తిరుగులేకుండా దూసుకెళ్తున్న రిలయన్స్
తిరుగులేకుండా దూసుకెళ్తున్న రిలయన్స్
Published Mon, Jul 17 2017 2:46 PM | Last Updated on Tue, Sep 5 2017 4:15 PM
దేశంలో అత్యంత విలువైన సంస్థగా పేరున్న రిలయన్స్ ఇంటస్ట్రీస్ దూసుకెళ్తోంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ మొట్టమొదటిసారి సోమవారం ట్రేడింగ్‌లో రూ.5 లక్షల కోట్ల మార్కును బీట్ చేసింది. గతేడాది సెప్టెంబర్‌లో రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ పేరుమీద ఈ కంపెనీ టెలికాం మార్కెట్లోకి ప్రవేశించినప్పటి నుంచీ షేర్లు తిరుగులేకుండా దూసుకెళ్తున్నాయి. నేటి ట్రేడింగ్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు 1.49 శాతం పెరిగి, రూ.1,553.90 వద్ద ట్రేడవుతున్నాయి.
ఈ పెంపుతో మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా రూ.5,05,287 కోట్లకు పెరిగింది. రూ.1,534.30 వద్ద ప్రారంభమైన కంపెనీ షేర్లు రూ.1,558.80 వద్ద గరిష్ట స్థాయిలను తాకాయి. అంతేకాక 52 వారాల్లో 52 శాతం వృద్ధిని కూడా కంపెనీ షేర్లు నమోదుచేశాయి. ఈ పెంపుతో బ్లూచిప్ కంపెనీల్లో అత్యధిక వెయిటేజీ ఉన్న షేర్లుగా ఇవి నమోదవుతున్నాయి. ఇన్వెస్టర్లకు రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు బంపర్ బొనాంజగా ఉన్నాయి.. ముఖ్యంగా టెలికాం, పెట్రోకెమికల్స్, రిటైల్ బిజినెస్‌ల పెట్టుబడులు వీటికి బాగా సహకరిస్తున్నాయి. తాజాగా జియో ఆఫర్ చేస్తున్న ధన్ ధనా ధన్ ఆఫర్ ముగుస్తున్న క్రమంలో కంపెనీ టారిఫ్ ప్లాన్లను సవరించింది. కొత్త రూ.309 ప్లాన్‌లో తక్కువ వాలిడిటీ, డేటాను అందిస్తోంది.
దీంతో కంపెనీ తన లాభాలను మెరుగుపరుచుకోవడానికి ఒక్కో యూజర్‌పై ఆర్జించే కనీస రెవెన్యూలను(ఆర్పును) పెంచుకోవాలని ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం కంపెనీకి 120 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్లున్నారు. దీర్ఘకాలికంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లలో చాలా పాజిటివ్ వాతావరణాన్ని చూస్తున్నామని మార్కెట్ విశ్లేషకులు చెప్పారు. జియో వల్ల మరింత మార్కెట్ షేరు పొందే అవకాశముందని కొటక్ సెక్యురిటీస్ వైస్ ప్రెసిడెంట్-పీసీజీ రీసెర్చ్ సంజీవ్ బార్‌బాడే పేర్కొన్నారు. జియో ప్లాన్లను సవరించడంతో, టెలికాం ఇండస్ట్రీకి గుడ్‌న్యూస్‌గా మారింది. జియో తన డేటా ప్లాన్లను పెంచుకుంటూ పోవడంతో ఇతర టెలికాం కంపెనీలు ఊపిరిపీల్చుకుంటున్నాయి.
Advertisement
Advertisement