ఆపిల్ స్టోర్‌లో భారీ చోరి
కాలిఫోర్నియా : పట్టపగలు.. వచ్చే పోయే కస్టమర్లతో కళకళలాడుతుంది. కానీ ఆ స్టోర్‌లో నలుగులు దొంగలు బీభత్సం సృష్టించారు. ఇటు ఉద్యోగులను, అటు కస్టమర్లను ఒక్కసారిగా షాక్‌కు గురిచేసి, దాదాపు 19 లక్షల రూపాయల విలువైన ఆపిల్ ఉత్పత్తులను ఆపిల్ స్టోర్ నుంచి కొట్టేశారు. ఆపిల్ స్టోర్‌లో టేబుల్స్‌పై ప్రదర్శనకు ఉంచిన ఛార్జర్‌లను, ఫోన్లను, ల్యాప్‌టాప్‌లను ఠక్కుఠక్కున లాగేసుకుని రయ్‌మని సెక్యురిటీ సిబ్బందికి చిక్కకుండా పారిపోయారు. ఈ ఘటన కాలిఫోర్నియా ఫ్రెస్నోలోని ఫ్యాషన్ ఫెయిర్ మాల్‌లో గల ఆపిల్ స్టోర్‌లో చోటు చేసుకుంది. ఈ ఘటనతో కస్టమర్లు, ఆపిల్ స్టోర్ ఉద్యోగులు కొద్ది సేపటి పాటు ఏం జరుగుతుందో తేల్చుకోలేకపోయారు.
నలుగురు దొంగలు చేసిన ఈ హంగామా అంతా సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. 16 నుంచి 18 సంవత్సరాల వయసు ఉన్న నలుగురు ఆఫ్రికన్ యువకులు ఫ్రెస్నోలోని ఆపిల్ స్టోర్‌లోకి ప్రవేశించారు. హూడెడ్ స్వీట్‌షర్ట్‌లు వేసుకొచ్చిన ఆ దొంగలు ముఖాలు కనిపించకుండా కప్పేసుకున్నారు. స్టోర్‌లోకి ప్రవేశించడమే పలు కౌంటర్ల వద్ద ఉన్న డివైజ్‌లను, టేబుల్స్‌పై ఉన్న కేబుల్స్‌ను, మ్యాక్‌బుక్‌లను చకాచకా లాగేసుకున్నారు. వాటిని తమ చేజిక్కించుకుని వెంటనే అక్కడి నుంచి ఎవరికీ దొరకకుండా పారిపోయారు. పారిపోతున్న వారిని అడ్డుకున్న ఒకతన్ని పక్కకు నెట్టేసి మరీ జంప్ చేశారు.
ఈ ఘటనతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. మొత్తం 26 ఖరీదైన డివైజ్‌లను వారు దొంగలించారని పోలీసులు చెప్పారు. వాటిలో మ్యాక్‌బుక్‌లు, ఐఫోన్ 6, 7, 8, ఎక్స్‌లు ఉన్నాయని చెప్పారు. వీరు కస్టమర్లను, ఉద్యోగులను బెదిరించలేదని, ఎలాంటి ఆయుధాలను వీరు కలిగి లేరని పోలీసులు చెప్పారు. ఈ ఘటనపై ప్రస్తుతం పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఆ నలుగురితో మరో దొంగ కూడా ఉన్నారని, అతను మాల్ బయట, వాహనంలో వీరు కోసం వేచిచూస్తున్నాడని తెలిపారు. నలుగురు ఈ డివైజ్‌లు తీసుకుని ఠక్కున బయటికి రాగానే, వాహనంలో జంప్ చేసినట్టు తెలిసింది. జూన్ 21 న కాలిఫోర్నియాలో మరో స్టోర్‌లో కూడా ఇదే మాదిరి చోరి జరిగింది. ఫ్రెస్నో బయట ఆపిల్ స్టోర్లలో కూడా ఇదే మాదిరి ఘటనలు చోటు చేసుకున్నాయి. దీంతో ఆ ఘటనలకు, దీనికి ఏమైనా సంబంధం ఉందా? అనే కోణంలో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment