జియో షాక్‌..కాల్‌ చేస్తే.. బాదుడే! | Reliance Jio to charge for voice calls made to other telecom operators | Sakshi
Sakshi News home page

జియో షాక్‌..కాల్‌ చేస్తే.. బాదుడే!

Published Thu, Oct 10 2019 4:13 AM | Last Updated on Thu, Oct 10 2019 4:47 AM

Reliance Jio to charge for voice calls made to other telecom operators - Sakshi

న్యూఢిల్లీ: ఇప్పటిదాకా ఏ నెట్‌వర్క్‌కైనా ఉచిత కాల్స్‌ సదుపాయం అందిస్తున్న టెలికం సంస్థ రిలయన్స్‌ జియో (జియో) తాజాగా చార్జీల వడ్డనకు తెరతీసింది. ఇక నుంచి ఇతర నెట్‌వర్క్‌లకు చేసే వాయిస్‌ కాల్స్‌పై నిమిషానికి 6 పైసల చొప్పున చార్జీలు విధించనున్నట్లు బుధవారం ప్రకటించి కస్టమర్లకు షాకిచ్చింది. కాల్‌ టెర్మినేషన్‌ చార్జీలకు సంబంధించి అనిశ్చితే చార్జీల విధింపునకు కారణమని ఒక ప్రకటనలో వివరించింది. బుధవారం నుంచి ఇది అమల్లోకి వచ్చింది. దీనివల్ల ఇతర నెట్‌వర్క్‌లకు వాయిస్‌ కాల్స్‌ చేయదల్చుకునే వారు ఐయూసీ టాప్‌–అప్‌ వోచర్స్‌ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. టాప్‌ అప్‌ వోచర్స్‌ విలువకు సరిసమానమైన డేటాను ఉచితంగా ఇవ్వనున్నట్లు, దీంతో నికరంగా యూజరుపై చార్జీల భారం ఉండబోదని జియో తెలిపింది. కాల్‌ టెర్మినేషన్‌ చార్జీలు అమల్లో ఉన్నంత వరకూ 6 పైసల చార్జీల విధింపు కొనసాగనున్నట్లు పేర్కొంది.  

వాట్సాప్, ఫేస్‌టైమ్‌కు మినహాయింపు..
జియో యూజర్లు ఇతర జియో ఫోన్లకు, ల్యాండ్‌లైన్లకు చేసే కాల్స్‌కు, వాట్సాప్, ఫేస్‌టైమ్‌ తదితర యాప్స్‌ ద్వారా చేసే కాల్స్‌కు దీన్నుంచి మినహాయింపు ఉంటుంది. ఇతర నెట్‌వర్క్‌ల నుంచి వచ్చే ఇన్‌కమింగ్‌ కాల్స్‌ ఉచితంగానే కొనసాగుతాయని జియో పేర్కొంది. ప్రస్తుతం జియో యూజర్లు కేవలం డేటాకు మాత్రమే చార్జీలు చెల్లిస్తున్నారు. దీనితో దేశవ్యాప్తంగా ఏ నెట్‌వర్క్‌కైనా ఉచితంగా వాయిస్‌ కాల్స్‌ చేసుకునే సదుపాయాన్ని పొందుతున్నారు. తాజా పరిణామంతో జియో యూజర్లు ఇతర నెట్‌వర్క్‌లకు వాయిస్‌ కాల్స్‌ చేయాలంటే రెగ్యులర్‌ రీచార్జితో పాటు తప్పనిసరిగా టాప్‌–అప్‌ వోచర్స్‌ కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.  

నిబంధనల్లో అనిశ్చితి వల్లే..
సాధారణంగా ఇతర నెట్‌వర్క్‌ల నుంచి వచ్చే కాల్స్‌ను తమ కస్టమర్లకు అందించినందుకు గాను టెలికం సంస్థలు తమ పోటీ సంస్థల నుంచి నిర్దిష్ట చార్జీలు (ఐయూసీ) వసూలు చేస్తుంటాయి. గతంలో నిమిషానికి 14 పైసలుగా ఉన్న ఈ చార్జీలను జియో వచ్చిన తర్వాత టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌ 2017లో 6 పైసలకు తగ్గించేసింది. ఇతర కంపెనీలు గగ్గోలు పెట్టినప్పటికీ 2020 జనవరి కల్లా ఐయూసీని పూర్తిగా ఎత్తివేయనున్నట్లు అప్పట్లో పేర్కొంది. అయితే, తాజాగా ఇందుకు సంబంధించిన గడువును పొడిగించాల్సిన అవసరంపై ట్రాయ్‌ చర్చాపత్రాన్ని విడుదల చేసింది. ఇదే ఐయూసీపై అనిశ్చితికి తెరతీసిందని జియో ఆరోపించింది. తమ నెట్‌వర్క్‌పై వాయిస్‌ కాల్స్‌ను ఉచితంగానే అందిస్తున్నప్పటికీ .. ఐయూసీ చార్జీల కింద పోటీ సంస్థలు భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్‌ ఐడియాలకు గడిచిన మూడేళ్లలో ఏకంగా రూ. 13,500 కోట్ల మేర చెల్లింపులు జరపాల్సి వచ్చిందని తెలిపింది.  

మిస్డ్‌ కాల్స్‌ బాగోతం..
పోటీ సంస్థలు 4జీ కస్టమర్లకు వాయిస్‌ టారిఫ్‌లను తగ్గించినప్పటికీ, 35–40 కోట్ల మంది 2జీ కస్టమర్లపై నిమిషానికి రూ. 1.50 చొప్పున చార్జీలు విధిస్తున్నాయని జియో ఆరోపించింది. 1 జీబీ డేటాకు కనీసం రూ. 500 వసూలు చేస్తున్నాయని పేర్కొంది. దీని కారణంగా ఎయిర్‌టెల్, వొడాఫోన్‌–ఐడియా యూజర్లు .. జియో కస్టమర్లకు మిస్డ్‌ కాల్స్‌ ఇవ్వడం మొదలుపెట్టారని జియో పేర్కొంది. తద్వారా జియో యూజర్లు సదరు మిస్డ్‌ కాల్స్‌ చేసిన వారికి తమ నెట్‌వర్క్‌ నుంచి తిరిగి కాల్స్‌ చేస్తున్నారని, తమపై ఐయూసీ భారం గణనీయంగా పడుతోందని పరోక్షంగా తెలిపింది. తమ నెట్‌వర్క్‌కు నిత్యం 25–30 కోట్ల మిస్డ్‌ కాల్స్‌ వస్తుంటాయని, 65–70 కోట్ల నిమిషాల అవుట్‌గోయింగ్‌ కాల్స్‌ నమోదవుతుంటాయని పేర్కొంది.

ఈ నేపథ్యంలో ట్రాయ్‌ తాజా చర్యల కారణంగా వాటిల్లిన నష్టాలను భర్తీ చేసుకునేందుకే నిమిషానికి 6 పైసల చార్జీని ప్రవేశపెట్టాల్సి వచ్చిందని వివరించింది. ‘ట్రాయ్‌ చర్చాపత్రంతో నియంత్రణ సంస్థ నిబంధనల విషయంలో అనిశ్చితి నెలకొంది. దీంతో తప్పనిసరై ఆఫ్‌–నెట్‌ మొబైల్‌ వాయిస్‌ కాల్స్‌పై నష్టాలను భర్తీ చేసుకునేందుకు నిమిషానికి 6 పైసల చార్జీలను విధించాల్సి వస్తోంది. ఐయూసీ చార్జీలు అమల్లో ఉన్నంత కాలం ఇది కొనసాగించాల్సి రానుంది. ఐయూసీ టాప్‌ అప్‌ వోచర్‌కు సరిసమానంగా అదనపు డేటా అందించడం జరుగుతుంది. తద్వారా నికరంగా కస్టమర్లపై టారిఫ్‌ పెంపు భారమేమీ ఉండబోదు‘ అని జియో తెలిపింది. మరోవైపు, ఐయూసీ పొడిగింపుపై కేవలం చర్చాపత్రాన్ని ప్రవేశపెట్టినంత మాత్రాన ట్రాయ్‌పై జియో విమర్శలకు దిగడం సరికాదని సీనియర్‌ ట్రాయ్‌ అధికారి వ్యాఖ్యానించారు.

