స్మార్ట్‌ఫోన్ల రారాజు శాంసంగ్ తన కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ నోట్ 9 ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. భారత కాలమానం ప్రకారం నిన్న రాత్రి 8.30 గంటలకు న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌లో జరిగిన ఈవెంట్‌లో శాంసంగ్ ఈ ఫోన్‌ను ఆవిష్కరించింది. అదరగొట్టే ఫీచర్లతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను శాంసంగ్ విడుదల చేసింది.
డిస్‌ప్లే, డిజైన్...
శాంసంగ్ గెలాక్సీ నోట్ 9 స్మార్ట్‌ఫోన్‌లో అతిపెద్దగా 6.4 ఇంచుల భారీ సూపర్ అమోలెడ్ ఇన్ఫినిటీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. క్వాడ్ హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్ (1440x 2960పిక్సల్స్)ను గెలాక్సీ నోట్ 9 స్మార్ట్‌ఫోన్ కలిగి ఉంది. గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌తో ఇది మార్కెట్‌లోకి వచ్చింది. ముందు, వెనుక భాగాల్లో ఉన్న బాడీకి ఈ ప్రొటెక్షన్ ఉంది. ఇక ఈ ఫోన్ మ్యాట్ అల్యూమినియం ఫ్రేమ్‌ను కలిగి ఉంది. గెలాక్సీ నోట్ 5 మాదిరిగా ఫోన్ ఎడ్జ్‌లను అద్భుతంగా తీర్చిదిద్దడం దీనికి ప్రీమియం లుక్‌ను అందిస్తోంది. మిడ్‌నైట్ బ్లాక్, లావెండర్ పర్పుల్, మెటాలిక్ కాపర్, ఓషియన్ బ్లూ కలర్ వేరియెంట్లలో వినియోగదారులకు ఈ ఫోన్ లభ్యం కానుంది.
ఈ ఫోన్‌లో మరో ప్రత్యేకత ర్యామ్, స్టోరేజ్. ర్యామ్ స్టోరేజ్ ఏ విధంగా ఉన్నాయో ఓ సారి చూద్దాం..
6/8 జీబీ ర్యామ్ ఆప్షన్లలో దీని రూపొందించారు. ర్యామ్‌తో పాటు గతంలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా 512 జీబీ వరకు స్టోరేజ్‌ను ఈ ఫోన్‌లో శాంసంగ్ ఆఫర్ చేస్తోంది. అంతేకాక మైక్రో ఎస్డీ కార్డుతో మరో 512 జీబీ స్టోరేజ్‌ను పెంచుకోవచ్చు. దీంతో మొత్తంగా ఈ ఫోన్ 1 టీబీ స్టోరేజ్ ఉంటుంది. ర్యామ్ ఎక్కువగా ఉండటం వల్ల ఫోన్ అద్భుతమైన వేగంతో పనిచేస్తుంది. మంచి ప్రదర్శనను ఇస్తుంది. 6జీబీ ర్యామ్ ఆప్షన్‌లో 128 జీబీ స్టోరేజ్ ఆప్షన్‌ను కూడా అందిస్తున్నారు. గెలాక్సీ నోట్9 స్మార్ట్‌ఫోన్‌లో అధునాతన క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 845 ఆక్టాకోర్ ప్రాసెసర్‌ను అమర్చారు. ఇండియన్ వేరియెంట్‌లో శాంసంగ్ సొంత చిప్‌సెట్ అయిన ఎగ్జినోస్ 9810 ను ఏర్పాటు చేశారు.
గెలాక్సీ నోట్ 9 కెమెరా, మిగతా ఫీచర్లు...
12 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
ఆండ్రాయిడ్ 8.1 ఓరియో
సింగిల్/హైబ్రిడ్ డ్యుయల్ సిమ్
ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్
డాల్బీ అట్మోస్
ఎస్ పెన్, బారో మీటర్
ఫింగర్‌ప్రింట్ సెన్సార్, హార్ట్ రేట్ సెన్సార్, ఐరిస్ సెన్సార్, ప్రెషర్ సెన్సార్,
4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్ఎఫ్‌సీ
4000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్, వైర్‌లెస్ చార్జింగ్
ధర, లభ్యత...
గెలాక్సీ నోట్ 9 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర 999 డాలర్లు (దాదాపుగా రూ.68,700)గా ఉంది. అలాగే 8జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర 1250 డాలర్లు (దాదాపుగా రూ.85,900)గా ఉంది. అమెరికా మార్కెట్‌లో ఈ ఫోన్‌ను ఈ నెల 24వ తేదీ నుంచి విక్రయించనున్నారు. నేటి నుంచి అక్కడ ఈ ఫోన్‌కు గాను ప్రీ ఆర్డర్లను ప్రారంభించనున్నారు. అయితే ఈ ఫోన్‌ను భారత్‌లో ఎప్పుడు విడుదల చేస్తారు, ధర తదితర వివరాలను మాత్రం శాంసంగ్ వెల్లడించలేదు. కానీ అతి త్వరలోనే గెలాక్సీ నోట్ 9 ను భారత మార్కెట్‌లోనూ లాంచ్ చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment