వైరస్‌ పడగ.. మార్కెట్‌ ర్యాలీ! | Relief Rally In Markets on Sensex Up 1861 Points | Sakshi
Sakshi News home page

వైరస్‌ పడగ.. మార్కెట్‌ ర్యాలీ!

Published Thu, Mar 26 2020 5:32 AM | Last Updated on Thu, Mar 26 2020 7:12 AM

Relief Rally In Markets on Sensex Up 1861 Points - Sakshi

కోవిడ్‌–19(కరోనా) వైరస్‌ కల్లోలాన్ని తట్టుకోవడానికి అమెరికా భారీ ప్యాకేజీని ప్రకటించడంతో ప్రపంచ మార్కెట్లతో పాటే మన మార్కెట్‌ కూడా బుధవారం భారీగా లాభపడింది. మన దగ్గర కూడా కేంద్రం ఉద్దీపన ప్యాకేజీని ఇవ్వనున్నదని, ఆర్‌బీఐ 60 బేసిస్‌ పాయింట్ల మేర రేట్లను తగ్గించనున్నదన్న అంచనాలు సానుకూల ప్రభావం చూపించాయి. మార్చి డెరివేటివ్స్‌ కాంట్రాక్టులు మరొక్క రోజులో ముగియనుండటంతో భారీగా షార్ట్‌ కవరింగ్‌ కొనుగోళ్లు చోటు చేసుకోవడం కలసివచ్చింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 28,000 పాయింట్లు, నిఫ్టీ 8,300 పాయింట్లపైకి ఎగబాకాయి. ఇంట్రాడేలో 2,116 పాయింట్ల మేర ఎగసిన సెన్సెక్స్‌ చివరకు 1,862 పాయింట్ల లాభంతో 28,536 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 517 పాయింట్లు పెరిగి 8,318 పాయింట్ల వద్దకు చేరాయి. శాతం పరంగా చూస్తే, సెన్సెక్స్‌ 6.98 శాతం, నిఫ్టీ 6.62 శాతం మేర లాభపడ్డాయి. సెన్సెక్స్, నిఫ్టీలు ఒక్క రోజులో ఇన్నేసి పాయింట్లు లాభపడటం  ఇది గత 11 ఏళ్లలో ఇదే మొదటిసారి. అన్ని రంగాల సూచీలు లాభాల్లోనే ముగిశాయి. కాగా గుడిపడ్వ పర్వదినం కారణంగా ఫారెక్స్‌ మార్కెట్‌ బుధవారం పనిచేయలేదు.  

నష్టాల్లోంచి... భారీ లాభాల్లోకి  
ఆసియా మార్కెట్లు లాభాల్లో ఉన్నా మన మార్కెట్‌ నష్టాల్లోనే ఆరంభమైంది. సెన్సెక్స్‌ 174 పాయింట్లు, నిఫ్టీ 66 పాయింట్ల నష్టాలతో మొదలయ్యాయి. ఆ తర్వాత లాభాల్లోకి వచ్చినా, మళ్లీ నష్టాల్లోకి జారిపోయాయి. ఉదయం 11 తర్వాత మళ్లీ లాభాల్లోకి వచ్చిన సూచీలు ట్రేడింగ్‌ చివరి వరకూ లాభాల జోరును కొనసాగించాయి. ఒక దశలో 314 పాయింట్లు పతనమైన సెన్సెక్స్‌ మరో దశలో 2,116 పాయింట్లు ఎగసింది. మొత్తం మీద రోజంతా సెన్సెక్స్‌ 2,430 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది. కాగా భారత్‌లో కోవిడ్‌–19 వైరస్‌ కేసులు 562కు, మరణాలు 10కు పెరిగాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్‌ కేసులు 4.34 లక్షలకు, మరణాలు 19,600కు, రికవరీలు లక్షకు చేరాయి.  

