
రాజన్ పాలసీల అనుకరణే ఉత్తమం
ద్రవ్యోల్బణం కట్టడి అంశంపై మూడీస్ సూచన
న్యూఢిల్లీ: రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ద్రవ్యోల్బణ అదుపుదలకు రఘురామ్ రాజన్ పాటించిన పాలసీలను అనుకరించటం ఉత్తమమని మూడీస్ తెలిపింది. రాజన్ అవలంభించిన కఠిన ద్రవ్య విధానాలు సత్ఫలితాలనిస్తున్నాయని పేర్కొంది. అందుకే ఆర్‌బీఐ రాజన్ పాలసీలను అనుసరిస్తే బాగుంటుందని అభిప్రాయపడింది. ఆర్‌బీఐ ద్రవ్య విధానాలు దేశ సావరిన్ రేటింగ్‌ను ప్రభావితం చేస్తాయని పేర్కొంది. ప్రస్తుతం మూడీస్ భారత్‌కు పాజిటివ్ ఔట్‌లుక్‌తో కూడిన ‘బీఏఏ3’ రేటింగ్‌ను ఇచ్చింది.
దేశంలో గడచిన రెండేళ్లలో ద్రవ్యోల్బణం పరిమిత స్థాయిలకి పడింద ని మూడీస్ పేర్కొంది. ద్రవ్యోల్బణ అంచనాలకు అనుగుణంగా ఆర్‌బీఐ పాటించిన ద్రవ్య విధానాలే ఇందుకు కారణమని వివరించింది. నిర్దేశిత ద్రవ్యోల్బణ లక్ష్యాలను చేరుకోవాలంటే ఇది వరక టి పాలసీల అనుసరణే సరైన మార్గమని పేర్కొంది. ‘అధిక వడ్డీ రేట్లు కొనసాగిస్తున్నారు.. వృద్ధికి అడ్డుపడుతున్నారు.. వంటి పలు విమర్శలు రాజన్‌ను చుట్టుముట్టాయి.
వీటిని ఆయన కనిష్ట స్థాయి ద్రవ్యోల్బణంతో సమర్థంగా ఎదుర్కొన్నారు’ అని వివరించింది. భారత్ ఆర్థిక వ్యవస్థకు ద్రవ్యోల్బణ ఆధారిత ద్రవ్య విధానమే ఉత్తమమని పేర్కొంది. కాగా అక్టోబర్ 4న జరగనున్న రిజర్వు బ్యాంక్ ద్రవ్య విధాన పాలసీలో ఆర్‌బీఐ గవర్నర్‌కు బదులు మానిటరీ పాలసీ కమిటీ కీలక వడ్డీ రేట్లను నిర్ణయించనున్నది. ఇందులో ఆరుగురు సభ్యులు ఉంటారు. ముగ్గురు ఆర్‌బీఐకి చెందిన వారుంటే (గవర్నర్, డిప్యూటీ గవర్నర్, ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్), మిగతా వారిని కేంద్రం నియమిస్తుంది.