రియల్టీకి జీఎస్‌టీ ఏం తెస్తోంది? | Realty What brings you to the GST? | Sakshi
Sakshi News home page

రియల్టీకి జీఎస్‌టీ ఏం తెస్తోంది?

Published Fri, Aug 12 2016 10:10 PM | Last Updated on Mon, Sep 4 2017 9:00 AM

రియల్టీకి జీఎస్‌టీ ఏం తెస్తోంది?

రియల్టీకి జీఎస్‌టీ ఏం తెస్తోంది?

స్థిరాస్తి ధరలు తగ్గుతాయా? పెరుగుతాయా?
సర్వీస్ ట్యాక్స్‌లాగే అందుబాటు ఇళ్లకు జీఎస్‌టీని మినహాయించాలి
ప్రాజెక్ట్ వ్యయంలో 27-33 శాతం పన్నుల రూపంలోనే చెల్లిస్తున్నాం
దీనికంటే జీఎస్‌టీ రేటు తక్కువుంటేనే స్థిరాస్తి రంగానికి లాభం


వస్తు సేవలను చట్టం (జీఎస్‌టీ)కి రాజ్యసభ ఆమోదముద్ర వేసింది. వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమలు చేయటానికి ప్రయత్నాలు చేస్తున్నామని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించేశారు కూడా. ఈ నేపథ్యంలో స్థిరాస్తి రంగం మీద జీఎస్‌టీ ప్రభావం ఎంత వరకుంటుంది? ధరలేమైనా తగ్గే అవకాశముందా? అందుబాటు ఇళ్ల పరిస్థితేంటి? వంటి అంశాలపై పలువురు స్థిరాస్తి నిపుణులతో ‘సాక్షి రియల్టీ’ చర్చించింది.

 

హైదరాబాద్:  ఐటీ రంగం తర్వాత అత్యధిక ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్న రంగం స్థిరాస్తి రంగమే. స్థూల దేశీయోత్పత్తిలో ఈ రంగం వాటా 7.8 శాతం వరకుంది. అలాంటి రంగంలో ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న సమస్యలు, సవాళ్లు జీఎస్‌టీ అమలుతో సమసిపోతాయి కూడా. జీఎస్‌టీ ప్రయోజనం స్థిరాస్తి రంగంపై దీర్ఘకాలంలో ఉంటుంది. ఏకీకృత పన్ను వ్యవస్థలో పారదర్శకత వస్తుందనడంలోనూ ఎలాంటి సందేహం అక్కర్లేదు. జీఎస్‌టీ రేటును ఎంతనేది నిర్ణయించకుండానే నిర్మాణ రంగానికి లాభం చేకూరతుందనడం మాత్రం సరైంది కాదనేది నిపుణుల అభిప్రాయం.

 
27-33 శాతం పన్నులే..

ప్రస్తుతం కేంద్రం, రాష్ట్రాలు స్థలాలు, ప్రాపర్టీలు, ఇతర నిర్మాణ కాంట్రాక్ట్‌లకు సంబంధించి వివిధ రకాల పన్నులను వసూలు చేస్తున్నాయి. ఇవి ప్రధానంగా సేవల విలువ, వస్తువులు, ముడి పదార్థాల విలువ, భూమి విలువ అనే మూడు రకాలుగా ఉంటాయి. ఆయా పన్నులు విస్తీర్ణాన్ని, స్థలాన్ని, భవనాల ఎత్తును బట్టి కూడా మారుతుంటాయి. ‘‘ఇందులో వ్యాట్, సీఎస్‌టీ, సర్వీస్ ట్యాక్స్, ఎకై ్సజ్ డ్యూటీలే కాకుండా నిర్మాణ అనుమతుల కోసం స్థానిక సంస్థల ఫీజులు, స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీలు, నాలా చార్జీ, చేంజ్ ఆఫ్ ల్యాండ్, లేబర్ సెస్, ప్రాపర్టీ ట్యాక్స్, ఇంపాక్ట్ ఫీ.. వంటి బోలెడు చార్జీలున్నాయి. వీటన్నింటినీ కలిపితే మొత్తం ప్రాజెక్ట్ వ్యయంలో 27-33 శాతం వరకు పన్నులే ఉంటాయని’’ భారత స్థిరాస్తి బిల్డర్ల సమాఖ్య (క్రెడాయ్) మాజీ జాతీయ అధ్యక్షుడు శేఖర్ రెడ్డి చెప్పారు. అంటే వెయ్యి కోట్ల ప్రాజెక్ట్‌లో మూడో వంతు పన్నుల రూపంలోనేపోతున్నాయన్నమాట. అయితే ఇప్పుడొస్తున్న జీఎస్‌టీ పరిధిలో సర్వీస్ ట్యాక్స్, ఎకై ్సజ్ డ్యూటీ, వ్యాట్, సీఎస్టీలు మాత్రమే ఉన్నాయి. మరి మిగిలిన పన్నులు యథావిధే అన్నమాటేగా. ఈ పన్నులే స్థిరాస్తి రంగానికి భారంగా మారుతున్నాయి. మరోవైపు నిర్మాణ సామగ్రి ధరలూ పెరుగుతున్నాయి. ఫలితంగా స్థిరాస్తి ధరలు అందుబాటులో ఉండట్లేదు. ఇందులో వేటికీ మినహాయింపునివ్వకుండా జీఎస్‌టీని అమలు చేస్తే నిర్మాణ రంగానికి ఒరిగే ప్రయోజనమేమీలేదని రెడ్డి అభిప్రాయపడ్డారు.

 
జీఎస్‌టీ ప్రయోజనం అప్పుడే.
.
ప్రస్తుతం చెల్లిస్తున్న పన్నుల శాతం కంటే జీఎస్‌టీ రేటు తక్కువగా ఉంటేనే డెవలపర్లకు, కస్టమర్లకు ఇద్దరికీ లాభం. అంటే ప్రస్తుతం ముడి పదార్థాల మీద చెల్లిస్తున్న సర్వీస్ ట్యాక్స్, వ్యాట్, ఎకై ్సజ్ డ్యూటీల కంటే  జీఎస్‌టీ రేటు తక్కువగా ఉండాలి. అప్పుడే నిర్మాణ రంగానికి ప్రయోజనం. లేకపోతే ఆ భారాన్ని కూడా కొనుగోలుదారులే భరించాల్సి ఉంటుందని యార్డ్స్ అండ్ ఫీట్స్ ప్రాపర్టీ కన్సల్టెంట్ కళిశెట్టి నాయుడు చెప్పారు. నిర్మాణ రంగం సిమెంట్, స్టీల్ వంటి సుమారు 250కి పైగా పరిశ్రమలపై ఆధారపడి ఉంటుంది. ఆయా రంగాలు చెల్లిస్తున్న రకరకాల పన్నుల భారం అంతిమంగా ఉత్పత్తుల ధరలపై పడుతున్నాయి. కానీ, ఇప్పుడు జీఎస్‌టీతో ఆ భారం ఉండదు కనక.. ఆ తగ్గింపు ధరలకూ చేరుతుంది. ఫలితంగా డెవలపర్లకు నిర్మాణ వ్యయం తగ్గుతుంది. స్థిరాస్తి రంగానికి డిమాండ్ పెరుగుతుంది.

 
అందుబాటు ఇళ్లకు మినహాయింపునిస్తేనే..

‘‘గతంలోనే రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ బిల్లు 2016ను తీసుకొచ్చింది కేంద్రం. అయితే అన్ని రాష్ట్రాల్లో ఈ బిల్లు అమలులోకి రావాలంటే మరో ఏడాదైనా సమయం పడుతుంది. ఈ తరుణంలో జీఎస్‌టీ పేరిట మరో బిల్లు రావటం నిర్మాణ రంగానికి మంచిదే. అయితే ప్రస్తుతం ఎలాగైతే అఫడబుల్ హౌజింగ్‌కు సర్వీస్ ట్యాక్స్‌ను మినహాయింపునిచ్చారో.. అలాగే జీఎస్‌టీని కూడా మినహాయింపునివ్వాలి. లేకపోతే అందుబాటు ఇళ్లకు గిరాకీ ఉండదు. కేంద్రం తీసుకొచ్చిన ‘హౌజింగ్ ఫర్ ఆల్-2022’ పథకానికి పెద్దగా ప్రయోజనం ఉండదని’’ శేఖర్ రెడ్డి వివరించా రు. ప్రస్తుతం స్థిరాస్తి కొనుగోలుదారులకు భారమయ్యేది స్టాంప్ డ్యూటీ దగ్గరే. అందుకే దీన్ని జీఎస్‌టీలో మిళితం చేయాలని గతంలోనే ప్రభుత్వానికి విన్నవించాం. కానీ, పట్టించుకోలేదన్నారు.

 

ధరలు తగ్గుతాయా?
స్థిరాస్తి ధరలు తగ్గుతాయా లేదా అనేది జీఎస్‌టీ రేటుపై ఆధారపడి ఉంటుంది. అయితే గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న ప్రాజెక్ట్‌లపై జీఎస్‌టీ ప్రభావం ఉండకపోవచ్చు. ఎందుకంటే అప్పటికే  ప్రభుత్వానికి అన్ని రకాల పన్నులు చెల్లించేసి ఉంటారు. అయితే నిర్మాణంలో ఉన్న, భవిష్యత్తులో నిర్మించబోయే ప్రాజెక్ట్‌లకు మాత్రం జీఎస్‌టీ లబ్ధి చేకూరుతుంది. అదెలాగంటే.. సిమెంట్, స్టీలు, రంగులు, శానిటరీ  వంటి నిర్మాణ సామాగ్రిపై చెల్లించే వివిధ రకరకాల పన్నుల భారం డెవలపర్లకుండదు. దీంతో నిర్మాణ వ్యయమూ తగ్గుతుంది. ఫలితంగా స్థిరాస్తి ధరలూ తగ్గుతాయి. కానీ, రకరకాల కారణాలతో డెవలపర్లు ఆ తగ్గింపును కొనుగోలుదారులకు చేరవేర్చరనేది కొనుగోలుదారుల వాదన. వాణిజ్య ప్రాజెక్ట్‌లకు చెల్లించే అధిక పన్నుల భారం తగ్గి.. వాణిజ్య ప్రాజెక్ట్‌లు లీజులు, అద్దెలూ పెరిగే అవకాశముంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement