హైదరాబాద్ సమీపంలో రీగల్ రాప్టార్ బైక్స్ ప్లాంట్
ఆటోమోటివ్ పార్కులో ఏర్పాటు
► ఫ్యాబ్ మోటార్స్ 1,000 కోట్ల పెట్టుబడి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లగ్జరీ బైక్‌ల తయారీలో ఉన్న అమెరికా కంపెనీ రీగల్ రాప్టార్ మోటార్‌సైకిల్స్ భారత్‌లో అడుగు పెట్టింది. సంస్థ భారతీయ భాగస్వామి అయిన ఫ్యాబులస్ అండ్ బియాండ్ మోటార్స్ ఇండియా(ఫ్యాబ్ మోటార్స్) తొలి షోరూంను హైదరాబాద్‌లో మంగళవారం ప్రారంభించింది. ఫ్యాబ్ మోటార్స్ నగరం సమీపంలోని కలకల్ వద్ద ఉన్న ఆటోమోటివ్ పార్కులో అసెంబ్లింగ్ ప్లాంటును సైతం ఏర్పాటు చేస్తోంది. రీగల్ రాప్టార్, ఫ్యాబ్ మోటార్స్‌లు సంయుక్తంగా మూడేళ్లలో రూ.1,000 కోట్లు పెట్టుబడి పెట్టనున్నాయి. తొలి దశలో షిఫ్ట్‌కు నెలకు 500 బైక్‌ల తయారీ సామర్థ్యంతో ఏడాదిలో ప్లాంటు సిద్ధమవుతుందని ఫ్యాబ్ మోటార్స్ మేనేజింగ్ డెరైక్టర్ ఎంజీ షారిఖ్ తెలిపారు. ఫ్యాబ్ రీగల్ రాప్టార్ మోటార్ సైకిల్స్ చైర్మన్ ఎంజీ జిలానితో కలసి సాక్షి బిజినెస్ బ్యూరోతో మాట్లాడారు.
100% ఇక్కడే..: ప్లాంటు ఏర్పాటుకు పార్కులో 20 ఎకరాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది. మొత్తం 100 ఎకరాలు అవసరమవుతాయని షారిఖ్ తెలిపారు. ‘మూడు నెలల్లో కంపెనీ చేతికి స్థలం వస్తుందని ఆశిస్తున్నాం. తొలుత విడిభాగాల రూపంలో(సీకేడీ) బైక్‌లను దిగుమతి చేస్తాం. రానున్న రోజుల్లో అన్ని విడిభాగాలను ఇక్కడే ఉత్పత్తి చేస్తాం. విడిభాగాల తయారీ కంపెనీలతో యూనిట్లు పెట్టాలని కోరుతున్నాం. ఏడాదిన్నరలో పూర్తి బైక్‌ను తయారు చేయాలన్నది లక్ష్యం. ప్రత్యక్షంగా 13 వేలు, పరోక్షంగా 10 వేల మందికి ఉపాధి లభిస్తుంది. బైక్‌లను విదేశాలకు ఎగుమతి చేస్తాం’ అన్నారు.
దేశవ్యాప్తంగా షోరూంలు..
ఫ్యాబ్ మోటార్స్ ఆరు నెలల్లో దేశవ్యాప్తంగా 16 షోరూంలను ఏర్పాటు చేయనుంది. ప్రస్తుతం బాబర్ 350, డేటోనా 350, క్రూయిజర్ 350 మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. 500, 800తోపాటు 1,600 సీసీ మోడళ్లు కూడా రానున్నాయి. బైక్‌ల ధర రూ.2.90-20 లక్షల మధ్య ఉంది. సీకేడీ రూపంలో దిగుమతి చేస్తే 10 శాతం, పూర్తిగా తయారైన బైక్‌కు 150 శాతం దిగుమతి పన్ను ఉందని కంపెనీ తెలిపింది. బైక్‌లను ఇక్కడ తయారు చేస్తే తుది ఉత్పాదన ధర 20 శాతం వరకు తగ్గొచ్చు. రీగల్ రాప్టార్ 39 దేశాల్లో బైక్‌లను విక్రయిస్తోంది.