జియోదే టాప్ స్పీడ్: ట్రాయ్
న్యూఢిల్లీ: మనం టీవీల్లో చూసే ఉంటాం.. ఎయిర్‌టెల్ 4జీ స్పీడ్ చాలెంజ్ యాడ్‌ని. డౌన్‌లోడ్ స్పీడ్‌లో ఎయిర్‌టెల్ నెట్‌వర్క్‌ను కొట్టే టెలికం కంపెనీ మరొకటి లేదని ఈ యాడ్ సారాంశం. కానీ నిన్నటికి నిన్న ఎయిర్‌టెల్‌కి ఆస్కీ షాకిచ్చింది. డౌన్‌లోడ్ స్పీడ్ తమ నెట్‌వర్క్‌లోనే ఎక్కువని ఎయిర్‌టెల్ ఎక్కడ చెప్పుకోకూడదంటూ నోటీసు పంపింది. ఈ నేపథ్యంలో డౌన్‌లోడ్ స్పీడ్ జియో నెట్‌వర్క్‌లోనే ఎక్కువని తాజాగా టెలికం రెగ్యులేటర్ ట్రాయ్ ప్రకటించింది. దీని ప్రకారం చూస్తే.. ఫిబ్రవరి నెలలో డౌన్‌లోడ్ స్పీడ్ జియోలో 16.48 ఎంబీపీఎస్‌గా నమోదయ్యింది. ఈ స్పీడ్ జనవరిలో 17.42 ఎంబీపీఎస్‌గా ఉంది. జనవరి నుంచి ఫిబ్రవరికి వచ్చేసరికి స్పీడ్ తగ్గినా కూడా జియోనే టాప్‌లో కొనసాగుతోంది.
ఐడియా, ఎయిర్‌టెల్ కన్నా రెట్టింపు స్పీడ్
రిలయన్స్ జియో నెట్‌వర్క్‌లో డౌన్‌లోడ్ స్పీడ్ (16.48 ఎంబీపీఎస్) తన ప్రత్యర్థులైన ఐడియా, ఎయిర్‌టెల్ నెట్‌వర్క్‌లలోని డౌన్‌లోడ్ స్పీడ్‌కు రెట్టింపుగా ఉంది. డౌన్‌లోడ్ స్పీడ్ ఐడియాలో 8.33 ఎంబీపీఎస్‌గా, ఎయిర్‌టెల్‌లో 7.66 ఎంబీపీఎస్‌గా నమోదైంది. వొడాఫోన్ డౌన్‌లోడ్ స్పీడ్ 5.66 ఎంబీపీఎస్‌గా, బీఎస్‌ఎన్‌ఎల్ స్పీడ్ 2.01 ఎంబీపీఎస్‌గా రికార్డు అయ్యింది. ఇక ఆర్‌కామ్, టాటా డొకొమో, ఎయిర్‌సెల్ డౌన్‌లోడ్ స్పీడ్‌లు వరుసగా 2.67 ఎంబీపీఎస్‌గా, 2.52 ఎంబీపీఎస్‌గా, 2.01 ఎంబీపీఎస్‌గా ఉన్నాయి. ఈ లెక్కలన్నీ ట్రాయ్ వెల్లడించినవి.