ఆర్‌బీఐ మానిటరీ కమిటీ (ఫైల్ ఫోటో)
ముంబై : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆశ్చర్యకరమైన ప్రకటన చేసింది. విశ్లేషకుల అంచనాలన్నింటికీ చెక్ పెడుతూ.. కీలక వడ్డీరేటు రెపోను యథాతథంగా ఉంచుతున్నట్టు ప్రకటించింది. దీంతో రెపో రేటును 6.5 శాతంగానే ఉంది. బ్యాంక్ రేటును 6.75 శాతంగా ఉంచింది. గవర్నర్ ఉర్జిత్ పటేల్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ఆర్‌బీఐ పరపతి విధాన కమిటీ ఏకగ్రీవంగా ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. అయితే మెజార్టీ విశ్లేషకులు, మార్కెట్లు ఈ సారి రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచుతుందని అభిప్రాయపడ్డాయి.
కానీ మార్కెట్లను, విశ్లేషకులను ఆర్‌బీఐ ఆశ్చర్యపరిచింది. ఆర్‌బీఐ ఈ ప్రకటన తర్వాత మార్కెట్లు భారీగా కిందకి పడ్డాయి. సెన్సెక్స్ 550 పాయింట్లు పతనమైంది. మొట్టమొదటిసారి రూపాయి విలువ భారీగా పడిపోయి, చారిత్రాత్మక కనిష్ట స్థాయి 74 మార్కును తాకింది. రూపాయి విలువను కాపాడటానికైనా ఆర్‌బీఐ రెపో రేటును పెంచుతుందని విశ్లేషకులు భావించారు. కానీ ఆ మేరకు నిర్ణయం తీసుకోకపోవడంతో, రూపాయి అంతకంతకు క్షీణిస్తోంది. మార్కెట్లు కూడా అదే స్థాయిలో కిందకు పడుతున్నాయి. ఆర్‌బీఐ నిర్ణయాన్ని పలువురు విశ్లేషకులు స్వాగతిస్తున్నారు. రేట్లను పెంచకపోవడం చాలా మంచి నిర్ణయమని పీఎంఈఏసీ మెంబర్ అశిమా గోయల్ అన్నారు. ఇది వేచిచూడాల్సిన సమయం అని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment