యాపిల్ హెడ్ ఆఫీసులో ఉద్యోగి మృతి
కాలిఫోర్నియా: అసలే ఈ ఏడాది నికర లాభాల్లో 13 శాతం నష్టాలు చవిచూసి బాధల్లో ఉన్న యాపిల్ కంపెనీకి మరో షాక్ తగిలింది. క్యూపర్టినో నగరంలో గల యాపిల్ హెడ్ క్వార్టర్స్లోని 1 ఇన్ఫినిటీ క్యాంపస్ వద్ద బుధవారం ఉదయం ఒక ఉద్యోగి అనుమానాస్పదస్థితిలో మరణించాడు. నగరంలోని యాపిల్ ఆఫీస్ నుంచి ఉద్యోగి మరణించినట్లు ఉదయం ఎనిమిదిన్నర గంటల ప్రాంతంలో పోలీసులు సమాచారం అందుకున్నారు. హుటాహుటిన 1ఇన్ఫినిటీలూప్కు చేరుకున్న పోలీసులు ఉద్యోగి శవాన్ని పరిశీలించారు. ఉద్యోగిది ఆత్మహత్యా? లేక హత్యా? అనే విషయాలను విచారణ పూర్తయిన తర్వాత వెల్లడిస్తామని క్యూపర్టినో నగర అధికారి షెరీఫ్ సెక్యూరిటీ డిప్యూటీ యురీనా తెలిపారు.
ఓ వెబ్సైట్లో లభించిన ఆడియో టేపుల ప్రకారం అదే ఆఫీసులో పనిచేస్తున్న యువతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, వ్యక్తి మరణానికి రెండు నిమిషాల ముందు ఆమె తలపై ఎవరో తుపాకీ కాల్చినట్లు చెబుతున్నారు. కానీ, అతని మరణానికి ఆమె ఏ విధంగా కారణమనే విషయం మాత్రం ఆ టేపులో వెల్లడించలేదు. ఈ ఆడియో వివరాలపై అధికారులు స్పందించలేదు. ఈ విషయం మీద తమకు ఎలాంటి అనుమానాలు లేవని, ఎవరికి అపాయం లేదని అధికారులు చెప్పారు. ఘటనపై కంపెనీ ఇచ్చిన వివరాలను పోలీసులు బయటకు వెల్లడించలేదు. పూర్తిస్థాయి విచారణ చేసిన తర్వాత వివరాలను వెల్లడిస్తామన్నారు. అయితే, ఉద్యోగి మృతిపై యాపిల్ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటనా చేయలేదు.