సాక్షి,కోల్‌కతా: రిలయన్స్ జియో రాకతో కారు చౌకగా మారిన మొబైల్ టారిఫ్‌లు మళ్లీ అదే జియో దెబ్బకు భారీగా పెరగనున్నాయి. ఈ నెల 19 నుంచి 4జీ టారిఫ్ ప్లాన్‌లను 15 నుంచి 20 శాతం మేర జియో పెంచడంతో ఇదే అదనుగా ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా సెల్యులార్‌లూ ఇదే బాట పట్టనున్నాయి. గత కొద్ది నెలలుగా జియో టారిఫ్‌లకు అనుగుణంగా తమ మొబైల్ చార్జీలను తగ్గించిన మొబైల్ ఆపరేటర్లు ఇప్పుడు కస్టమర్లపై పెనుభారం మోపేలా టారిఫ్‌లను సవరిస్తారని భావిస్తున్నారు. టెలికాం రంగం టారిఫ్ సంక్షోభం నుంచి బయటపడేందుకు ధరల పెంపు సానుకూల అంశమని, ప్రస్తుతం ఆపరేటర్లందరూ టారిఫ్‌ల పెంపుపై దృష్టిసారిస్తాయని స్విస్ బ్రోకరేజ్ సంస్థ యూబీఎస్ అంచనా వేసింది.
మొబైల్ టారిఫ్‌లను తిరగరాస్తూ రిలయన్స్ జియో ఆరంభంలో కస్టమర్లకు ఉచిత డేటా, వాయిస్ కాల్స్‌ను ఆఫర్ చేయడంతో పోటీని తట్టుకునేందుకు ఇతర మొబైల్ ఆపరేటర్లూ టారిఫ్‌లను గణనీయంగా తగ్గించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు జియో క్రమంగా మొబైల్ టారిఫ్‌లను పెంచుతుండటంతో ఎయిర్‌టెల్, వొడాఫోన్ వంటి ఇతర ఆపరేటర్లూ తిరిగి కాల్ చార్జీలను పెంచేపనిలో పడ్డారు. ఇవి మొబైల్ కంపెనీలకు ఊరట కలిగించే పరిణామాలే అయినా సగటు కస్టమర్‌కు మాత్రం మొబైల్ టారిఫ్‌లు గుదిబండ కానున్నాయి.
మరోవైపు జియో తన రూ 149 4 జీబీ ప్యాక్‌కు అందించే డేటాను రెట్టింపు చేయడం వ్యూహాత్మక నిర్ణయమని స్విస్ బ్రోకరేజ్ సంస్థ యూబీఎస్ పేర్కొంది. లోయర్ ఎండ్ కస్టమర్లను కాపాడుకుంటూనే హైఎండ్‌పై టారిఫ్‌ల పెంపుతో లాభాలు దండుకోవాలని జియో భావిస్తోంది. జియో మరికొన్ని ప్లాన్‌లపైనా నొప్పి తెలియకుండా కస్టమర్లకు వాతలు పెట్టింది. రూ 399 ప్లాన్‌లో వాలిడిటీని 84 రోజుల నుంచి 70 రోజులకు తగ్గించింది. 84 రోజుల బెనిఫిట్స్‌ను పొందాలంటే రూ 459 ప్లాన్‌ను ఎంచుకోవాలని నూతన ప్లాన్‌ను ముందుకు తెచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment