ప్రతీకాత్మక చిత్రం
సంగీతం, నృత్యం, చిత్రలేఖనం, ఇలా లలిత కళలు ఐదు. కానీ మిగతా వాటికి భిన్నమైన దారి సంగీతానిది. సంగీతానిది ఎలాంటి ఎల్లలూ, హద్దులూ లేని విశ్వభాష. సంగీతం మనసుకు హాయిని కలిగిస్తుంది. కొన్ని రకాల అనారోగ్యాలను తొలగిస్తుంది.
ముఖ్యంగా మానసిక ఆరోగ్యానికి సంగీతంతో చికిత్స చేయవచ్చు. జూన్ 21న ప్రపంచ సంగీతం దినోత్సవం. ఈ సందర్భంగా సంగీతం మనిషి జీవితంతో ఎంతగా పెనవేసుకుని పోయిందో, అన్ని రోజులూ మన వీనులకు విందు గావించే సంగీతానికి ప్రత్యేకంగా ఓ రోజంటూ ఎందుకు కేటాయించారో తెలుసుకుందాం...
మనకు నచ్చిన పాట లేదా మనసుకు హత్తుకునే సంగీతం విన్నపుడు విన్నపుడు మనకు తెలీకుండానే ఒక రకమైన తన్మయత్వం కలుగుతుంది. ఎప్పుడైనా కాస్త డీలా పడినట్లు, ఒత్తిడికి లోనైనట్లు అనిపించినప్పుడు ఒక మంచిపాట, వీనులవిందైన సంగీతం వింటే ఆ ఒత్తిడి మొత్తం ఎగిరిపోతుంది. ఎంతో సాంత్వన లభిస్తుంది. నూతనోత్తేజం కలుగుతుంది.
ఇక సంతోష సమయాలలో ఐతే చెప్పనక్కర్లేదు. పెళ్లి వేడుకలు, ఇతర కార్యక్రమాల్లో ఉరకలెత్తించే, హుషారు కలిగించే సంగీతం, పాటలు వాతావరణాన్ని మరింత సందడిగా ఆహ్లాదంగా మారుస్తాయి. మొత్తంగా సంగీతాన్ని ఇష్టపడని సంగీతానికి పరవశించని వారంటూ ఉండరంటే అతిశయోక్తి కాదేమో!
సంగీతం... సార్వజనీనం
పొత్తిళ్లలోని పాపాయి ఉంగా ఉంగా అని చేసే శబ్దంలో ఉంది సంగీతం, తల్లి తన బిడ్డను ఊయలలూపుతూ పాడే లాలిపాటల్లో ఉంది సంగీతం, ఏడుస్తున్న పసిబిడ్డ ఆ ఏడుపు ఆపి హాయిగా కేరింతలు కొట్టేటట్లు చేయగల అమ్మమ్మలు, బామ్మల జోలపాటల్లో ఉంది సంగీతం, శ్రమైక జీవులు తమకు అలుపు తెలీకుండా పాడుకునే పాటల్లో ఉంది సంగీతం.
ఇవన్నీ కూడా ఎలాంటి శాస్త్రీయ పద్ధతిని పాటించకపోయినప్పటికీ ఒక సొగసైన తాళం, రమ్యమైన లయతో సాగుతుంటాయి. మనుషులే కాదు ఇతర ప్రాణులకూ ఉంది సంగీత జ్ఞానం.
నాగస్వరం విన్న సర్పాలు సొగసుగా నాట్యమాడటం, చైత్రమాసాన లేత మామిడి చివుళ్లు తిన్న కోయిలమ్మ కుహుకుహు రాగమాలపించటం, సంగీతం వింటూ ఆవులు పాలు సమృద్ధిగా ఇవ్వడం మనకు తెలిసిందే. అందుగలడిందులేడని...అన్న చందాన ప్రపంచమంతటా నిండి ఉంది సంగీతం. అందుకే అన్నారు శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గాన రసం ఫణిః అని.
వాగ్గేయకారులైన అన్నమయ్య, త్యాగయ్య, క్షేత్రయ్య వంటివారు తమ ఆరాధ్యదైవాలపైన సంకీర్తనలు రచించారు. పాటలు పాడుకున్నారు. తమ జీవితంలోని విషాదాలను, విరహాలను తొలగించుకున్నారు. నైరాశ్యాన్ని సంగీతంతోనే జయించారు.
అంతకంటే ముందు అశోకవనంలో సీతాదేవి ఒకానొక దశలో తీవ్ర నైరాశ్యానికి లోనై, పొడవైన తన కేశాలతో గొంతుకు ఉరి బిగించుకుని ఆత్మహత్యకు పాల్పడబోతుండగా.. చెట్టు మీదున్న ఓ పక్షి ఏదో వింత వింత శబ్దాలతో వీనులవిందైన రాగాన్ని ఆలపించింది.
అప్రయత్నంగా ఆ రాగాలను ఆలకించిన సీతమ్మలోని నైరాశ్యం, కుంగుబాటు తొలగిపోయాయి. జీవితంపై తిరిగి ఆశలు చిగురించాయి. ఆత్మహత్యా ప్రయత్నాన్ని విరమించుకుని రాముడి కోసం ఓపిగ్గా నిరీక్షించింది. ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలిసిందే.
మెదడుకు, హృదయానికి సంబంధించిన కొన్ని వ్యాధులకు చేసే చికిత్సలో రోగికి ఇష్టమైన సంగీతాన్ని వినిపించడం ద్వారా వైద్యులు సత్ఫలితాలను సాధించిన దాఖలాలెన్నో మనకు తెలుసు. బీపీ, తలనొప్పి వంటి వాటిని సంగీత చికిత్సతో నయం చేయవచ్చని వైద్యులు నిరూపించారు కూడా.
బాత్‌రూమ్‌లో కూనిరాగాలు తీసే వారు, బరువు పనులు చేసేవారు, రేవుల్లో బట్టలు ఉతికే రజకులు.. ఒకరేమిటి... శ్రమ తెలియకుండా తమకు తోచిన పాటలు పాడుకోవడం అందరికీ తెలిసిందే.
ఐక్యరాజ్యసమితి ప్రకటన
ప్రజల మనస్సుల్లో, ఆలోచనల్లో సంగీతాన్ని నిత్యనూతనంగా ఉంచాలన్న ఉద్దేశ్యంతో ఐక్యరాజ్యసమితి జూన్ 21ని ప్రపంచ సంగీత దినోత్సవంగా నిర్వహించాలని ప్రతిపాదించింది. దీని ప్రకారం ప్రతి ఏడాది ప్రపంచమంతటా జూన్ 21ని వరల్డ్ మ్యూజిక్ డేగా పాటించాలని ప్రకటించింది.
ఇది క్రమంగా అన్ని దేశాలకు, నగరాలకు వ్యాపించి వరల్డ్‌మ్యూజిక్ డేకు ప్రాచుర్యం లభించింది. ప్రపంచ సంగీత దినోత్సవాన్ని ‘ఫెటె డె లా మ్యూసిక్’ అని ‘మేక్ మ్యూజిక్ డే’ అని కూడా పిలుస్తారు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 120 దేశాల్లో, 1000 నగరాల్లో వరల్డ్ మ్యూజిక్ డే సంబరాలను జరుపుకుంటున్నారు. ఈ వేడుకల్లో సంగీతం పట్ల అభిమానం, ఆసక్తి ఉన్నవారెవరైనా పాల్గొనవచ్చు.
ఎవరైనా, ఎక్కడైనా సంగీత ప్రదర్శనలు ఇవ్వవచ్చు. పార్కులు, వీధులు, గార్డెన్లు, ఇతర పబ్లిక్ ప్లేసులలో గానంతో లేదా వాద్యపరికరాలతో తమ సంగీత నైపుణాన్ని ప్రదర్శించవచ్చు. ఈరోజు జరిగే ప్రదర్శనలన్నీ అందరికీ పూర్తిగా ఉచితమే.
నిబంధనలేమీ లేని రోజే సంగీత దినోత్సవం
ప్రపంచంలో ఎక్కడైనా ఏదైనా కార్యక్రమంలో పాల్గొనాలంటే, ఏదైనా పని చేయాలంటే వాటికి సంబంధించి కొన్ని పరిమితులు ఉంటాయి. ఇలాగే పాల్గొనాలి, ఇంత వయసు వారే పాల్గొనాలి, ఇంత అనుభవం కావాలి....ఇలాంటివి.
కానీ వరల్డ్ మ్యూజిక్ డే విషయంలో అలాంటి నిబంధనలేమీ లేవు. సంగీతం పట్ల అనురక్తి, ఆసక్తి ఉన్నవారైవరైనా ఇందులో భాగస్వాములు కావచ్చు. ఉద్దండులు, సాధారణమైన వారు అన్న తారతమ్యాలేవీ ఉండవు. సంగీత రంగంలో గొప్పవారనదగ్గ వారి నుంచి ఇప్పుడే ఓనమాలు నేర్చుకుంటున్న వారి దాకా, పిల్లల నుంచి వృద్ధుల దాకా ఎవరైనా నిరభ్యంతరంగా పాల్గొన వచ్చు.
మీ మీ ఆసక్తులను బట్టి ఒక సమూహంగా ఏర్పడవచ్చు. అంతా కలిసి ఒక సంగీత కార్యక్రమాన్ని నిర్వహించుకోవచ్చు. ప్రదర్శనలు ఇవ్వవచ్చు లేదా మీరే ఆ ప్రదర్శనలో పొల్గొని సంగీత ప్రపంచంలో కాసేపు ఆనందంగా, హాయిగా విహరించవచ్చు.
కాబట్టి మీకు మీరే మీకు నచ్చిన అంశం మీద సరదాగా ఓ ప్యారడీ పాట రాయండి. దానిని మీరే పాడండి. పదిమందితోనూ పంచుకోండి. సంగీత సముద్రంలో ఓలలాడండి. జీవితంలో ఆనందాన్ని నింపుకోండి.
(జూన్ 21న ప్రపంచ సంగీత దినోత్సవం సందర్భంగా)
Comments
Please login to add a commentAdd a comment