మరిన్ని విశేషాలు.....
► సెన్సెక్స్‌లోని మొత్తం 30 షేర్లలో మూడు  షేర్లు–ఇండస్‌ఇండ్‌ బ్యాంక్, ఓఎన్‌జీసీ, ఐటీసీ మాత్రమే నష్టపోయాయి. మిగిలిన 27 షేర్లు లాభాల్లో ముగిశాయి.  
► 200కు పైగా షేర్లు అప్పర్‌ సర్క్యూట్లను తాకాయి. అవెన్యూ సూపర్‌ మార్ట్స్, హెచ్‌డీఎఫ్‌సీ, ఎన్‌ఐఐటీ టెక్నాలజీస్, చోళమండలం ఇన్వెస్ట్‌మెంట్స్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.  
► స్టాక్‌ మార్కెట్‌ భారీగా లాభపడినప్పటికీ, 800కు పైగా షేర్లు ఇంట్రాడేలో ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. ఏసీసీ, ఏబీబీ ఇండియా, అల్ట్రాటెక్‌ ఇండియా, జిల్లెట్‌ ఇండియా తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.  
► ఐఆర్‌సీటీసీ షేర్‌  వరుసగా ఎనిమిదో రోజూ 5 శాతం లోయర్‌ సర్క్యూట్‌తో రూ.816కు పడిపోయింది. ఇది ఐదు నెలల కనిష్ట స్థాయి. గత ఒక్క నెలలోనే ఈ షేర్‌ 58 శాతం పతనమైంది.
లాభాలు ఎందుకంటే...
అమెరికా భారీ ప్యాకేజీ...
కోవిడ్‌–19 వైరస్‌తో కుదేలవుతున్న ఆర్థిక వ్యవస్థను ఆదుకోవడానికి అమెరికా భారీ ప్యాకేజీని ఇవ్వనున్నది. ఈ 2 లక్షల కోట్ల డాలర్ల ప్యాకేజీలో భాగంగా ఒక్కొక్క అమెరికన్‌ ఖాతాలో 1,200 డాలర్లు జమ చేస్తారని అంచనా. అమెరికా చరిత్రలోనే ఇదే అత్యంత భారీ ప్యాకేజీ. ఈ ప్యాకేజీ నేపథ్యంలో ఆసియా మార్కెట్లు 2–8% రేంజ్‌లో లాభపడగా, యూరప్‌ మార్కెట్లు భారీ లాభాల తో మొదలై, 1–4% రేంజ్‌ లాభాల్లో ముగిశాయి.  

షార్ట్‌ కవరింగ్‌ కొనుగోళ్లు....
మార్చి నెల ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌ కాంట్రాక్టులు నేడు(గురువారం) ముగియనున్నాయి. ఈ  ఎఫ్‌ అండ్‌ ఓ కాంట్రాక్టుల ముగింపు నేపథ్యంలో జోరుగా షార్ట్‌ కవరింగ్‌ కొనుగోళ్లు జరిగాయి.  

లాక్‌డౌన్‌ను మెచ్చిన మార్కెట్‌  
మంగళవారం అర్ధరాత్రి నుంచి 21 రోజుల పాటు దేశమంతా లాక్‌డౌన్‌ విధించిన విషయం తెలిసిందే. ఈ లాక్‌డౌన్‌ కారణంగా భారత జీడీపీలో రూ. 5 లక్షల కోట్ల మేర గండి పడుతుందని అంచనా. ఇంత భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉన్నప్పటికీ కోవిడ్‌–19 వైరస్‌ను ఎదుర్కొనడానికి భారత్‌ గట్టి చర్యలు తీసుకుంటోందన్న భరోసా  స్టాక్‌ మార్కెట్‌కు లభించిందని నిపుణులు పేర్కొంటున్నారు.  

ఉద్దీపన చర్యలపై ఆశలు...
దేశవ్యాప్తంగా 21 రోజుల పాటు లాక్‌డౌన్‌ విధించిన నేపథ్యంలో కుదేలయ్యే ఆర్థిక రంగాన్ని ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం భారీ స్థాయిలోనే (సుమారు 1.5 లక్షల కోట్లు) ఉద్దీపన ప్యాకేజీని ఇవ్వనున్నదన్న అంచనాలు నెలకొన్నాయి.  

► రేట్ల కోత అంచనాలు: ఏప్రిల్‌లో జరిగే పాలసీ సమావేశంలో కీలక రేట్లను ఆర్‌బీఐ 50–100  బేసిస్‌ పాయింట్ల మేర తగ్గించగలదన్న ఆశలతో వడ్డీ రేట్ల ప్రభావిత బ్యాంక్, వాహన షేర్లలో జోరుగా కొనుగోళ్లు జరిగాయి.  

