సెల్‌కాన్.. రెహ్మానిష్క్ ఫోన్
కోల్‌కతా, సాక్షి ప్రతినిధి: హ్యాండ్‌సెట్స్ తయారీ సంస్థ సెల్‌కాన్.. సంగీత ప్రియులు, యువత కోసం రెహ్మానిష్క్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తెచ్చింది. సోమవారం కోల్‌కతాలో జరిగిన కార్యక్రమంలో సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహ్మాన్‌తో కలిసి సెల్‌కాన్ సీఎండీ వై.గురు, ఈడీ మురళి రేతినేని ఏఆర్45 ఫోన్‌ని ఆవిష్కరించారు. కొత్త టెక్నాలజీతో వినూత్న ఉత్పత్తులను అందుబాటులోకి తెస్తోందంటూ ఈ సందర్భంగా రెహ్మాన్ సెల్‌కాన్‌ని అభినందించారు. సాధ్యమైనంత వరకూ దేశీయ కంపెనీల ఉత్పత్తులనే కొనుగోలు చేయాలని ఆయన సూచించారు. సంగీతానికి సంబంధించి అత్యాధునిక వాద్య పరికరాల తయారీ ఇక్కడ తక్కువ కావడంతో తాను విదేశీవి కొనాల్సి వస్తోందని చెప్పారు. ఫోన్ ఆవిష్కరణలో తొలిసారిగా అత్యాధునిక 4డీ హోలోగ్రాఫిక్ టెక్నాలజీని వినియోగించారు.
త్వరలో మరిన్ని..
రెహ్మానిష్క్ పేరిట కోల్‌కతా, వైజాగ్ సహా నాలుగు ప్రాంతాల్లో కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, ఈ సందర్భంగా ఏఆర్ సిరీస్‌లో మరో మూడు స్మార్ట్ ఫోన్లను కూడా మార్కెట్లోకి విడుదల చేస్తామని గురు తెలియజేశారు. ఒక్కో నగరంలో ఒక్కో మోడల్ చొప్పున ఈ సిరీస్‌లో మొత్తం నాలుగు ఉంటాయన్నారు. వీటి ధరలు సుమారు రూ. 6,000 నుంచి రూ. 9,000 దాకా ఉంటాయని, దసరా సీజన్లో నెలకు లక్ష హ్యాండ్‌సెట్స్ విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. వీటిని ఆఫ్రికా తదితర దేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నట్లు తెలియజేశారు. రెహ్మానిష్క్‌పై సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో భారీ స్పందన వస్తోందని, ట్విట్టర్ ట్రెండ్స్‌లో ఇది నాలుగో స్థానంలో నిల్చిందని గురు చెప్పారు. రె హ్మానిష్క్ సిరీస్ ఫోన్ల కోసం రెహ్మాన్ ప్రత్యేకంగా జింగిల్ తయారు చేశారని, ఈ రింగ్‌టోన్‌ని మిగతా హ్యాండ్‌సెట్స్‌లోనూ అందుబాటులోకి తెస్తామని తెలియజేశారు. రెండు మూడు రోజుల్లో క్యాంపస్ సిరీస్‌లో ఏ-15 మోడల్ ప్రవేశపెడుతున్నామని, దీని ధర సుమారు రూ. 3,799గా ఉంటుందని చెప్పారు.
రెహ్మానిష్క్ ఏఆర్45 ప్రత్యేకతలు...
4.5 అంగుళాల స్క్రీన్ ఉండే ఏఆర్45 ఫోన్... ఆండ్రాయిడ్ జెల్లీ బీన్ ఆపరేటింగ్ సిస్టంతో పనిచేస్తుంది. 1.2 గిగాహెర్ట్జ్ డ్యూయల్ కోర్ ఏ7 ప్రాసెసర్, 5 ఎంపీ కెమెరా, 3జీ వీడియో కాలింగ్, 4జీ ఆర్‌వోఎం, ఇంటరాక్టివ్ గేమింగ్ వంటి ఫీచర్లుంటాయి. ధర రూ.7,999. ఏఆర్ రె హ్మాన్ స్వరపర్చిన సూపర్‌హిట్ పాటలు ప్రీలోడెడ్ కంటెంట్‌గా లభిస్తాయి. మెరుగైన సంగీతానుభూతి ఇచ్చేందుకు కె-క్లాస్ యాంప్లిఫయర్‌తో డ్యూయల్ స్పీకర్లు రూపుదిద్దుకున్నాయి. ఇందులో షేక్ అండ్ ట్రాన్స్‌ఫర్, ఫోటా (ఫర్మ్‌వేర్ ఓవర్ ది ఎయిర్) వంటి సొంతంగా అభివృద్ధి చేసిన టెక్నాలజీని వినియోగించామని మురళి తెలి పారు. ఒక ఫోన్ నుంచి మరో ఫోన్‌కి కేబుల్స్, బ్లూటూత్ వంటివేమీ లేకుండా షేక్ చేయడం ద్వారా వేగంగా డేటాను పంపేందుకు షేక్ అండ్ ట్రాన్స్‌ఫర్ ఉపయోగపడుతుందని వివరించారు. 100 ఎంబీ డేటాను సైతం ఈ పద్ధతిలో కేవలం రెండు సెకన్లలో పంపొచ్చని మురళి చెప్పారు