భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో శామ్‌సంగ్ హవా | Samsung is India's No. 1 smartphone maker: IDC | Sakshi
Sakshi News home page

భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో శామ్‌సంగ్ హవా

Published Tue, Aug 19 2014 2:50 AM | Last Updated on Sat, Sep 2 2017 12:04 PM

Samsung is India's No. 1 smartphone maker: IDC

న్యూఢిల్లీ: భారత్‌లో స్మార్ట్‌ఫోన్ విక్రయాల వృద్ధి జోరు బలహీనంగా ఉందని అంతర్జాతీయ రీసెర్చ్ సంస్థ ఐడీసీ పేర్కొంది.  ఆసియా పసిఫిక్ ప్రాంతంలో వేగంగా వృద్ధిచెందుతున్న స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌గా అవతరించిన భారత్‌లో స్మార్ట్‌ఫోన్ అమ్మకాల వృద్ధి గత ఏడాది మొదటి మూడు నెలల్లో మూడంకెల్లో ఉండగా, ఈ ఏడాది 84 శాతంగానే ఉందని ఐడీసీ తాజా నివేదిక వెల్లడించింది. మరిన్ని వివరాలు...
 
గత ఏడాది ఏప్రిల్-జూన్ కాలానికి కోటికి పైగా స్మార్ట్‌ఫోన్‌లు అమ్ముడవగా, ఈ ఏడాది అదే కాలానికి 1.84 కోట్ల స్మార్ట్‌ఫోన్‌లు విక్రయమయ్యాయి.
     
భారత స్మార్ట్‌ఫోన్‌ల మార్కెట్లో 29 శాతం మార్కెట్ వాటాతో శామ్‌సంగ్ అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో మైక్రోమ్యాక్స్(18 శాతం), కార్బన్ (8 శాతం), లావా(6 శాతం) ఉన్నాయి. ఈ వృద్ధిరేట్లను పరిగణనలోకి తీసుకుంటే, ఈ కంపెనీల స్థానాలు మారే అవకాశం ఉంది.
     
మరిన్ని చౌక ధరల స్మార్ట్‌ఫోన్‌లను అందించాల్సిన అవసరం శామ్‌సంగ్‌కు ఉంది. అంతేకాకుండా అమ్మకాల వృద్ధి జోరును కొనసాగించాలంటే హై ఎండ్ కేటగిరిలో యాపిల్ వంటి బ్లాక్‌బస్టర్ స్మార్ట్‌ఫోన్‌ను అందించాల్సి కూడా ఉంది.
     
మొత్తం మొబైల్ ఫోన్ల మార్కెట్లో ఫీచర్ ఫోన్ల విక్రయాల వాటా 71 శాతంగా ఉంది. ఫీచర్ ఫోన్‌లు కొనుగోళ్లు చేసినవాళ్లు ఆ తర్వాత స్మార్ట్‌ఫోన్‌లు కొనుగోలు చేస్తారు. కాబట్టి భవిష్యత్తులో స్మార్ట్‌ఫోన్ల మార్కెట్ వృద్ధి జోరుగా ఉండొచ్చు.
     
రానున్న పండుగల సీజన్‌లో స్మార్ట్‌ఫోన్‌ల విక్రయాలు భారీగా పెరగవచ్చు.
     
చౌక ధరల్లో స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి రానుండడం, ఫీచర్ ఫోన్ల నుంచి స్మార్ట్‌ఫోన్‌లకు అప్‌గ్రేడ్ కానుండడం తదితర కారణాల వల్ల స్మార్ట్‌ఫోన్‌లు భారీగా అమ్ముడవుతున్నాయి.
     
పలు చైనా కంపెనీలు భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి ప్రవేశిస్తుండడం, మోజిల్లా సంస్థ అందుబాటు ధరల కేటగిరి స్మార్ట్‌ఫోన్‌ల్లోకి ప్రవేశిస్తున్న కారణంగా స్మార్ట్‌ఫోన్‌ల అమ్మకాలకు ఢోకా లేదు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement