ఇజ్రాయేల్ రాఫెల్ తో రిలయన్స్ డిఫెన్స్ జట్టు
♦ మధ్య ప్రదేశ్‌లో జాయింట్ వెంచర్ కంపెనీ ఏర్పాటు
♦ పదేళ్లలో రూ.65 వేల కోట్ల రక్షణ ప్రాజెక్టులు లక్ష్యం
♦ 3,000 ఉద్యోగాలు వస్తాయ్ : రిలయన్స్ ఇన్‌ఫ్రా వెల్లడి
న్యూఢిల్లీ: అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ డిఫెన్స్ కంపెనీ, ఇజ్రాయేల్‌కు చెం దిన రాఫెల్ అడ్వాన్స్‌డ్ డిఫెన్స్ సిస్టమ్‌తో కలసి ఒక జాయింట్ వెంచర్(జేవీ)ని ఏర్పాటు చేయనున్నది. రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు చెందిన వంద శాతం అనుబంధ సంస్థ రిలయన్స్ డిఫెన్స్‌కు ఈ జేవీలో 51 శాతం, రాఫెల్‌కు 49 శాతం వాటాలుంటాయి. ఈ మేరకు రెండు కంపెనీల మధ్య ఒప్పందం కుదిరిందని రిలయన్స్ ఇన్‌ఫ్రా తెలిపింది. గగనతలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే మిస్సైళ్లతో పాటు వివిధ రక్షణ ప్రాజెక్టుల కోసం ఈ జేవీని ఏర్పాటు చేస్తున్నామని పేర్కొంది. పదేళ్లలో రూ.65వేల కోట్ల ప్రాజెక్టులు సాధించడం లక్ష్యమని వివరించింది. ఒక భారత కంపెనీ, ఒక ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ మాన్యుఫాక్చరర్(ఓఈఎం)తో ఏర్పాటు చేస్తున్న పెద్ద జాయింట్ వెంచర్లలో ఇది ఒకటని పేర్కొంది.
ఈ జేవీ కారణంగా దేశీయ తయారీకి మంచి ఊపువస్తుందని రిలయన్స్ ఇన్‌ఫ్రా పేర్కొంది. అంతేకాకుండా అత్యంత ఆధునిక ఆయుధ వ్యవస్థల తయారీకి జోష్‌నిస్తుందని వివరించింది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ సమీపంలోని పీతంపూర్‌లో ఈ జేవీ కంపెనీని ఏర్పాటు చేస్తామని, 3,000కు పైగా అత్యధిక నైపుణ్యమున్న ఉద్యోగాలు వస్తాయని పేర్కొంది. రూ.1,300 కోట్ల మూలధన నిధులతో ఈ జేవీని ఏర్పాటు చేస్తామని తెలిపింది. గగనతలం నుంచి గగన తలంలోకి ప్రయోగించే క్షిపణుల తయారీలో రాఫెల్ కంపెనీయే అగ్రస్థానంలో ఉంది. పైధాన్, డెర్బీ వంటివి ప్రాచుర్యం పొందిన ఈ కంపెనీ ఉత్పత్తులు.