న్యూఢిల్లీ: రోబోలు, ఆటోమేషన్ వల్ల ఉద్యోగాలకు ముప్పు పొంచి ఉందని వింటుంటాం. కానీ దాని గురించి అంతపెద్దగా పట్టించుకోం. కానీ సమస్య అనుకున్నంత చిన్నదిగా మాత్రం లేదు. రోబోలు, ఆటోమేషన్ కారణంగా ఎంత మంది ఉపాధి కోల్పోతారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!! వీటి వల్ల ప్రపంచవ్యాప్తంగా 2030 నాటికి ఏకంగా 80 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని ప్రముఖ రీసెర్చ్ సంస్థ మెకిన్సే తాజాగా తన సర్వేలో పేర్కొంది. ఈ సంఖ్య ప్రస్తుతం ప్రపంచంలోని మొత్తం కార్మిక సిబ్బందిలో ఐదో వంతుకు సమానం కావడం గమనార్హం.
అభివృద్ధి చెందిన దేశాలు, వర్ధమాన దేశాలు రెండూ కూడా ప్రతికూల ప్రభావం ఎదుర్కొవలసి ఉంటుందని హెచ్చరించింది. ఆటోమేషన్ త్వరితగతిన విస్తరిస్తే మెషీన్ ఆపరేటర్లు, ఫాస్ట్ ఫుడ్ వర్కర్లు, బ్యాక్–ఆఫీస్ ఉద్యోగులు ఎక్కువగా నష్టపోతారని, వారికి కష్టకాలం తప్పదని పేర్కొంది. ఒకవేళ రోబోలు, ఆటోమేషన్ అనుకున్నంత వేగంగా విస్తరించకపోతే అప్పుడు వచ్చే 13 ఏళ్లలో 40 కోట్ల మంది మాత్రం కొత్త ఉద్యోగాలను వెతుక్కోవలసి ఉంటుందని తెలిపింది. మెకిన్సే 46 దేశాల్లో ఈ సర్వే చేసింది.
భారత్‌లో 12 కోట్ల ఉద్యోగాలకు ఎసరు!!
రోబోలు, ఆటోమేషన్ వల్ల మనకూ ప్రమాదం పొంచి ఉంది. భారత్‌లో 11–12 కోట్ల మందికి పైగా ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి రావొచ్చని మెకిన్సే అంచనా వేసింది. ఇక ఎక్కువ ఉద్యోగాల కోత చైనాలో ఉండొచ్చని పేర్కొంది. ఇక్కడ దాదాపు 20 కోట్ల మందిపైగా ఉపాధి కోల్పోనున్నారని తెలిపింది. ఇక అమెరికాలో 5–8 కోట్ల మంది ఉద్యోగాలకు ప్రమాదం పొంచి ఉందని పేర్కొంది. చైనా, భారత్, అమెరికా దేశాల తర్వాత జపాన్, మెక్సికో, జర్మనీ దేశాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశముందని అభిప్రాయపడింది.
Comments
Please login to add a commentAdd a comment