హెవీ వెయిట్స్‌ ర్యాలీ
సెన్సెక్స్, నిఫ్టీ సూచీల్లో వెయిటేజీ అధికంగా గల రిలయన్స్‌ ఇండస్ట్రీస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, కోటక్‌ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లలో జోరుగా కొనుగోళ్లు జరిగాయి. రిలయన్స్‌ ఇండస్ట్రీస్, హెచ్‌డీఎఫ్‌సీ ద్వయం షేర్లు 9–15 శాతం రేంజ్‌లో దూసుకెళ్లాయి.సెన్సెక్స్‌ లాభాల్లో ఈ మూడు షేర్ల వాటాయే దాదాపు సగంగా ఉంది. సెన్సెక్స్‌  మొత్తం 1,862 పాయింట్ల లాభంలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ వాటా 416 పాయింట్లు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ వాటా 363 పాయింట్లుగా, హెచ్‌డీఎఫ్‌సీ వాటా 232 పాయింట్లుగా ఉన్నాయి.

రిలయన్స్‌కు ‘ఫేస్‌బుక్‌’ కిక్‌
రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ టెలికం విభాగం, రిలయన్స్‌ జియోలో 10% వాటాను ఫేస్‌బుక్‌ కొను గోలు చేయనుందన్న వార్తలతో రిలయన్స్‌ షేర్‌ జోరుగా పెరిగింది. ఇంట్రాడేలో 22% లాభంతో రూ. 1,152ను తాకిన ఈ షేర్‌ చివరకు 15 శాతం లాభంతో రూ.1,081 వద్దకు చేరింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్‌ ఇదే. 11 ఏళ్లలో ఈ షేర్‌ ఇంత గా లాభపడటం ఇదే తొలిసారి. ఈ కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ రూ. 87,577 కోట్లు పెరిగి రూ.6,85,433 కోట్లకు చేరింది. దేశంలోనే అత్యధిక మార్కెట్‌ విలువగల కంపెనీ ట్యాగ్‌ ను మళ్లీ టీసీఎస్‌ నుంచి చేజిక్కించుకుంది.

రూ. 4.7 లక్షల కోట్లు ఎగసిన ఇన్వెస్టర్ల సంపద
స్టాక్‌ మార్కెట్‌ భారీ లాభాల కారణంగా ఇన్వెస్టర్ల సంపద రూ.4.7 లక్షల కోట్లు ఎగసింది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్‌ క్యాప్‌ రూ.4.7 లక్షల కోట్లు పెరిగి రూ.108.41 లక్షల కోట్లకు పెరిగింది.

మార్కెట్‌ పతన జోరు ఒకింత తగ్గవచ్చు. అయితే సమీప భవిష్యత్తులో పరిమిత శ్రేణిలోనే సూచీలు తీవ్రమైన ఒడిదుడుకులకు గురయ్యే అవకాశాలున్నాయి. మార్కెట్‌ తరువాతి దశ (పెరగడం లేదా తగ్గడం)లోకి ప్రవేశించే ముందు ఇదే రేంజ్‌లో కొంత కాలం కొనసాగవచ్చు. దీర్ఘకాలానికి ఇన్వెస్ట్‌ చేయాలనుకునేవాళ్లకు, యావరేజ్‌ చేయాలనుకునేవాళ్లకు ఇది మంచి అవకాశమే.  

–సహజ్‌ అగర్వాల్, కోటక్‌ సెక్యూరిటీస్‌

ఫండమెంటల్స్‌ పరంగా ఎలాంటి మార్పులు లేకపోయినా, ఉద్దీపన చర్యల ఆశలతో మార్కెట్‌ లాభపడింది. కోవిడ్‌–19 వైరస్‌ కట్టడికి సంబంధించిన శుభవార్తలు వస్తేనే స్టాక్‌ మార్కెట్లో నిలకడైన ర్యాలీ నెలకొంటుంది.  

–వినోద్‌ నాయర్, జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌

సమీప భవిష్యత్తులో ఒడిదుడుకులు కొనసాగుతాయి. కోవిడ్‌–19 వైరస్‌ వ్యాప్తిని  ప్రభావవంతంగా అరికట్టగలిగే విష యంపైననే స్టాక్‌ మార్కెట్‌ ర్యాలీ ఆధారపడి ఉంటుంది.  

–అజిత్‌ మిశ్రా, రెలిగేర్‌  బ్రోకింగ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement