
న్యూఢిల్లీ: ఎడ్యుకేషనల్ టెక్నాలజీ సేవల సంస్థ ఇండియావిడ్యువల్ లెర్నింగ్ (ఎంబైబ్)లో రిలయన్స్ ఇండస్ట్రీస్ 73 శాతం వాటాలు కొనుగోలు చేస్తోంది. వచ్చే మూడేళ్లలో సుమారు 180 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 1,175 కోట్లు) ఇన్వెస్ట్ చేయనుంది. ఈ మేరకు గురువారం ఒక ఒప్పందం కుదుర్చుకున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ వెల్లడించింది. దీని ప్రకారం ఇండియావిడ్యువల్ లెర్నింగ్‌లో 34.33 లక్షల షేర్లను కొనుగోలు చేస్తామని, ఇది ఎంబైబ్‌లో సుమారు 73 శాతం వాటాకు సరిసమానమని స్టాక్ ఎక్సే్చంజీలకు తెలియజేసింది. రెండు నెలల్లో ఈ ఒప్పందం పూర్తి కాగలదని అంచనా. టెక్నాలజీ సహాయంతో దేశీయంగా విద్యార్థులకు మరింత మెరుగైన విద్యను అందుబాటులోకి తెచ్చేందుకు ఈ డీల్ తోడ్పడగలదని ఆశిస్తున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ టెలికం విభాగం రిలయన్స్ జియో డైరెక్టర్ ఆకాశ్ అంబానీ తెలియజేశారు. భారత్‌లో 19 లక్షల పాఠశాలలు, 58,000 విశ్వవిద్యాలయాల్లో టెక్నాలజీని విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన చెప్పారు. 2012 ఆగస్టులో ప్రారంభమైన ఎంబైబ్ ప్రస్తుతం 60 విద్యా సంస్థలకు సేవలందిస్తోంది. రిలయన్స్ నుంచి వచ్చే పెట్టుబడులను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలకు ఉపయోగించుకోనుంది.
రూ.3,250 కోట్ల సమీకరణ: జియో
జపాన్ బ్యాంకుల నుంచి దాదాపు 500 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 3,250 కోట్లు) సమీకరించేందుకు రిలయన్స్ జియో కసరత్తు చేస్తోంది. ఇందుకు సంబంధించి ఎంయూఎఫ్‌జీ (గతంలో ది బ్యాంక్ ఆఫ్ టోక్యో–మిత్సుబిషి యూఎఫ్‌జే), మిజుహో బ్యాంక్, సుమిటోమో మిత్సుయి బ్యాంకింగ్ కార్పొరేషన్‌లతో జియో చర్చలు జరుపుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.