రూపాయి మరింత కిందకి
31 పైసలు పతనం
65.31 వద్ద ముగింపు
ముంబై: దిగుమతిదారులు, ప్రభుత్వ రంగ సంస్థల నుంచి డాలర్లకు డిమాండ్ నెలకొనడంతో రూపాయి పతనం కొనసాగుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ సోమవారం మరో 31 పైసలు క్షీణించి 65.31 వద్ద ముగిసింది. చైనా కరెన్సీ యువాన్ డీవేల్యుయేషన్ అనంతరం అంతర్జాతీయ కరెన్సీ మార్కెట్లు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతుండటం, బలహీన వాణిజ్య గణాంకాలు మొదలైనవి దేశీ కరెన్సీ క్షీణించడానికి కారణాలని మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి.
సోమవారం ఫారెక్స్ మార్కెట్లో క్రితం ముగింపు 65తో పోలిస్తే బలహీనంగా 65.12 వద్ద రూపాయి ట్రేడింగ్ ప్రారంభమైంది. ఒక దశలో 65.36 స్థాయికి కూడా పడిపోయింది. గడిచిన రెండేళ్లలో రూపాయికి ఇది మరో కొత్త కనిష్ట స్థాయి కావడం గమనార్హం. ఆ తర్వాత క్లోజింగ్ సమయానికి 0.48 శాతం నష్టంతో దేశీ కరెన్సీ 65.31 వద్ద ముగిసింది. స్పాట్ మార్కెట్లో ఇక డాలరుతో రూపాయి మారకం విలువ 64.80-65.80 మధ్య తిరుగాడగలదని వెరాసిటీ గ్రూప్ సీఈవో ప్రమీత్ బ్రహ్మభట్ తెలిపారు.