రెడ్‌మి నోట్ 5, రెడ్‌మి నోట్ 5 ప్రొ
షావోమి న్యూఢిల్లీ వేదికగా రెండు సరికొత్త స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసింది. రెడ్‌మి నోట్ 5, రెడ్‌మి నోట్ 5 ప్రొ పేర్లతో వీటిని మార్కెట్‌లోకి తీసుకొస్తున్నట్టు ప్రకటించింది. రెడ్‌మి నోట్ 4కు సక్ససర్‌గా రెడ్‌మి నోట్ 5ను విడుదల చేస్తున్నట్టు కంపెనీ ఇండియా హెడ్ మను కుమార్ జైన్ తెలిపారు. రెడ్‌మి నోట్ 4తో పోలిస్తే ఈ స్మార్ట్‌ఫోన్ బెజెల్-లెస్ డిజైన్, అతిపెద్దగా 5.99 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. రెడ్‌మి నోట్ 4 బ్యాటరీ కెపాసిటీ కూడా 4000 ఎంఏహెచ్. గతేడాది మోడల్ కంటే సగం మిల్లీమీటర్ పలుచగా ఉందని తెలిపారు. ముందస్తు నోట్ స్మార్ట్‌ఫోన్ల కంటే మెరుగ్గా లో-లైట్ ఫోటోగ్రఫీతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. 12 మెగాపిక్సెల్ సెన్సార్‌ను ఈ ఫోన్ కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్625 ప్రాసెసర్ కింద 3జీబీ ర్యామ్ + 32జీబీ స్టోరేజ్, 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్లలో దీన్ని మార్కెట్లోకి తీసుకొచ్చింది. వీటి ధరలు రూ.9,999గా, రూ. 11,999గా ఉన్నాయి. నాలుగు రంగుల్లో రెడ్‌మి నోట్ 5 అందుబాటులో ఉంచనున్నట్టు మను కుమార్ జైన్ తెలిపారు.
షావోమి లాంచ్ చేసిన మరో స్మార్ట్‌ఫోన్ రెడ్‌మి నోట్ 5 ప్రొ.. 6జీబీ ర్యామ్‌ను కలిగి ఉంది. 6జీబీ ర్యామ్‌తో వచ్చిన తొలి నోట్ సిరీస్ స్మార్ట్‌ఫోన్ ఇదే కావడం విశేషం. 4జీబీ ర్యామ్+64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 6జీబీ ర్యామ్+64జీబీ స్టోరేజ్ వేరియంట్లలో దీన్ని లాంచ్ చేసింది. వీటి ధరలు రూ.13,999గా, రూ.16,999గా ఉన్నాయి. ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌ను కూడా ఈ స్మార్ట్‌ఫోన్‌తో షావోమి తన యూజర్లకు ప్రవేశపెట్టింది. 20 మెగాపిక్సెల్‌తో సెల్ఫీ షూటర్ కలిగి ఉండగా.. వెనుకవైపు 12 మెగాపిక్సెల్, 5 మెగాపిక్సెల్ సెన్సార్లతో డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్లను వచ్చే వారం నుంచి ఫ్లిప్‌కార్ట్, ఎంఐ.కామ్‌లలో ఫ్లాష్ సేల్‌కు రానున్నట్టు తెలుస్తోంది. అనంతరం ఆఫ్‌లైన్‌గా కూడా వీటిని అందుబాటులోకి తీసుకురానుంది.
వీటితో పాటు తొలిసారి భారత్‌లో ఎంఐ టీవీ4ను కూడా కంపెనీ విడుదల చేసింది. శాంసంగ్ గెలాక్సీ ఎస్8 కంటే పలుచగా ఈ ఎంఐ టీవీ ఉంది. ప్రపంచంలోనే అత్యంత పలుచైన ఎల్‌ఈడీ టీవీ ఇదేనని షావోమి తెలిపింది. దీని ధర రూ.39,999గా కంపెనీ నిర్ణయించింది. హాట్‌స్టార్, వూట్, సోనీ లివ్, హంగామా ప్లే, జీ5, సన్ నెక్ట్స్, వియూ, టీవీఎఫ్, ఫ్లిక్‌స్ట్రీ వంటి వాటితో షావోమి భాగస్వామ్యం ఏర్పరుచుకుంది. వీటి భాగస్వామ్యంతో 5 లక్షల గంటల కంటెంట్‌ను అందించనున్నట్టు పేర్కొంది. దీనిలో 80 శాతం కంటెంంట్‌ను పూర్తిగా ఉచితమని తెలిపింది. ఎంఐ టీవీ 4 తోపాటు ఎంఐ టీవీ రిమోట్‌ను కూడా షావోమి తీసుకొచ్చింది. దీనిలో కేవలం 11 బటన్లు మాత్రమే ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment