ఆరోగ్యానికి డబుల్ ధీమా
పెరుగుతున్న వైద్య చికిత్స వ్యయానికి తోడు, వైద్య బీమాపై ప్రజల్లో అవగాహన పెరుగుతుండటంతో దేశంలో ఆరోగ్య బీమాపాలసీల అమ్మకాలు పెరుగుతున్నాయి. ఇప్పుడు చాలామంది ఒకటి కంటే ఎక్కువ ఆరోగ్య పాలసీలు కలిగి ఉండటం అనేది సర్వసాధారణమైంది. ఇటువంటి కేసుల్లో అత్యధికంగా కంపెనీ ఇస్తున్న ఆరోగ్య పాలసీకి అదనంగా వ్యక్తిగత పాలసీలు తీసుకునే వారే ఉంటున్నారు.
ఒకవిధంగా ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. కేవలం కార్పొరేట్ పాలసీపై ఆధారపడకుండా వ్యక్తిగతంగా కలిగి ఉండటం ద్వారా ఉద్యోగం మారే సమయాల్లో, లేదా ఉద్యోగం పోయిన సందర్భాల్లో వ్యక్తిగత పాలసీలు అక్కరకు వస్తాయి. అంతేకాదు చిన్న వయసులోనే వ్యక్తిగత పాలసీలు తీసుకుంటే అప్పటికే ఏమైనా వ్యాధులు ఉంటే వాటి వెయిటింగ్ పీరియడ్ తొందరగా ముగిసిపోతుంది.
అన్నీ చెప్పాలి
ఒకటి కంటే ఎక్కువ వ్యక్తిగత ఆరోగ్య పాలసీలు తీసుకుంటున్నప్పుడు బీమా కంపెనీలకు వివరాలన్నీ తెలియచేయాలి. కొత్తగా ఏమైనా పాలసీ తీసుకునేటప్పుడు అప్పటికే కలిగి ఉన్న పాలసీ వివరాలు చెప్పాలి. ఈ పాలసీలకు ప్రీమియం మీరు చెల్లిస్తుంటేనే చెప్పాల్సి ఉంటుంది. అలాకాకుండా ప్రీమియంలు కంపెనీలు చెల్లిస్తుంటే ఆ పాలసీ వివరాలను కొత్త పాలసీ తీసుకునేటప్పుడు తెలియచేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు అప్పటికే పాలసీ కలిగి ఉండి ఆ వివరాలను మరో పాలసీ తీసుకునేటప్పుడు తెలియచేయకపోతే అది బీమా కంపెనీల నిబంధనలను ఉల్లంఘించినట్లే అవుతుంది. ఇలాంటి సమయంలో క్లెయిమ్‌ల సమయంలో సమస్యలు ఎదుర్కొనాల్సి ఉంటుంది.
ఇలా క్లెయిమ్ చేయాలి
ఒకటి కంటే ఎక్కువ పాలసీలు ఉన్నప్పుడు వాటిని ముఖ్యంగా క్లెయిమ్‌ల సమయంలో చాలా తెలివిగా ఉపయోగించుకోవాలి. క్లెయిమ్‌ల నిబంధనల్లో ఐఆర్‌డీఏ సవరణలు చేయడంతో పాలసీదారులు ఈ విషయంలో చాలా అయోమయానికి గురవుతున్నారు. గతంలో ఒకటి కంటే ఎక్కువ పాలసీలు ఉన్న వారి క్లెయిమ్‌ల విషయంలో బీమా రక్షణ మొత్తం ఆధారంగా క్లెయిమ్ మొత్తాన్ని పంచుకోవాలని ఐఆర్‌డీఏ నిబంధనలు సూచించేవి.
ఈ విధానం కొద్దిగా క్లిష్టతరమైనది కావడంతో దీన్ని సవరిస్తూ మరింత సులభంగా క్లెయిమ్ విధానాన్ని ఐఆర్‌డీఏ ప్రవేశపెట్టింది. తీసుకున్న పాలసీ మొత్తం కంటే క్లెయిమ్ మొత్తం చిన్నదైతే, ఈ క్లెయిమ్ మొత్తాన్ని అన్ని బీమా కంపెనీలు పంచుకోవాలన్న నిబంధన వర్తించదు. తీసుకున్న పాలసీ కంటే క్లెయిమ్ మొత్తం అధికమైతే అప్పుడు ఈ మొత్తాన్ని ఇతర బీమా కంపెనీలూ పంచుకుంటాయి. ఏ బీమా కంపెనీ పాలసీని క్లెయిమ్‌కు వినియోగించుకోవాలన్న విషయంలో పాలసీదారునికి పూర్తి స్వేచ్ఛ ఉంది.
క్లెయిమ్ మొత్తం తక్కువగా ఉంటే..
ఒకటి కంటే ఎక్కువ ఆరోగ్య పాలసీలు ఉండి, క్లెయిమ్ మొత్తం తీసుకున్న పాలసీ బీమా రక్షణ కంటే తక్కువగా ఉన్నప్పుడు ఈ మొత్తాన్ని ఒకే కంపెనీ నుంచి పొం దచ్చు. ఇటువంటి సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలను ఇప్పుడు పరిశీలిద్దాం...
* హాస్పిటల్‌లో చేరిన వెంటనే ఆ విషయాన్ని బీమా కంపెనీకి తెలియచేయాలి
* రీ-యింబర్స్‌మెంట్ కోసం క్లెయిమ్ ఫామ్ పూర్తి చేసి, దానికి అన్ని బిల్లులు, డాక్యుమెంట్లు జత చేయండి.
* క్లెయిమ్‌కు దాఖలు చేసిన తర్వాత టీపీఏతో కాని, బీమా కంపెనీకి కాని అందుబాటులో ఉండాలి. వారు ఏమైనా అదనపు సమాచారం అడిగితే వాటిని ఇవ్వాలి.
* గరిష్టంగా 30-40 రోజుల్లో క్లెయిమ్ మొత్తం మీ చేతికి అందుతుంది.
రెండు మూడు కంపెనీలతో అయితే..
క్లెయిమ్ మొత్తం అధికంగా ఉంటే ఈ మొత్తాన్ని కేవలం ఒక కంపెనీ కాకుండా ఇతర కంపెనీలు కూడా పాలు పంచుకుంటాయి. ఇటువంటి సమయంలో ఈ జాగ్రత్తలు పాటించడం మర్చిపోవద్దు.
* హాస్పిటల్‌లో చేరిన వెంటనే ఈ విషయాన్ని మీరు పాలసీ తీసుకున్న అన్ని కంపెనీలకు తెలియచేయాలి.
* మొదట ఏ కంపెనీ నుంచి క్లెయిమ్ పొందాలనుకుంటున్నారో అది మీరే ఎంచుకోవచ్చు.
* క్లెయిమ్ ఫామ్ పూర్తి చేసి దానికి అవసరమైన అన్ని బిల్లులు, కాగితాలు ఒరిజినల్స్ జతపర్చండి.
* ఈ బిల్లు కాగితాలను జిరాక్స్ తీసుకొని వాటిని అటెస్ట్ చేయించి మిగిలిన బీమా కంపెనీలకు ఇవ్వడానికి సిద్ధంగా ఉంచుకోండి
* మొదటి కంపెనీ నుంచి క్లెయిమ్ పూర్తయిన తర్వాత ఈ క్లెయిమ్ కాపీని జత చేసి రెండో కంపెనీకి క్లెయిమ్ దరఖాస్తు చేసుకోవాలి.
* మొదటి కంపెనీ నుంచి క్లెయిమ్ మొత్తాన్ని పొందినట్టు దానికి సంబంధించిన కాగితాలను జత చేసినట్లు తెలియచేస్తూ ఒక కవరింగ్ లెటర్ రాయండి.
* మూడో కంపెనీకి కూడా క్లెయిమ్ చేయాల్సి వస్తే.. పై విధానాన్నే అనుసరించండి.