సాక్షి, ముంబై : రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన సేవా సంస్థ రిలయన్స్ ఫౌండేషన్ రికార్డు స్థాయిలో ప్లాస్టిక్ వేస్ట్‌ను సేకరించింది. రీసైకిల్ ఫర్ లైఫ్ ప్రచారంలో భాగంగా రీసైక్లింగ్ కోసం 78 టన్నుల వ్యర్థ ప్లాస్టిక్ బాటిళ్లను సేకరించామని శుక్రవారం ప్రకటించింది. మూడు లక్షల మంది ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు,ఇతర భాగస్వాముల ద్వారా ఈ రికార్డు కలెక్షన్ సాధ్యమైందని ఒక ప్రకటనలో రిలయన్స్ వెల్లడించింది.
అక్టోబర్‌లో ప్రారంభించిన రీసైకిల్ ఫర్ లైఫ్ డ్రైవ్‌లో సంస్థ ఉద్యోగులు వారి పరిసరాల నుండి వ్యర్థ ప్లాస్టిక్ బాటిళ్లను సేకరించి కార్యాలయాలకు తీసుకురావాలని విస్తృత ప్రచారం నిర్వహించింది. దీంతో దేశవ్యాప్తంగా రిలయన్స్, దాని అనుబంధ వ్యాపారాల నుంచి భారీ స్పందన లభించింది. పరిశుభ్రమైన, పచ్చని పుడమి కోసం ఈ పథకాన్ని తీసుకొచ్చామని రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, చైర్‌పర్సన్ నీతా అంబానీ తెలిపారు. భవిష్యత్ తరాల కోసం మెరుగైన, ప్రకాశవంతమైన, శుభ్రమైన, పచ్చటి ప్రపంచాన్ని సృష్టించడమే లక్ష్యమన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చిన ‘స్వచ్ఛతా హీ సేవా’ కార్యక్రమానికి రిలయన్స్ ఫౌండేషన్ కట్టుబడి వుందని, పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యతను ప్రాముఖ్యతను నమ్ముతున్నామన్నారు. క్రమం తప్పకుండా శుభ్రపరిచే కార్యకలాపాలకు మద్దతు ఇస్తుందని నీతా వెల్లడించారు. ‘రీసైకిల్ 4 లైఫ్’ ప్రచారంలో భాగంగా సేకరించిన వ్యర్థ ప్లాస్టిక్ సీసాలు రీసైకిల్ చేస్తామన్నారు. అలాగే వాడిన పెట్ బాటిల్స్‌తో పర్యావరణ అనుకూల, ఉత్పత్తులను, దుస్తులను తయారు చేస్తున్న విషయాన్నిఈ సందర్భంగా ఆమె గుర్తుచేశారు.
Comments
Please login to add a commentAdd a comment