వ్యాపారాలకు అవరోధాలు తొలగించాలి
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ తలపెట్టిన ‘మేక్ ఇన్ ఇండియా’ లక్ష్యం సాధ్యం కావాలంటే ముందుగా వ్యాపారాలకు ఆటంకాలు తొలగించాల్సిన అవసరం ఉందని అంతర్జాతీయ ఆటోమొబైల్ దిగ్గజాలు అభిప్రాయపడ్డాయి. వ్యాపారాలకు అనువైన విధానాలు తీసుకురావాల్సి ఉంటుందని పేర్కొన్నాయి. వాహనాల తయారీ సంస్థల సమాఖ్య (సియామ్) వార్షిక సదస్సులో పాల్గొన్న పలు దిగ్గజ కంపెనీలు ఈ మేరకు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశాయి.
వ్యాపార అనుమతులు మొదలుకుని పన్నులు, మౌలిక సదుపాయాలు, రవాణా దాకా అనేక అంశాలు దేశీయంగా ఆటో పరిశ్రమ ఎదుగుదలకు అవరోధాలుగా ఉంటున్నాయని పేర్కొన్నాయి. ప్రధాని మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ సమస్యలను పరిష్కరించగలదని ఆశిస్తున్నట్లు జపాన్ ఆటోమొబైల్ తయారీ సంస్థల అసోసియేషన్ (జేఏఎంఏ) చైర్మన్ ఫుమిహికో ఐకీ చెప్పారు.
జపాన్‌కి చెందిన పలు ఆటోమొబైల్ విడిభాగాల సరఫరా సంస్థలు భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించాలనుకుంటున్నాయని, అయితే.. ఇక్కడ అనుమతులపరమైన అంశాల్లో ఆటంకాలు ఎదుర్కొంటున్నాయన్నారు. ప్లాంటు నిర్మాణ అనుమతుల ప్రక్రియ కొన్ని సందర్భాల్లో చాలా సంక్లిష్టంగా ఉండటం వల్ల వ్యాపార ప్రణాళికలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోందని చెప్పారు. పైగా అంతర్జాతీయ ప్రమాణాలకు విరుద్ధంగా ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకమైన పన్నుల విధానం ఉండటం కూడా సమస్యాత్మకంగా ఉంటోందని ఐకీ తెలిపారు.
మరోవైపు, అన్ని రాష్ట్రాల్లో పన్నుల పరంగా ఒకే రకమైన ప్రమాణాలు పాటించాల్సిన అవసరం ఉందని, అప్పుడే వాహనాలను అందుబాటు ధరల్లో అందించడం సాధ్యపడుతుందని జనరల్ మోటార్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ స్టెఫాన్ జాకోబీ చెప్పారు. పారిశ్రామిక విధానాలు, నిబంధనలు దీర్ఘకాలిక ప్రాతిపదికన స్థిరంగా ఉంటే మరిన్ని పెట్టుబడులు పెట్టడానికి వీలవుతుందని చెప్పారు. టారిఫ్‌లను తగ్గించడం ద్వారా భారత్ మరిన్ని వాణిజ్యావకాశాలు అందిపుచ్చుకోవచ్చని జాకోబీ తెలిపారు.
ఎల్లకాలం తోడ్పాటునివ్వలేం: వాణిజ్య శాఖ
ప్రపంచవ్యాప్తంగా సుంకాలపరమైన అడ్డంకులు తొలగిపోతున్న నేపథ్యంలో దేశీ ఆటోమొబైల్ పరిశ్రమకు ఎల్లకాలం టారిఫ్‌లపరమైన రక్షణ కల్పించడం సాధ్యం కాదని వాణిజ్య శాఖ కార్యదర్శి రాజీవ్ ఖేర్ వ్యాఖ్యానించారు. ఇతర దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకునేటప్పుడు దేశీ కంపెనీలకు విదేశీ సంస్థల నుంచి పోటీ ఎదురవకుండా ప్రభుత్వం జాగ్రత్త చర్యలు తీసుకుంటోందన్నారు.
ఆటో రంగం విషయంలోనే యూరోపియన్ యూనియన్‌తో ఎఫ్‌టీఏపై చర్చల్లో ప్రతిష్టంభన నెలకొందని ఖేర్ వివరించారు. అయితే, ఇలాంటి పరిస్థితి ఎన్నాళ్లు కొనసాగగలదన్నది ఆలోచించాల్సిన అంశమని ఖేర్ పేర్కొన్నారు. మరోవైపు, ఆటో రంగానికి తోడ్పాటునివ్వడం కోసం ఎగుమతులకు ఊతమిచ్చేలా ప్రభుత్వం ప్రోత్సాహకాలు కొనసాగించగలదని చెప్పారు.
2016 ప్రణాళిక లక్ష్యాలు మిస్..
గత మూడేళ్లలో ఆర్థిక మందగమనం కారణంగా డిమాండ్ క్షీణించిన నేపథ్యంలో దేశీ ఆటోమొబైల్ సంస్థలు 2016 నాటికి నిర్దేశించుకున్న లక్ష్యాల్లో దాదాపు పాతిక శాతాన్ని సాధించలేకపోయే అవకాశాలు ఉన్నాయి. చిన్న కార్లు, ఆటో విడిభాగాలు మొదలైన వాటి ఎగుమతుల ఊతంతో ఆటోమోటివ్ మిషన్ ప్లాన్ (ఏఎంపీ) 2006-2016 కింద 145 బిలియన్ డాలర్ల వార్షిక టర్నోవరు సాధించాలని దేశీ కంపెనీలు నిర్దేశించుకున్నాయి.
అయితే ఇంకా మిగిలి ఉన్న కాలాన్ని బట్టి చూస్తే ఇందులో 20- 25 శాతం లక్ష్యాన్ని సాధించలేకపోవచ్చని ఏసీఎంఏ, ఐసీఆర్‌ఏ మేనేజ్‌మెంట్ కన్సల్టింగ్ సర్వీసెస్ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. డిమాండ్ పెరుగుదలకు ప్రభుత్వం గానీ తోడ్పాటు అందించగలిగితే.. ఇది 13-17 శాతానికి తగ్గొచ్చని నివేదికలో పేర్కొంది.