పాలో ఆల్టో ఆపిల్ స్టోర్ (ఫైల్ ఫోటో)
శాన్‌ఫ్రాన్సిస్కో : ఒక స్టోర్‌లో ఒకసారి దొంగతనం జరిగింది అంటే.. అది గ్రహపాటునో లేదా అలర్ట్‌గా లేకపోవడం వల్లనో జరిగింది అనుకుంటాం. కానీ అదే స్టోర్‌లో మళ్లీ చోరీ జరిగితే, అది మాత్రం కచ్చితంగా సిబ్బంది నిర్లక్ష్యం, అలసత్వమే అవుతుంది. అమెరికాలో టెక్ దిగ్గజం ఆపిల్ స్టోర్‌లో అదే జరిగింది. ఆపిల్ తన కొత్త ఐఫోన్ 10ఎస్ లాంచ్ ఈవెంట్‌లో నిమగ్నమై ఉన్న సందర్భంగా.. కాలిఫోర్నియాలోని పాలో ఆల్టో ఆపిల్ స్టోర్‌లో 12 గంటల వ్యవధిలో రెండు సార్లు చోరీ జరిగింది. ఈ చోరీలో వేల డాలర్ల విలువైన ఎలక్ట్రానిక్స్ వస్తువులు దొంగతనానికి గురయ్యాయి.
పాలో ఆల్టో పోలీసులు సమాచారం ప్రకారం.. తొలుత శనివారం సాయంత్రం ఏడు గంటల సమయంలో ఆపిల్ స్టోర్‌లో దొంగతనం జరిగింది. ఆ సమయంలో ఎనిమిది మంది అనుమానిత వ్యక్తులు డెమోకి ఉంచిన 57 వేల డాలర్ల విలువైన ఐఫోన్లను ఎత్తుకెళ్లారు. దానిలో కొత్త ఐఫోన్లు ఐఫోన్ 10ఎస్, ఐఫోన్ 10ఎస్ మ్యాక్స్, ఇతర ప్రొడక్ట్‌లు ఉన్నాయి. ప్రొడక్ట్‌లను దొంగలించిన అనంతరం, వారు పలు వాహనాల్లో పారిపోయారని 9టూ5మ్యాక్ రిపోర్టు చేసింది. వెంటనే ఆదివారం ఉదయమే, మళ్లీ ఆపిల్ స్టోర్ గ్లాస్ డోర్లను బద్దలు కొట్టి మరిన్ని ఉత్పత్తులను దోచుకుపోయారు. మొత్తంగా 12 గంటల వ్యవధిలో పోయిన డివైజ్‌ల విలువ 1,07,00 డాలర్లుగా ఉంటుందని తెలిసింది. అయితే ఇప్పటి వరకు ఈ చోరీకి పాల్పడిన వారిని పోలీసులు గుర్తించడం కానీ అరెస్ట్ చేయడం కానీ జరగలేదు.
కేవలం పాలో ఆల్టో ఆపిల్ స్టోర్‌ను మాత్రమే కాకుండా.. కాలిఫోర్నియాలోని మరో స్టోర్ శాంట రోజా ప్లాజా షాపింగ్ సెంటర్‌ను కూడా దుండగులు టార్గెట్ చేశారు. కానీ అక్కడ దొంగలను పోలీసులకు చిక్కారు. గత కొన్నేళ్లుగా ఆపిల్ స్టోర్లను టార్గెట్‌గా చేసుకుని దుండగులు పలు చోరీలకు పాల్పడుతున్నారు. కొత్త ఐఫోన్ల లాంచింగ్ తర్వాత పాలో ఆల్టో ఆపిల్ స్టోర్‌లో ఇప్పటికి రెండు సార్లు దొంగతనం జరిగింది. అది కూడా వెంట వెంటనే. ఆగస్టు, సెప్టెంబర్ మధ్య కాలంలో కూడా ఆరు ఆపిల్ స్టోర్లలో కనీసం తొమ్మిది సార్లు దుండగులు రెచ్చిపోయారు. ఆదివారం శాంట రోజా ప్లాజాలో జరిగిన దొంగతనం కూడా నెల వ్యవధిలోనే రెండోది అని ఫాక్స్ న్యూస్ రిపోర్టు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment