బలపడిన రూపాయి, భారీ లాభాల్లో సెన్సెక్స్!
ఆసియా మార్కెట్లలో సానుకూల ప్రభావం, ఫండ్స్ కొనుగోళ్లకు పాల్పడటంతో భారత స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. గత మూడు సెషన్లలో 674 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ సోమవారం ఉదయం 223 పాయింట్లు లాభపడి 20440 వద్ద ప్రారంభమైంది. బ్యాంకింగ్, ఆయిల్, గ్యాస్, ఇతర రంగాల షేర్లలో రికవరీ కనిపించింది. మరో ప్రధాన సూచీల 68 పాయింట్లు లాభపడి 6064 పాయింట్ల నమోదు చేసుకుంది.
ప్రస్తుతం సెన్సెక్స్ 277 పాయింట్లతో 20495, నిఫ్టీ 85 పాయింట్ల వృద్దితో 6081 వద్ద ట్రేడ్ అవుతోంది. ఐసీఐసీఐ బ్యాంక్, బీపీసీఎల్, జయప్రకాశ్ అసోసియేట్స్, బ్యాంక్ ఆఫ్ బరోడా, యాక్సిస్ బ్యాంక్ లు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఇన్ఫోసిస్, టీసీఎస్, ఎన్ టీపీసీ లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.
బ్యాంకులు, ఎగుమతుదారులు అమెరికా డాలర్ ను అమ్మకాలు జరపడంతో ఇంటర్ బ్యాంక్ ఫారెన్ ఎక్స్చేంజి వద్ద ఆరంభంలోనే రూపాయి 31 పైసలు బలపడింది. వివాదస్పద న్యూక్లియర్ కార్యక్రమంపై ఇరాన్, అగ్రరాజ్యాల మధ్య ఒప్పందం, అంతర్జాతీయ మార్కెట్ లో చమురు ధరలు తగ్గుముఖం పట్టడం, డాలర్ కు వ్యతిరేకంగా యూరో బలపడటం రూపాయి బలపడటానికి కారణం అని ఫారెక్స్ డీలర్స్ తెలిపారు. ప్రస్తుతం 37 పైసల లాభంతో 62.50 వద్ద ట్రేడ్ అవుతోంది.