ఫొటో తీయగానే స్టోరేజీలోకి
♦ శాన్‌డిస్క్ నుంచి కనెక్ట్ వైర్‌లెస్ స్టిక్
♦ మూడు గ్యాడ్జెట్లకు సంధానించే వీలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్‌లో తీసిన ఫొటోలు, వీడియోలు సాధారణంగా ఇంటర్నల్ మెమరీ లేదా మైక్రో ఎస్‌డీ కార్డులో నిక్షిప్తమవుతుంటాయి. ఫ్లాష్ స్టోరేజ్ సొల్యూషన్స్‌లో ఉన్న శాన్‌డిస్క్ సంస్థ... కనెక్ట్ వైర్‌లెస్ స్టిక్ పేరిట వైఫైతో పనిచేసే చిన్న పరికరాన్ని రూపొం దించింది. ఫొటోలు, వీడియోలు తీసిన వెంటనే ఆటో బ్యాక్ అప్ ఫీచర్‌తో ఈ స్టిక్‌లోకి వెంటనే వచ్చి చేరిపోతాయి. స్మార్ట్‌ఫోన్, ట్యాబ్లెట్, కంప్యూటర్.. ఇలా ఒకేసారి మూడు గ్యాడ్జెట్లనూ శాన్‌డిస్క్ యాప్ డౌన్‌లోడ్ చేయటం ద్వారా అనుసంధానించవచ్చు.
దీనివల్ల ఈ మూడు గాడ్జెట్లకూ ఈ స్టిక్ ఆటో బ్యాకప్‌గా పనిచేస్తుంది. అంతేకాక స్టిక్‌లో నిక్షిప్తమై ఉన్న ఫొటోలు, పాటలు, వీడియోలను ఈ మూడు గ్యాడ్జెట్లను వాడుతున్నవారూ ఒకేసారి ఎంజాయ్ చేయవచ్చు. హెచ్‌డీ వీడియోను ఎటువంటి అడ్డంకి లేకుండా మూడింటిలోనూ వీక్షించవచ్చు. బిల్ట్ ఇన్ వైఫైతో తయారైన ఈ స్టిక్ 150 అడుగుల దూరం వరకు పనిచేస్తుంది. 16జీబీ మొదలు 200 జీబీ సామర్థ్యం వరకు ఉన్న ఈ స్టిక్స్ ధర ల శ్రేణి రూ.2,390 నుంచి రూ.9,990 వరకూ ఉంది. టాప్ రిటైల్ దుకాణాలతోపాటు ఆన్‌లైన్‌లో లభిస్తాయి.
అధిక సామర్థ్యమున్నవే..
దేశంలో శాన్‌డిస్క్ 37 శాతం వాటాతో అగ్ర స్థానంలో ఉందని కంపెనీ భారత్, సార్క్ దేశాల మార్కెటింగ్ డెరైక్టర్ జగనాథన్ చెల్లయ్య మంగళవారమిక్కడ మీడియాకు తెలిపారు. భారత్‌లో 2015లో వివిధ కంపెనీలు రిటైల్ ప్యాక్‌లలో 9 కోట్ల యూనిట్ల యూఎస్‌బీ, మైక్రో ఎస్‌డీ, కెమెరా కార్డులు విక్రయించాయని చెప్పారు. తమ ఉత్పత్తుల అభివృద్ధిలో బెంగళూరు ఆర్‌అండ్‌డీ కేంద్రం కీలకపాత్ర పోషిస్తోందన్నారు. 2 జీబీ, 4జీబీ మైక్రోఎస్‌డీ కార్డుల విక్రయాలను భారత్‌లో నిలిపివేశామని, 8 జీబీ ఆపైన సామర్థ్యమున్నవే అందుబాటులో ఉంచామని ఆయన చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా గతేడాది 200 కోట్ల యూనిట్లను శాన్‌డిస్క్ విక్రయించిందని తెలిపారు. ఆపిల్ ఫోన్ల కోసం అన్ని ఫార్మాట్స్‌ను సపోర్ట్ చేసే ఐ-ఎక్స్‌పాండ్ ఫ్లాష్ డ్రైవ్‌ను 16-128 జీబీ సామర్థ్యంలో శాన్‌డిస్క్ రూపొందించింది. ధరల శ్రేణి రూ.4,490-10,990 మధ్య ఉంది.