న్యూఢిల్లీ: వరుసగా 10 త్రైమాసికాలపాటు నష్టాలు ప్రకటించిన ప్రభుత్వ రంగ ఉక్కు దిగ్గజం సెయిల్ మళ్లీ లాభాల్లోకి వచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో రూ. 43.16 కోట్ల నికర లాభం (స్టాండెలోన్) ప్రకటించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో సెయిల్ రూ.795 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది.
తాజా క్యూ3లో ఆదాయం రూ. 12,688 కోట్ల నుంచి రూ. 15,443 కోట్లకు పెరిగింది. మూడో త్రైమాసికంలో పన్నులకు ముందు లాభాలు రూ.82 కోట్లుగా నమోదైనట్లు సంస్థ చైర్మన్ పి.కె. సింగ్ తెలిపారు. సవాళ్లను సమర్థంగా అధిగమిస్తూ, లాభాల్లోకి మళ్లేందుకు కంపెనీ చేస్తున్న కృషి సత్ఫలితాలనిస్తోందని ఆయన పేర్కొన్నారు. తాజా లాభాలు... సంస్థ టర్న్‌ఎరౌండ్ అవుతోందనడానికి నిదర్శనమన్నారు.
అధిక ఉత్పత్తి, సామర్థ్యాలను మెరుగుపర్చుకోవడం, వ్యయ నియంత్రణ చర్యలు, మార్కెటింగ్‌పై మరింతగా దృష్టి సారించడం తదితర అంశాలు సెయిల్ మళ్లీ లాభాల్లోకి మళ్లేందుకు దోహదపడ్డాయని సింగ్ చెప్పారు. ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకునే దిశగా వివిధ ప్రాజెక్టుల ఆధునీకరణ పనులు దాదాపు పూర్తయినట్లు తెలిపారు. వ్యాపార వృద్ధి వ్యూహాల్లో భాగంగా దేశ, విదేశాల్లో కొంగొత్త మార్కెట్లపై దృష్టి పెడుతున్నట్లు సింగ్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment