
సాక్షి, హైదరాబాద్ : దేశ చరిత్రలో కొత్త అధ్యాయం మొదలైంది. డిజిటల్ ఇండియాకు పూల దారి ప్రారంభమయింది. ప్రపంచమే భారత్‌వైపు చూసే సమయం ఆసన్నమయింది. రిలయన్స్ ఇండస్ట్ర్రీస్ మరో సంచలనానికి తెరతీసింది.ఇప్పటికే జియోతో జిల్‌జిల్ జిగేల్ అంటున్న రిలయన్స్ ఇండస్ట్రీస్, ప్రపంచ నంబర్ వన్ సాఫ్ట్‌వేర్ సంస్థ మైక్రోసాఫ్ట్‌తో జత కట్టింది. భారత డిజిటల్ రూపు రేఖలు మరింత మెరుగుపర్చేందుకు దీర్ఘకాలిక బంధాన్ని ఏర్పర్చుకుంది. దీనిలో భాగంగా దేశ వ్యాప్తంగా ప్రపంచస్థాయి క్లౌడ్ డేటా సెంటర్లను ఏర్పాటు చేయనుండగా, దానికి అవసరమయ్యే ‘అజుర్’ కంప్యూటర్ అప్లికేషన్‌ను మైక్రోసాఫ్ట్ అందించనుంది. ఈ విషయాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ సీఎండీ ముఖేశ్ అంబానీ కంపెనీ ఏజీఎం సమావేశంలో వెల్లడించారు. అంతేకాకుండా, భారతీయ టెక్నాలజీ స్టార్టప్‌లకు జియో కనెక్టివిటీతో పాటు జియో-అజుర్ క్లౌడ్ సర్వీస్‌ను ఉచితంగానే అందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. చిన్న స్థాయి వ్యాపార సంస్థలకు అవసరమయ్యే కనెక్టివిటీ సమూహాన్ని, ఆటోమేషన్ టూల్స్‌ను నెలకు కేవలం రూ.1500లకే అందించనున్నట్లు ముఖేశ్ అంబానీ ప్రకటించారు.