జియో మరో కొత్త సంచలన టారిఫ్ ప్లాన్స్
జియో మరో కొత్త సంచలన టారిఫ్ ప్లాన్స్
Published Fri, Mar 31 2017 3:49 PM | Last Updated on Tue, Sep 5 2017 7:35 AM
న్యూఢిల్లీ : సంచలన ఆఫర్లతో టెలికాం మార్కెట్ను ఓ ఊపు ఊపేసిన రిలయన్స్ జియో ముందస్తుగా తాను ప్రకటించిన టారిఫ్ ప్లాన్స్ ను రేపటి నుంచి ప్రారంభించబోతుంది. ఆరు నెలల పాటు ఉచితంగా అందించిన సేవలకు స్వస్తి చెప్పి, వీటిని అమలు చేయబోతుంది. ఈ క్రమంలో అసలు ఎంతమంది జియో సిమ్ ను వాడతారు? ఎంతమంది జియో నుంచి బయటికి వచ్చేస్తారు? అనేది ప్రస్తుతం మార్కెట్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఏప్రిల్ 1 నుంచి అమలు చేయబోతున్న టారిఫ్ ప్లాన్స్ అనంతరం కన్జ్యూమర్ బిహేవియర్ బట్టి రెండు, మూడు రోజుల్లోనే మరో కొత్త సంచలన టారిఫ్ ప్లాన్స్ ను రిలయన్స్ జియో ప్రకటించనుందని బిజినెస్ ఇన్సైడర్ రిపోర్టు చేసింది.
బిజినెస్ ఇన్ సైడర్ రిపోర్టు ప్రకారం ఏప్రిల్ 1 నుంచి మూడు కీ అంశాలతో కన్జ్యూమర్ బిహేవియర్ పై కంపెనీ అధ్యయనం చేయనుంది. వాటిలో ఒకటి జియో ప్రైమ్ యూజర్లు మినహా ఎంతమంది టారిఫ్ ప్లాన్లను ఉపయోగించుకుంటున్నారు. రెండోది ఎంతమంది ప్రజలు తమ కనెక్షన్ తీసుకుంటున్నారు? ఎంతమంది జియో సిమ్ ను వాడటం ఆపివేస్తున్నారు? వంటి మూడు అంశాలను పరిగణనలోకి తీసుకొని, సంచలనమైన కొత్త టారిఫ్ ప్లాన్లను కంపెనీ ప్రవేశపెట్టనుందని తెలుస్తోంది.
ఈ కొత్త ప్లాన్స్ కూడా వచ్చే రెండు, మూడు రోజుల్లోనే ప్రారంభిస్తుందని రిపోర్టు పేర్కొంది. హ్యాపీ న్యూఇయర్ ఆఫర్ నేటితో ముగుస్తున్నందున ఇదే సేవలను మరో ఏడాదంతా వినియోగించుకోవడానికి ప్రైమ్ సబ్స్క్రిప్షన్ ఆఫర్ ను కూడా జియో తీసుకొచ్చింది. జియో ప్రైమ్ సబ్స్క్రిప్షన్ కు నేడే ఆఖరి తేది. తాజా లెక్కల ప్రకారం జియోకు ఉన్న 10 కోట్ల మంది సబ్స్క్రైబర్లలో 5 కోట్ల మంది ఇప్పటికే ఈ ప్రైమ్ ఆఫర్ కోసం రూ.99 చెల్లించారు.
Advertisement