కొత్త ఐయూసీ ప్లాన్లు ఇవే..
ఇతర నెట్‌వర్క్‌లకు వాయిస్‌ కాల్స్‌ కోసం జియో కొత్తగా నాలుగు ఐయూసీ ప్లాన్స్‌ను(టాప్‌ అప్స్‌) ప్రవేశపెట్టింది. ప్లాన్స్‌కి సరిపడా డేటా ఉచితంగా ఇస్తున్నందున ఈ ఏడాది డిసెంబర్‌ 31 దాకా యూజర్లపై నికరంగా అదనపు భారం ఉండబోదని జియో తెలిపింది. ఇక పోస్ట్‌ పెయిడ్‌ కస్టమర్లకు కూడా అఫ్‌–నెట్‌వర్క్‌ కాల్స్‌పై నిమిషానికి  6 పైసల జార్జీలు వర్తిస్తాయి. తదనుగుణంగా ఉచిత డేటా లభిస్తుంది. కొత్త ఐయూసీ ప్లాన్లు..

► రూ. 10 ప్లాన్‌: 124 నిమిషాలు. 1 జీబీ డేటా.
► రూ. 20 ప్లాన్‌: 249 నిమిషాలు. 2 జీబీ డేటా.
► రూ. 50 ప్లాన్‌: 656 నిమిషాలు. 5 జీబీ డేటా.
► రూ. 100 ప్లాన్‌: 1,362 నిమిషాలు. 10 జీబీ డేటా.


ఐయూసీని మరింత తగ్గించే ఎత్తుగడలు: ఎయిర్‌టెల్‌
ఇతర నెట్‌వర్క్‌లకు వాయిస్‌ కాల్స్‌పై చార్జీలు వసూలు చేయాలన్న జియో నిర్ణయంపై పోటీ సంస్థ భారతి ఎయిర్‌టెల్‌ స్పందించింది. ఐయూసీని బలవంతంగా మరింత తగ్గించేందుకు ఈ ఎత్తుగడలు వేస్తోందంటూ ఆరోపించింది. జియో పేరు ప్రత్యేకంగా ప్రస్తావించకుండా ఎయిర్‌టెల్‌ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ట్రాయ్‌ వల్లే చార్జీలు విధించాల్సి వస్తోందనే భావన కలిగించేలా తమ పోటీ సంస్థ వ్యవహరిస్తోందని వ్యాఖ్యానించింది. నిజానికి ఐయూసీ పొడిగింపు అంశం కొత్తదేమీ కాదని, గతంలో చార్జీలను తగ్గించినప్పుడే ఈ అంశాన్ని ట్రాయ్‌ ప్రస్తావించిందని ఎయిర్‌టెల్‌ స్పష్టం చేసింది. దేశీయంగా 2జీ యూజర్లు భారీగా ఉన్నారని, నిర్వహణ ఖర్చులతో పోలిస్తే ప్రస్తుతం 6 పైసలుగా ఉన్న టెర్మినేషన్‌ చార్జీలు చాలా తక్కువని పేర్కొంది. మరోవైపు, ఐయూసీపై జియోది అనవసరమైన తొందరపాటు చర్యగా వొడాఫోన్‌ ఐడియా అభివర్ణించింది. టెలికం రంగంలో సంక్షోభాన్ని పరిష్కరించే సత్వర చర్యల నుంచి దృష్టి మరల్చే ప్రయత్నంగా వ్యాఖ్యానించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement