8 వేల దిగువకు దిగజారిన నిఫ్టీ
Published Mon, Nov 21 2016 4:11 PM | Last Updated on Mon, Sep 4 2017 8:43 PM
డాలర్ షాక్.. రూపాయి పతనం.. పెద్ద నోట్ల రద్దు స్టాక్ మార్కెట్ల భారీ పతనానికి దారితీసింది. ఈక్విటీ బెంచ్మార్క్స్ సెన్సెక్స్ 385.10 పాయింట్లు దిగజారి 25,765.14వద్ద ముగియగా.. నిఫ్టీ 145 పాయింట్లు కుప్పకూలి 8వేల దిగువకు 7929.10వద్ద క్లోజ్ అయింది. 2015 మార్చి తర్వాత సెన్సెక్స్ ఇదే అతిపెద్ద నష్టంగా మార్కెట్ విశ్లేషకులంటున్నారు. ప్రారంభంలో స్వల్పనష్టాలతో ఎంట్రీ ఇచ్చిన స్టాక్ మార్కెట్లు, మార్కెట్లో నెలకొన్న అమ్మకాల ఒత్తిడి, పెద్ద నోట్ల రద్దు ప్రభావం మార్కెట్లను కుప్పకూల్చినట్టు మార్కెట్ విశ్లేషకుల అభిప్రాయపడుతున్నారు. నోట్ బ్యాన్ దేశీయ మార్కెట్ల సెంటిమెంట్ను బలహీనపరుస్తుందన్నారు. 2016లో ఆర్జించిన లాభాలన్నింటినీ ఈ ఎనిమిది సెషన్లు హరించుకుపోయాయని తెలుస్తోంది.
రూ.500, రూ.1000 నోట్ల రద్దు కంపెనీల ఆదాయాలపై, ఆర్థికవ్యవస్థపై ప్రభావం చూపుతుందని పెట్టుబడిదారులు ఆందోళన చెందుతున్నారని, కొన్ని బ్రోకరేజ్ సంస్థలు ఇప్పటికే కంపెనీలు రాబడులు, జీడీపీ అంచనాలను తగ్గించినట్టు విశ్లేషకులు పేర్కొన్నారు. నోట్ల రద్దు ఆర్థిక సంవత్సరం 2017, 2018కి అతిపెద్ద సవాలుగా మారునుందని గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ సంస్థ జేఫ్ఫేరీస్ చెప్పింది. అదేవిధంగా నిఫ్టీ టార్గెట్ను కూడా ఆ సంస్థ 7500 దిగువకు రీసెట్ చేసింది. ఈ ఎఫెక్ట్తో బ్యాంకు నిఫ్టీ 600 పాయింట్లు దిగజారింది. బ్యాంకు ఆఫ్ బరోడా, పీఎన్బీ, ఫెడరల్ బ్యాంకింగ్, కెనరా బ్యాంకింగ్, యస్ బ్యాంకు, ఎస్బీఐ, ఇండస్ఇండ్ బ్యాంకులు 5-8 శాతం పడిపోయాయి. టాటా గ్రూప్ స్టాక్స్ టాటా స్టీల్, టాటా మోటార్స్ దాదాపు 4 శాతం మేర క్షీణించాయి. ఎఫ్‌ఐఐల నిరవధిక అమ్మకాలు, ఫెడ్ వడ్డీరేట్లు పెంపు అంచనాల నేపథ్యంలో అంతర్జాతీయంగా డాలర్ దూసుకుపోతుండటంతో రూపాయి 68.15 స్థాయికి పడిపోయింది. అటు 10 గ్రాముల బంగారం ధర ఎంసీఎక్స్ మార్కెట్లో 127 రూపాయలు ఎగిసి, రూ.29,064వద్ద ముగిసింది.
Advertisement
Advertisement