో దేశానికి విదేశీ నిధులు తగ్గిపోతాయి. ఈ పరిస్థితి కరెంట్ అకౌంట్ లోటుకు, రూపాయి మరింత పతనానికి దారితీస్తుంది. 3వ తేదీ నుంచీ గవర్నర్ ఉర్జిత్ పటేల్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ఆర్‌బీఐ పరపతి విధాన కమిటీ సమావేశం జరగనుంది. 5వ తేదీన కీలక రేట్లపై తన నిర్ణయాన్ని ప్రకటించనుంది. ఈ అంశంపై కొందరి అభిప్రాయాలు చూస్తే...
ఎస్‌బీఐ: రూపాయి బలహీనతను అరికట్టడానికి కనీసం పావుశాతం రేటు పెంపు తప్పదని ఎస్‌బీఐ తన పరిశోధనా పత్రంలో పేర్కొంది. ఆర్థిక వ్యవస్థకు సంబంధించి తన ‘తటస్థ వైఖరి’ని కూడా ఆర్‌బీఐ మార్చే అవకాశం ఉందని భావిస్తున్నట్లు ఈ నివేదిక పేర్కొంది.
ఐఎన్‌జీ: అమెరికా సెంట్రల్ బ్యాంక్.. ఫెడ్ వడ్డీరేట్ల (ప్రస్తుతం 2.25%) పెంపు నేపథ్యంలో దేశీయంగానూ రేట్ల పెంపు తప్పని పరిస్థితి నెలకొందని ఐఎన్‌జీలో ఆసియా ఆర్థిక వ్యవహారాల నిపుణులు ప్రకాశ్ శక్‌పాల్ పేర్కొన్నారు. ఆర్‌బీఐ అక్టోబర్ 4వ తేదీన పావుశాతం రేటు పెంచినా, ఫెడ్ రేటుకు సంబంధించి పోల్చిచూస్తే, ఆ మేర రేటు పెంపు (పావుశాతం) తక్కువగానే భావించాల్సి వస్తుందని ఆయన విశ్లేషించారు.
రాబోబ్యాంక్: భారత్ రెండవ త్రైమాసికంలో అధిక వృద్ధి రేటును సాధించినప్పటికీ, దానికి ప్రధానంగా బేస్ ఎఫెక్ట్ కారణమవుతుందని రబోబ్యాంక్‌లో సీనియర్ ఎకనమిస్ట్ హుగో ఎర్కిన్ పేర్కొన్నారు. చమురు ధరల పెరుగుదల ప్రస్తుతం భారత్ ముందున్న తీవ్ర సవాలని అన్నారు. ఇది కరెంట్ అకౌంట్‌పై ప్రతికూలత చూపే అంశంగా పేర్కొన్నారు.
డీబీఎస్: రూపాయి క్షీణతతో పాలసీ రేటు పెంపు ఆర్‌బీఐకి తప్పనిసరేనని, అయితే ఎప్పుడు పెంచుతారన్నదే కీలకమని సింగపూర్‌లో డీబీఎస్ ఎకనమిస్ట్ రాధికారావు పేర్కొన్నారు. బ్రెంట్ క్రూడ్ ధర తీవ్రత, దేశంలో ఇది ద్రవ్యోల్బణం పెరుగుదలకు దారితీసే అవకాశాలు రేటు పెంపు నిర్ణయం పట్ల ఆర్‌బీఐ మొగ్గుచూపేలా చేస్తాయని రాధికారావు పేర్కొన్నారు.
మోర్గాన్ స్టాన్లీ: ఆర్‌బీఐ వడ్డీ రేట్ల పెంపు ఖాయమని అంతర్జాతీయ ఆర్థిక సేవల దిగ్గజం మోర్గాన్ స్టాన్లీ అభిప్రాయపడుతోంది. రూపాయి బలహీనత ఇక్కడ కీలకాంశమని పేర్కొంది. కరెన్సీ విలువ స్థిరీకరణకు తీసుకుంటున్న చర్యలూ ఫలితమివ్వడం లేదన్న విషయాన్ని మోర్గాన్ స్టాన్లీ ప్రస్తావించింది. చమురు ధరల పెరుగుదల, ద్రవ్యలోటు సమస్య, ద్రవ్యోల్బణం ఎగసే అవకాశాలను ఇక్కడ పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది.
పెట్రో ధరల మంట...
దేశంలో పెట్రోలు, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. ద్రవ్యోల్బణం ము న్ముందు పెరుగుతుందనడానికి ఇది ప్రధాన కారణం. ఈ నేపథ్యంలో ఆర్‌బీఐ ముందస్తు చర్య తీసుకునే అవకాశం ఉంది. రెపో రేటు పావుశాతం పెరుగుతుందని భావిస్తున్నా. – రాజ్‌కిరణ్ రాయ్ జీ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీఎండీ
రూపీ బలహీనత కారణంగా...
కరెన్సీ విలువ డాలర్ మారకంలో భారీగా పడిపోతోంది. ఆయా పరిణామాలను ఎదుర్కొనడానికి పావుశాతం రేటు పెంపు తక్షణ అవసరం. – కేకి మిస్త్రీ, హెచ్‌డీఎఫ్‌సీ వైస్ చైర్మన్
రయ్‌మంటున్న క్రూడ్...
అంతర్జాతీయంగా క్రూడ్ ధర నాలుగున్నరేళ్ల గరిష్టస్థాయికి చేరింది. మంగళవారం నైమెక్స్ క్రూడ్ బ్యారల్ ధర 75.91 డాలర్లను తాకింది. ఈ వార్త రాసే 9 గంటల సమయానికి 75.30 వద్ద ట్రేడవుతోంది. భారత్ ప్రధానం గా వినియోగించే బ్రెంట్ ధర 85.36 స్థాయిని తాకి, అదే స్థాయిలో ట్రేడవుతోంది. సరఫరా పరమైన ఆందోళనలు అంతర్జాతీయంగా క్రూడ్ ధరల పెరుగుదలకు కారణం. 100 డాలర్లకు బ్రెంట్ చేరుతుందన్న అంచనాలు భారత్ వంటి వర్థమాన దేశాలకు ఆందోళన కలిగిస్తోంది.
జారిపోతున్న రూపాయి...
ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్ మారకంలో రూపాయి విలువ పడిపోతోంది. మంగళవారం నైమెక్స్‌లో రూపాయి విలువ డాలర్ మారకంలో 73.77కు పడిపోయింది. ఈ వార్త రాసే 9 గంటల సమయానికి 73.30 వద్ద ట్రేడవుతోంది.
ఇక ఆరు దేశాల కరెన్సీలతో ట్రేడయ్యే డాలర్ ఇండెక్స్ మళ్లీ 95 పటిష్ట స్థాయిని దాటింది. దేశీయ ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్‌లో ఇప్పటికి రూపాయి ఇంట్రాడే రికార్డు 72.99 అయితే, ముగింపులో రికార్డు 72.98. అంతర్జాతీయ ట్రేడింగ్ ధోరణిని చూస్తుంటే, బుధవారం దేశీయంగా 73ను రూపాయి దాటిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment