కొత్త సంవత్సరం వేడుకల కోసం గోవా వెళ్లాలనుకుంటున్నారా? అయితే ఒక్క క్షణం ఆలోచించండి. ఈ న్యూఇయర్‌కి గోవా కాస్ట్‌లీగా మారిపోయింది. డిసెంబర్ 31న ఒక్క రాత్రి స్టే చేయాలంటే గోవాలో రూ. లక్షకు పైగా చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఓ వైపు న్యూఇయర్ ఎఫెక్ట్, మరోవైపు కొత్త పన్ను విధానం గోవాలో హోటల్స్ ఛార్జీలను అమాంతం నాలుగింతల వరకు పెంచేశాయి. గోవాలోని తాజ్ ఎక్సోటిక్ రిసార్టులో ఒక్క రోజు ఉండటానికి గది అద్దె రూ. 1,04,320కు పెరిగింది. ఇదే హోటల్‌లో జనవరి 31న ఉండాల్సి వస్తే టారిఫ్ రూ.20,700గా ఉన్నట్టు తెలిసింది. జీఎస్టీతో కలిపి మొత్తం రూ.26,720ను హోటల్ సిబ్బంది ఛార్జ్ చేస్తున్నారు. కొత్త సంవత్సరం వేడుకలు వైభవంగా జరిగే గోవాలో హోటల్ గదులకు భారీగా డిమాండ్ పెరుగడంతోనే అద్దెలను పెంచారని, జీఎస్టీ ప్రభావం కూడా టూరిజంపై అధికంగానే ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
అదేవిధంగా గోవాలోని మరో తాజ్ ప్రాపర్టీ తాజ్ ఫోర్ట్ అగుడా రిసార్ట్‌లో ఒక్కరోజు స్టే చేయడానికి టారిఫ్ ఛార్జ్ రూ. 52,200కి పెంచినట్టు తెలిసింది. దీనికి మరో రూ.14,840 జీఎస్టీ అదనపు భారం. మొత్తంగా ఒక్క రోజుకు తాజ్ ఫోర్ట్‌లో రూ.67,040 ఛార్జ్ చేస్తుంది. ఇదే హోటల్‌లో జనవరి 31న ఒక్క రాత్రి ఉండాల్సి వస్తే, జీఎస్టీతో కలిపితే మొత్తం రూ.17,120 చెల్లిస్తే సరిపోతుంది. లీలా గోవా హోటల్ లో కాంప్లిమెంటరీ బ్రేక్ ఫాస్ట్ కలిపి రూముకు రూ. 71,666 వసూలు చేస్తున్నారు. ఇలా గోవాలో అన్ని హోటల్స్ న్యూఇయర్ సందర్భంగా టారిఫ్ ఛార్జీలను పెంచేశాయి. గోవా మాత్రమే కాక ఉదయ్‌పూర్ లాంటి పర్యాటక ప్రాంతాల్లో ఇప్పటికే హోటళ్ల గదులన్నీ బుక్ అయిపోయినట్టు తెలిసింది. జైపూర్, మనాలీ వంటి ప్రాంతాల్లోనూ ఇదే విధమైన పరిస్థితి నెలకొంది. బడ్జెట్ హోటల్ చైన్ ఓయో సైతం ఈ డిసెంబర్ 31 గదుల అద్దెను 30 శాతం వరకూ పెంచింది. కార్బెట్, రణతంబోర్, మౌంట్ అబూ, పంచ్ మార్షి వంటి ప్రాంతాల్లో గదుల అద్దెలు 50 శాతం వరకూ పెరిగాయి.
Comments
Please login to add a commentAdd a comment