
రూపాయి అనూహ్య పతనం
♦ ఒకే రోజు 69 పైసలు డౌన్
♦ 64.84 వద్ద ముగింపు
♦ ఒకే రోజు ఇంత స్థాయిలో పతనం
♦ 2016 జూలై 26 తర్వాత తొలిసారి
♦ అంతర్జాతీయ అనిశ్చితే కారణం
ముంబై: డాలర్ మారకంలో అప్రతిహతంగా దూసుకుపోతున్న భారత్ రూపాయికి ఒక్కసారిగా బ్రేక్ పడింది. ఫారెక్స్ మార్కెట్‌లో గురువారం ఒకేరోజు 69 పైసలు (1.06 శాతం) బలహీనపడి 64.84 వద్ద ముగిసింది. 2017 ఏప్రిల్ 5 తరువాత రూపాయి ఈ స్థాయిలో ముగియడం ఇదే తొలిసారి. ఒక దశలో రూపాయి 64.91 స్థాయికి సైతం పతనం అయ్యింది. అమెరికా రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. రూపాయి ఒకే రోజు ఇంత దారుణ పతనం 10 నెలల్లో ఇదే తొలిసారి. 2016 జూలై 26న ఇలాంటి పతనం జరిగింది.
డాలర్‌కు డిమాండ్...
గత మూడు రోజులగా రూపాయి మారకం విలువ బలపడుతూ వస్తోంది. దీంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణ జరపడం కూడా రూపాయి అనూహ్య పతనానికి దారితీసింది. అమెరికా పరిణామాలు ఇటు ఫారెక్స్‌తో పాటు భారత్ స్టాక్ మార్కెట్‌పై సైతం ప్రభావం చూపింది. ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో బ్యాంకర్లు, ఎగుమతిదారుల నుంచి డాలర్ల కోసం భారీ డిమాండ్ ఏర్పడింది. నిజానికి డాలర్ బలహీనపడుతుంటే, రూపాయి బలపడాల్సి ఉంటుంది. అయితే అమెరికా రాజకీయ పరిస్థితులు, తద్వారా ఆర్థిక సంక్షోభ భయాలు మొత్తంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయన్న విశ్లేషణలు ఉన్నాయి.
ఫెడరల్ ఇన్వెస్టిగేషన్‌పై అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ జోక్యం, గత ఏడాది అమెరికా ఎన్నికల్లో రష్యా జోక్యం అవకాశాలపై విచారణకు ప్రత్యేక కౌన్సిల్ వంటి అంశాలు ఆ దేశ ఆర్థిక పరిస్థితిపై తద్వారా ప్రపంచ ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపుతున్న సంగతి తెలిసిందే. గ్లోబల్ ఆర్థిక అనిశ్చితి మరింత పెరుగుతుందన్న భయాలు మార్కెట్లపై ప్రధానంగా ప్రభావం చూపుతున్నాయని ఫారెక్స్ డీలర్ ఒకరు తెలిపారు. కాగా కడపటి సమాచారం అందేసరికి అంతర్జాతీయ ఫారెక్స్ మార్కెట్లో డాలర్ ఇండెక్స్ 97.60 వద్ద ట్రేడవుతుండగా, రూపాయి 64.88 వద్ద ట్రేడవుతోంది.