
మైక్రోమాక్స్‌ను దాటేసిన శామ్‌సంగ్
న్యూఢిల్లీ : భారత్‌లో స్మార్ట్‌ఫోన్లకు భారీగా డిమాండ్ పెరిగిపోతున్నది. 2014లో8.11 కోట్లు(81.1 మిలియన్)గా ఉన్న స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు 2015లో పదికోట్ల (100 మిలియన్) మార్క్‌ను దాటాయి. మొత్తం మీద గడిచిన ఏడాది స్మార్ట్‌ఫోన్ అమ్మకాల్లో 23.3 శాతం వృద్ధి నమోదైందని కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ సంస్థ తన నివేదికలో తెలిపింది. మొత్తంగా చూసుకుంటే గత ఏడాది నాలుగో త్రైమాసికంలో స్మార్ట్‌ఫోన్ అమ్మకాల్లో 28.6 శాతం వాటాతో శామ్‌సంగ్ అగ్రస్థానంలో నిలిచింది. 14.3 శాతంతో మైక్రోమ్యాక్స్, 11.4 శాతంతో లెనోవా, 9.6 శాతంతో ఇంటెక్స్, 6.8 శాతంతో లావా ఫోన్లు తర్వాతి స్థానాల్లో నిలిచాయి. 2015 ఆర్థిక సంవత్సరం మొత్తంగా తీసుకున్నా శామ్‌సంగే ఇండియా మార్కెట్‌లో 23.6 శాతం వాటాతో మొదటిస్థానంలో నిలిచింది.
దేశంలో 22 కోట్లమంది వినియోగదారులు..
దేశంలో ఇప్పటికే 22 కోట్లమంది స్మార్ట్ ఫోన్ మొబైల్ వినియోగదారులు ఉన్నారని, దేశంలోని స్మార్ట్‌ఫోన్ మార్కెట్ ఏ కంపెనీకైనా విస్తారమైన అవకాశాలు కలుగజేస్తున్నదని కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ సీనియర్ విశ్లేషకుడు తరుణ్ పాఠక్ తెలిపారు. దేశ జనాభాలో కేవలం 30శాతం మందికి మాత్రమే స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉందని, దేశంలో స్మార్ట్‌ఫోన్ మార్కెట్ మరింత విస్తరించే అవకాశాలను ఇది చాటుతోందని ఆయన చెప్పారు.
4జీ ఎల్‌టీఈ డివైజ్‌లు, స్మార్ట్‌ఫోన్ల దిగుమతి 15 శాతం పెరిగి, గత ఏడాది అక్టోబర్- డిసెంబర్ త్రైమాసికంలో 25.3 మిలియన్ యూనిట్స్‌కు తాకిందని తెలిపారు. నాలుగో త్రైమాసికం సెలవుల సమయంలో దేశంలో స్మార్ట్‌ఫోన్లకు గిరాకీ బాగా పెరిగినప్పటికీ.. నవంబర్ నెల మధ్యకాలానికి అది పడిపోవడంతో స్మార్ట్‌ఫోన్ దిగమతులు 11 శాతం వరకు తగ్గాయని తరుణ్ పాఠక్ చెప్పారు.
కానీ ఎల్‌టీఈ దిగుమతలు మాత్రం పెరిగినట్టు తెలిపారు. ఎల్‌టీఈ స్మార్ట్‌ఫోన్లకు ధర తక్కువ కావడం, 4 జీ సర్వీస్‌లు ఆఫర్ చేయడమే దీనికి కారణమని అంటున్నారు. నాలుగో త్రైమాసికంలో దిగుమతి చేసుకున్న ఫోన్లలో 40 శాతం స్మార్ట్‌ఫోన్సే. ఇక ఈ త్రైమాసికంలో అమ్ముడుపోయిన ఫోన్లలో సగానికి పైగా ‘మేడ్ ఇన్ ఇండియా’వే. దాదాపు 20 మొబైల్ ఫోన్ బ్రాండ్‌లు దేశంలో కంపెనీలు స్థాపించి మొబైల్స్‌ను విక్రయిస్తున్నాయి.