న్యూయార్క్: కేంద్ర ప్రభుత్వం.. ఇండియా అనే పేరును భారత్‌గా మారబోతోందన్న ఊహాగానాలపై విస్త్రృత స్థాయిలో చర్చ నడుస్తున్న వేళ ఐక్యరాజ్య సమితి స్పందించింది. అలాంటి విజ్ఞప్తి ఏదైనా తమ దాకా వస్తే.. తప్పకుండా పరిశీలిస్తామని తెలిపింది.
దేశాలు తమ తమ పేర్లను మార్చుకునే క్రమంలో.. ప్రపంచ దేశాల సమాఖ్య ఐక్యరాజ్య సమితికి విజ్ఞప్తులు పంపుతుంటాయి కూడా. ఐరాస గనుక ఆ విజ్ఞప్తిని అధికారికంగా అంగీకరిస్తే.. అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఆ దేశాన్ని కొత్త పేరుతోనే పిలుస్తుంటారు. ఇదే విషయాన్ని ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ ఉపప్రతినిధి ఫర్హాన్ హక్ ప్రస్తావించారు.
‘‘ చివరిసారిగా.. టర్కీ దేశం కూడా తుర్కీయేగా తమ పేరును మార్చాలని ఐరాసకు విజ్ఞప్తి పెట్టుకుంది. అలా ఇండియా కూడా అలాంటి విజ్ఞప్తి ఏదైనా చేస్తే.. తప్పక పరిశీలిస్తాం. ఇండియా మాత్రమే కాదు ఏ దేశం అలా రిక్వెస్ట్ పంపినా పరిశీలిస్తాం’’ అని తెలిపారు. కిందటి ఏడాది టర్కీ తుర్కీయేగా తమ దేశం పేరును మార్చుకున్న సంగతి తెలిసిందే.
మరోవైపు దేశంలో పేరు మార్పు అంశం రాజకీయదుమారానికి తెర తీసింది. ఈనెల 9-10 తేదీల్లో ఢిల్లీలో జరగబోయే జీ20 సదస్సు సందర్భంగా ఏర్పాటు చేసిన విందు ఆహ్వాన పత్రికల్లో ‘ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’కు బదులుగా ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ President of Bharat అని ఉండటంతో ఈ అంశం కాస్తా తెరపైకి వచ్చింది.
కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో కేంద్రంపై విరుచుకుపడుతోంది. బీజేపీ ఆ విమర్శలకు కౌంటర్ ఇస్తోంది. అయితే.. విపక్ష ఇండియా కూటమిలోని కొన్ని పార్టీల నేతలు భారత్ అనే పేరు మార్పుపై సానుకూల వ్యాఖ్యలు చేస్తుండడం గమనార్హం. మరోవైపు ప్రధాని మోదీ ఈ విషయంలో కేంద్ర మంత్రులకు దిశానిర్దేశం చేశారు. పేరు మార్పు విషయంలో వివాదాలకు దూరంగా ఉండాలని మంత్రులను కోరారాయన.
Comments
Please login to add a commentAdd a comment